Share News

Mancherial: మహిళా సంఘాల సభ్యులకు ఈకేవైసీ

ABN , Publish Date - Aug 23 , 2026 | 11:45 PM

కోటపల్లి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాల సభ్యుల అభ్యున్నతికి కేంద్రప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది.

Mancherial:  మహిళా సంఘాల సభ్యులకు ఈకేవైసీ

- నేరుగా పథకాలు అందించే యోచన

- ఇప్పటికే లోకోస్‌ యాప్‌లో సమస్త సమాచారం

- కొనసాగుతున్న సభ్యుల ఈ కేవైసీ

కోటపల్లి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాల సభ్యుల అభ్యున్నతికి కేంద్రప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది. సంక్షేమ పథకాలు అర్హులకే అందాలని భావిస్తున్నది. పొదుపు సంఘాల్లో సభ్యులకు ఈకేవైసీ తప్పనిసరి చేసింది. జిల్లావ్యాప్తంగా ఐకేపీ సిబ్బంది ప్రస్తుతం అదేపనిలో నిమగ్నమై ఉన్నారు. పొదుపు సంఘాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని లోకోస్‌ యాప్‌లో ఇప్పటికే నిక్షిప్తం చేశారు. సంఘంలో చేరిన తర్వాత వారి ఆర్థిక ప్రగతి, తీసుకున్న రుణాలు, వాయిదాల చెల్లింపులు, చెల్లించిన వడ్డీ, స్ర్తీనిధి రుణాలు, కొనసాగిస్తున్న వ్యాపారం, లాభాలు తదితర వివరాలు సభ్యురాలి వారీగా ఎప్పటికప్పుడు నమోదు చేస్తున్నారు. తాజాగా సభ్యులకు సంబంధించి ఆధార్‌ అనుసంధాన ప్రక్రియలో భాగంగా ఈకేవైసీ చేస్తున్నారు. సభ్యురాలి ఫొటో, ఆధార్‌లో ఉన్న ఫొటో ఒకేలా ఉంటేనే ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు వీలుంటుంది. ఆధార్‌ అప్‌డేట్‌ చేయించుకోకపోతే ఈకేవైసీ చేయలేని పరిస్థితి నెలకొంటుంది. ఫోన్‌ నంబర్‌ కూడా ఆధార్‌కు అనుసంధానం ఉండాల్సిందే. ఆధార్‌ నవీకరణ, మొబైల్‌ నంబర్లు అనుసంధానం కావడంతో ముందుగా ఆధార్‌ కేంద్రాలకు వెళ్లి వివరాలను నమోదు చేసుకున్నాకే ఈకేవైసీ చేయించుకోవాల్సి ఉంటుంది.

- పథకాలు లబ్ధిదారులకు చేరేలా..

కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు నేరుగా లబ్ధిదారులకు చేరేలా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది. గ్రామ పంచాయతీలకు 15వ ఆర్ధికసంఘం నిధులు, రైతులకు కిసాన్‌ సమ్మాన్‌ నిధి ఇలాగే జమచేస్తున్న విషయం తెలిసిందే. జాతీయ గ్రామీణ జీవనోపాఽధుల మిషన్‌(ఎన్‌ఆర్‌ఎల్‌ఎం) ద్వారా మహిళా అభ్యున్నతికి కేటాయించే నిధులను సైతం దీని పరిధిలోకి తీసుకువచ్చే అవకాశం ఉంటుంది. కేంద్రంద్వారా అమలు చేస్తున్న పథకాలు నేరుగా మహిళా సంఘాల సభ్యులకు చేర్చాలన్న యోచనలో భాగంగా ఈ కేవైసీ నమోదు చేసినట్లు తెలుస్తున్నది. దీనివల్ల అనర్హులు పొదుపు సంఘాల్లో కొనసాగేందుకు వీలుండదు.

- జిల్లాలో 42శాతం పూర్తి..

సంఘాల సభ్యుల ఈకేవైసీ జిల్లాలో ఇప్పటివరకు 42శాతం మాత్రమే పూర్తి అయ్యింది. జిల్లాలో 96,300మంది సభ్యులకు ఈ కేవైసీ చేయాల్సి ఉండగా ప్రస్తుతం 40,514మంది సభ్యులకు ఈ కేవైసీ పూర్తి కాగా 42.07శాతం లక్ష్యం మాత్రమే నెరవేరింది. ఇందులో లక్షెట్టిపేట మండలం 60.80శాతం లక్ష్యాన్ని పూర్తిచేసి టాప్‌లో ఉండగా హాజీపూర్‌ మండలం కేవలం 27.17శాతం లక్ష్యాన్ని మాత్రమే చేరుకుంది. ఇక మండలాల వారీగా చూస్తే కన్నెపల్లి 31.08శాతం, వేమనపల్లి 31.46శాతం, చెన్నూరు 33.28శాతం, కోటపల్లి 33.76 శాతం, తాండూర్‌ 35.40శాతం, దండేపల్లి 37.12శాతం, బెల్లంపల్లి 38.58శాతం , భీమిని 41.85శాతం, నెన్నెల 42.25శాతం, భీమారం 42.87శాతం, కాసిపేట 50.10, జైపూర్‌ 50.40శాతం, జన్నారం 53.48శాతం, మందమర్రి 54.59శాతం లక్ష్యం నెరవేర్చాయి. ఇక జిల్లాలో మిగిలిన 40,514మంది సభ్యుల ఈకేవైసీ చేసేందుకు ఆయామండలాల్లో ఐకేపీ సిబ్బంది కసరత్తు చేస్తున్నారు. అయితే కొంతమంది సభ్యురాలి ఫొటో, ఆధార్‌లో ఉన్న ఫొటో ఒకేలా లేకపోవడం, కొందరు ఆధార్‌ అప్‌డేట్‌ చేయించుకోకపోవడం, కొందరు ఫోన్‌ నంబర్‌ ఆధార్‌కు అనుసంధానం లేకపోవడంతో ఈకేవైసీ నత్తనడకన సాగుతున్నది.

Updated Date - Aug 23 , 2026 | 11:45 PM