Share News

Mancherial: నగరవాసులకు తాగునీటి కష్టాలు..

ABN , Publish Date - Aug 13 , 2026 | 12:00 AM

మంచిర్యాల, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల నగరవాసులను తాగునీటి కష్టాలు వీడటం లేదు. రోజుల తరబడి సరఫరా నిలిచిపోవడంతో

 Mancherial:  నగరవాసులకు తాగునీటి కష్టాలు..

- రాళ్లవాగులో కొట్టుకుపోయిన పైప్‌లైన్‌

- మరమ్మతులతో 12రోజులు సరఫరా బంద్‌

- విద్యుత్‌ మోటార్ల మొరాయింపుతో మళ్లీ అంతరాయం

- ముందస్తు చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలం

మంచిర్యాల, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల నగరవాసులను తాగునీటి కష్టాలు వీడటం లేదు. రోజుల తరబడి సరఫరా నిలిచిపోవడంతో గుక్కెడు నీటికోసం అష్టకష్టాలు పడవలసి వస్తోంది. మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని ముల్కల్ల వద్ద రూ.24.5కోట్లతో నిర్మించిన పంప్‌హౌజ్‌ నుంచి మంచినీరు సరఫరా అవుతోంది. అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ స్కీం ఫర్‌ స్మాల్‌ అండ్‌ మీడియం టౌన్స్‌ (యూఐడీఎస్‌ఎస్‌ఎంటీ) పథకం కింద 2005లో నిధులు మంజూరుకాగా 2008లో పనులు ప్రారంభమయ్యాయి. 2014లో ఫిల్టర్‌ బెడ్‌ నిర్మాణ పనులు పూర్తి కావడంతో నిరంతరంగా మంచినీరు సరఫరా అవుతోంది. మిషన్‌ భగీరథ పథకంలో భాగంగా ఎల్లంపల్లి ప్రాజెక్టు వద్ద నిర్మించిన ఇన్‌టెక్‌వెల్‌ నుంచి ముల్కల్లలోని పంప్‌హౌజ్‌ ఫిల్టర్‌బెడ్‌లోనికి నీటిని సరఫరా చేస్తున్నారు. అక్కడి నుంచి నగరంలోని వివిధ ఏరియాల్లో నిర్మించిన రిజర్వాయర్ల ద్వారా నిత్యం సుమారు 14ఎంఎల్‌డీ నీరు ప్రజలకు అందిస్తున్నారు.

కొట్టుకుపోయిన పైప్‌లైన్‌..

జిల్లా కేంద్రంలోని రాళ్లవాగు కాజువే వద్ద నగరానికి నీటిని సరఫరా చేసేందుకు పైప్‌లైన్‌ నిర్మాణాన్ని చేపట్టారు. 2005లో కాజువే వంతెన నిర్మించగా, దాన్ని ఆనుకొని వాగులో నుంచి పైప్‌లైన్‌ నిర్మాణం చేపట్టారు. ఇంతకాలం బాగానే ఉన్నా.. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాళ్లవాగు ఉధృతంగా ప్రవహించడంతో వంతెనతోపాటే మంచినీటి పైప్‌లైన్‌ కూడా వరదలో కొట్టుకుపోయింది. ఇదిలా ఉండగా 2000సంవత్సరంలో కురిసిన అతి భారీవర్షాలకు మంచిర్యాల, పాతమంచిర్యాల నడుమ రాళ్లవాగుపై ఉన్న హైలెవల్‌ వంతెన నామరూపాలు లేకుండా కొట్టుకుపోయింది. రాకపోకలకు ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. అనంతరం రంగంపేట-బైపాస్‌ రోడ్డు ఏరియాను కలిపేలా రాళ్లవాగులో లోలెవల్‌ కాజువే వంతెనను నిర్మించారు. అయితే భారీవర్షాలు కురిసినప్పుడల్లా లోలెవల్‌ వంతెన నీటమునగడం ఆనవాయితీగా వస్తోంది. రాళ్లవాగు ఉధృతికి ప్రతియేటా కాజువే వంతెన కూలుతుండగా, తాత్కాలిక మరమ్మతులతో సరిపెడుతున్నారు. వంతెనను ఆనుకొని ఉన్న మంచినీటి పైప్‌లైన్‌ ఉన్నప్పటికీ ఇంతకాలం దానికి ఎలాంటి నష్టం వాటిళ్లలేదు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాజువే వంతెన పూర్తిగా కొట్టుకుపోవడంతో పైప్‌లైన్‌ కూడా చెల్లాచెదురైంది. వర్షాకాలంలో తీవ్ర ఉగ్రరూపం దాల్చే రాళ్లవాగులో మంచినీటి పైప్‌లైన్‌ నిర్మించడం అనాలోచిత చర్యగా ప్రజలు భావిస్తున్నారు.

12రోజులపాటు నిలిచిన నీటి సరఫరా..

భారీ వర్షాల కారణంగా పైప్‌లైన్‌ కొట్టుకుపోవడంతో మరమ్మతులు చేసేందుకు 12రోజుల సమయం పట్టింది. మరమ్మతులు పూర్తికావడంతో ఈనెల11న మంచినీటి సరఫరా పునరుద్దరించారు. కేవలం ఒకే ఒక్కరోజు నీరు సరఫరా అయిన తరువాత తాజాగా నీటి సరఫరాకు మళ్లీ అంతరాయం ఏర్పడింది. ముల్కల్ల పంప్‌హౌజ్‌లో భారీ విద్యుత్‌మాటార్లు మొరాయించడంతో బుధవారం మంచి నీటి సరఫరా జరుగలేదు. మోటార్లు పనిచేయకపోవడంతో నగరంలోని వివిధ రిజర్వాయర్లకు నీరు ఎక్కించే వీలు లేకుండా పోయింది. మొన్నటివరకు ఏకదాటిగా 12రోజులపాటు తాగునీటికి అష్టకష్టాలు పడ్డ నగరవాసులు మినరల్‌ వాటర్‌ప్లాంట్ల వద్దకు పరుగులు పెట్టారు. అయినప్పటికీ ఇంట్లో వాడకానికి నీరు దొరక్క నానాబాధలు అనుభవించారు. ఎట్టకేలకు నీటిసరఫరా పునరుద్దర ణతో కొంతమేర ఊపిరి పీల్చుకున్నారు. కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే మళ్లీ అంతరాయం ఏర్పడ టంతో వారి ఉత్సాహం ఆవిరైపోయింది. పాలకవర్గం, అధికారుల నిర్లక్ష్య ధోరణిపట్ల తీవ్ర ఆగ్రహా వేశాలు వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌మోటార్ల పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టకపోవ డంతోనే అవి మొరాయించాయని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో విఫలం అయినందునే నీటి కష్టాలు ఎదురయ్యాయనే భావనలో ప్రజలు ఉన్నారు.

హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణం జరిగితే...

ప్రజల విన్నపాల మేరకు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు ప్రత్యేక శ్రద్ధతో కాజువే స్థానంలో హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి పూనుకున్నారు. తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ (టీయూఎఫ్‌ఐడీసీ) నిధులు రూ.13.50కోట్లతో హైలెవల్‌ వంతెన నిర్మాణానికి 10మార్చి 2024న భూమిపూజ చేశారు. వంతెన నిర్మాణానికి సాయిల్‌ టెస్ట్‌ పనులు కూడా పూర్తయ్యాయి. బైపాస్‌ రోడ్డులోని తెలంగాణ అమరవీరుల స్థూపం మొదలుకొని వాగు అవతలివైపు వరకు సుమారు 200మీటర్ల పొడవుతో వంతెన నిర్మాణం జరుగనుండగా, మొత్తంగా రూ.20కోట్ల వరకు ఖర్చవుతుందని అంచనా వేశారు. హైలెవల్‌ వంతెన నిర్మాణం పూర్తయితే, దానికి సమాంతరంగా పైప్‌లైన్‌ నిర్మాణం కూడా జరుగనుంది. దీంతో రాళ్లవాగు ఉధృతి పెరిగినా పైప్‌లైన్‌కు ఎలాంటి నష్టం వాటిల్లే అవకాశం ఉండదు. అయితే రెండేళ్లు గడుస్తున్నా సాయిల్‌ టెస్ట్‌ మినహా వంతెన నిర్మాణ పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకొని హైలెవల్‌ వంతెన నిర్మించడం ద్వారా ప్రజల సమస్యలు పరిష్కరించవలసిన అవసరం ఎంతైనా ఉందనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Aug 13 , 2026 | 12:00 AM