Share News

Mancherial: ఎట్టకేలకు సొమ్ము డిపాజిట్‌!

ABN , Publish Date - Nov 05 , 2026 | 12:01 AM

మంచిర్యాల, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల ఈపీఎఫ్‌ (ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌), ఈఎస్‌ఐ (ఎంప్లాయీ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌) బకాయిలు రూ.3.42కోట్లను ఎట్టకేలకు అధికారులు చెల్లించారు.

Mancherial:   ఎట్టకేలకు సొమ్ము డిపాజిట్‌!

-అవుట్‌ సోర్సింగ్‌ కార్మికులకు ఈపీఎఫ్‌ చెల్లింపు

-బ్యాంకు అకౌంట్లలో రూ.3 కోట్లు జమచేసిన బల్దియా

-ఎనిమిది సంవత్సరాలుగా చెల్లించని అధికారులు

-హర్షం వ్యక్తం చేస్తున్న కార్మికులు

మంచిర్యాల, నవంబరు 4 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల ఈపీఎఫ్‌ (ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌), ఈఎస్‌ఐ (ఎంప్లాయీ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌) బకాయిలు రూ.3.42కోట్లను ఎట్టకేలకు అధికారులు చెల్లించారు. నగరంలో పారిశుధ్య పనులు మొదలుకొని విద్యుదీకరణ, ఆఫీస్‌ సబార్డినేట్‌, వాటర్‌ సప్లై, డ్రైవర్‌, తదితర విధులు నిర్వహిస్తున్న 138మంది కార్మికులకు సంబంధించి ఎనిమిదేళ్లుగా నగరపాలక సంస్థ వాటా చెల్లింపులు పెండింగులో ఉన్నాయి. కార్మికుల వేతనాల నుంచి కొంత మొత్తం వెచ్చిస్తే.. దానికి దాదాపు సరిపడా మొత్తాన్ని మున్సిపాలిటీ చెల్లించాల్సి ఉంటుంది. అలా రెండు పద్దులను కార్మికుల ఈఎస్‌ఐ, ప్రావిడెంట్‌ ఫండ్‌ ఖాతాలో జమ చేయాలని కార్మికశాఖ నిబంధనలు చెబుతున్నాయి. ఆ విధంగా తమ ఖాతాల్లో జమ అయిన మొత్తం నుంచి కొంత నగదును అత్యవసర పరిస్థితుల్లో కార్మికుడు వినియోగించుకొనే అవకాశం ప్రావిడెంట్‌ ఫండ్‌ చట్టం కల్పించింది. అయితే కార్మికుల వేతనాలను మినహాయించిన మున్సిపల్‌ అఽధికారులు తమ వాటాను మాత్రం జమ చేయకపోవడం కార్మికులకు శాపంగా మారింది.

భవిష్యత్తుకు భరోసా..

వివిధ ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేటు సంస్థలు, సంఘటిత రంగాల్లో పనిచేస్తూ నెలవారీ వేతనం కనీసం రూ.17,500 లోపు ఉన్న కార్మికులు, ఉద్యోగులంతా ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ పథకాల్లో చేరేందుకు అర్హులు. కార్మికుల భవిష్యత్తుకు భోరోసా కల్పించే ఉద్దేశ్యంతో పథకాలను ప్రభుత్వాలు ప్రవేశపెట్టాయి. ఈపీఎఫ్‌ నిబంధనల మేరకు కార్మికుని వేతనం నుంచి 12 శాతం మినహాయించి, దానికి 13శాతం మునిసిపాలిటీ కలపాల్సి ఉంటుంది. ఈఎస్‌ఐకి సంబంధించి కార్మికుల నెలవారీ వేతనంలో 0.75 శాతం చెల్లించాల్సి ఉండగా, మరో 3.25శాతం యాజమాన్యాలు తమ వాటా కింద భరించాల్సి ఉంటుంది. ఆ మొత్తాన్ని కార్మికుని ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ ఖాతాల్లో ప్రతినెలా జమ చేయాల్సి ఉంది.

ఎనిమిదేళ్లుగా పెండింగ్‌..

మంచిర్యాల మునిసిపల్‌ కార్పొరేషన్‌లో మొత్తం 513మంది ఔట్‌సోర్సింగ్‌ కార్మికులు పని చేస్తుండగా, వారిలో 138మందికి సంబంఽధించిన ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లింపులు ఏమిదేళ్లుగా నిలిచిపోయాయి. గతంలో నస్పూర్‌ మునిసిపాలిటీ ప్రత్యేకంగా ఉన్న సమయంలో అక్కడ విధులు నిర్వహించే 138మంది కార్మికులకు అప్పటి అధికారులు తమవంతు వాటా చెల్లింపులు చేయలేదు. దీంతో వారంతా తమ భవిష్యనిధి నుంచి అత్యవసర సమయాల్లో రుణం పొందే అవకాశాన్ని కోల్పోగా, అనారోగ్యం పాలైన సందర్భంలో ఉచితచికిత్సలకు దూరమయ్యారు. కార్మికులకు మునిసిపాలిటీ వాటాకు సంబంధించి 2018నుంచి చెల్లింపులు నిలిచిపోగా, వడ్డీతో కలిపి దాదాపు రూ.3.42కోట్లు చెల్లింపులు పెండింగ్‌లో ఉన్నాయి. అయితే తమ నెలవారీ వేతనాల్లో నుంచి సంబంధిత అధికారులు పథకాల పేరిట కోతవిధించినట్లు కొందరు కార్మికులు చెబుతుండటం గమనార్హం. ఒకవేళ ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లింపులు చేయని పక్షంలో పూర్తి వేతనం అందజేయాల్సి ఉండగా, కార్మికులు తమకు అందలేదని వాపోతున్నారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగా 138మంది ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల జీవితాలు అంధకారంలోకి వెళ్లాయి. ఆ ఎనిమిదేళ్ల కాలంలో అనేక మంది కార్మికులు ఆనారోగ్యం పాలుకాగా, ఇతరత్రా అవసరాల కోసం పెద్దమొత్తంలో అప్పులు చేయాల్సి వచ్చిందని కొందరు బాధితులు తెలిపారు. కాగా నస్పూర్‌ మునిసిపాలిటీ మంచిర్యాల కార్పొరేషన్‌లో విలీనం అయిన తరువాత అధికారులు కార్మికుల ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లింపులను సరిచూడగా, నస్పూర్‌లో పనిచేస్తున్న కార్మికులకు డబ్బులు జమకావడం లేదన్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో కార్పొరేషన్‌ అధికారులు హడావుడిగా గత మేనెలలో బకాయిపడ్డ రూ.3.42కోట్లకు సరిపడా విలువైన చెక్కులను కరీంనగర్‌లోని ఈపీఎఫ్‌ కార్యాలయ అధికారులకు అందజేశారు. ఈ విషయమై ’అధికారుల నిర్లక్ష్యం..కార్మికులకు శాపం’ శీర్షికన జూలై 28వ తేదీన ’ఆంధ్రజ్యోతి’లో కథనం కూడా ప్రచురితమైంది. స్పందించిన అధికారులు బకాయి పడ్డ నిధుల్లో నుంచి కార్మికుని ఖాతాలో రూ.లక్ష పై చిలుకు నగదును వారంరోజుల కిందట జమచేశారు. అయితే ఎనిమిదేళ్లపాటు బకాయిలు చెల్లిం చకపోవడంతో కార్మికులకు జరిగిన నష్టాన్ని ఎలా పూడుస్తారన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

సంతోషంగా ఉంది..

సుదమల్ల హరికృష్ణ, మునిసిపల్‌ కాంట్రాక్ట్‌ కార్మిక సంఘం గౌరవాధ్యక్షుడు

పెండింగులో ఉన్న కార్మికుల ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ బకాయిలను వారి ఖాతాల్లో జమ చేయడం సంతోషంగా ఉంది. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు కృషితోనే అధికారులు స్పందించి బకాయిలు చెల్లించారు. ఎమ్మెల్యేకు కార్మికుల పక్షాన రుణపడి ఉంటాం. ఇకమీదటైనా మునిసిపల్‌ అధికారులు బకాయిలు లేకుండా ఎప్పటికప్పుడు ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ వాటాలను చెల్లించి కార్మికుల ప్రయోజనాలను కాపాడాలి.

Updated Date - Nov 05 , 2026 | 12:02 AM