Mancherial: స్కీంల పేరుతో శఠగోపం..
ABN , Publish Date - Nov 11 , 2026 | 11:46 PM
మంచిర్యాల, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): మా స్కీముల్లో సభ్యులుగా చేరండి.. మీ ఇంటిని స్వర్ణమందిరంగా మార్చుకోండి.. అంటూ ప్రకటనలు గుప్పిస్తూ అందినంత దండుకుంటున్నారు వ్యాపారులు.
- లాటరీల పద్ధతిలో దండుకుంటున్న వ్యాపారులు
- నష్టాల పేరుతో షాపుల మూసివేత
- లబోదిబోమంటున్న బాధితులు
- పండుగల దినాల్లో ఊపందుకుంటున్న అక్రమ వ్యాపారం
మంచిర్యాల, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): మా స్కీముల్లో సభ్యులుగా చేరండి.. మీ ఇంటిని స్వర్ణమందిరంగా మార్చుకోండి.. అంటూ ప్రకటనలు గుప్పిస్తూ అందినంత దండుకుంటున్నారు వ్యాపారులు. వస్త్రదుకాణాలు, వాహనాల షోరూంలు, జువెల్లరీ షాపులు ఇలా అన్ని దుకాణాలలో స్కీంల పరంపర విజయవంతంగా కొనసాగుతోంది. లాటరీల పద్ధతిలో బహుమతి గెలుచుకోండి.. మిగతా వాయిదాలు చెల్లించాల్సిన అవసరం లేదంటూ ప్రజలను మభ్యపెడుతూ కోట్లలో డబ్బులు ఆర్జిస్తున్నారు. కేవలం ధనార్జనే ధ్యేయంగా, స్కీముల పరంపరతో షాపులను ప్రారంభించే వారు సైతం ఉన్నారంటే ఆ వ్యాపారం ఎంత లాభసాటిగా ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇదిలావుంటే మొదట సక్రమంగా లాటరీలద్వారా విజేతలను ఎంపికచేస్తూ ప్రజల నమ్మకం పొందగానే అందినకాడకి దండుకుని బోర్డులు తిప్పేసే దుకాణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. జిల్లావ్యాప్తంగా స్కీంలు నిర్వహించే షాపులు ఇప్పటికీ పదుల సంఖ్యలో బోర్డులు తిప్పివేయగా, కేసులు నమోదైన దాఖలాలు కోకొల్లలుగా ఉన్నాయి. నెలసరి కిస్తుల పేరుతో స్కీంలు నిర్వహిస్తున్న వ్యాపారులు వినియోగదారుల నుంచి పెద్దమొత్తంలో డబ్బులు వసూలు చేస్తూ రొటేషన్ చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి.
సభ్యులకు టోకరా వేస్తున్నారిలా..
స్కీంలలో చేరే సభ్యులకు ప్రతీనెలా డ్రాతీస్తూ అప్పటికి చెల్లించిన మొత్తానికి సరిసమానంగా నిర్వాహకులు బహుమతి అందజేస్తూ ఆకట్టుకుంటారు. వ్యాపారులు నిర్ణయించే బహుమతి తప్పా డబ్బులు కానీ, ఇతర వస్తువులు కానీ తీసుకునే వెసులుబాటు సైతం వినియోగదారులకు ఇవ్వరు. నెలకు రూ.2వేల నుంచి రూ.5వేల వరకు కిస్తులు చెల్లించేవిధంగా స్కీములు రూపొందించి 10 నెలలు కాలపరిమితితో సభ్యులను చేర్చుకుంటారు. ఈ విధంగా ఒక్క మంచిర్యాల నగరంలోనే పదుల సంఖ్యలో షాపుల్లో స్కీంలు నిర్వహిస్తూ దాదాపు 2వేల మంది సభ్యులను చేర్చుకున్నట్లు తెలుస్తోంది. స్కీముల్లో చేరిన సభ్యుల నుంచి నెలసరి కిస్తుల రూపంలో కోట్లాది రూపాయలను అక్రమంగా వసూలు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. స్కీముల్లో చేరిన సభ్యులు డ్రాలో వస్తువు పొందినట్లయితే మిగతా కిస్తులు చెల్లించాల్సిన అవసరం లేకపోవడంతో సహజంగానే వాటివైపు మొగ్గుచూపుతూ నిలువునా మోసపోతున్నట్లు తెలుస్తోంది.
చట్టరిత్యా నేరమని తెలిసినా...
లాటరీలు, స్కీంల పేరుతో ప్రజలను మభ్యపెట్టి వ్యాపారం చేయడం చట్టరీత్యా నేరమని తెలిసినా కొందరు వ్యాపారులు ఽధనార్జనే ధ్యేయంగా అక్రమాలకు పాల్పడుతూ అందినకాడకి దండుకుంటున్నారు. కేవలం స్కీంల ఆధారంగా వ్యాపారం ప్రారంభించే వారు మంచిర్యాల లాంటి పట్టణాల్లో అధిక కిరాయిలను చెల్లిస్తూషాపులను అద్దెకు తీసుకుంటున్నారు. లక్షల రూపాయల్లో దుకాణాల అడ్వాన్స్‌లు చెల్లించి వేలల్లో నెలసరి కిరాయి చెల్లించే వ్యాపారులు, నష్టాలు సంభవించగానే బోర్డులు తిప్పేయడం ఇక్కడ సహజమైపోయింది. జిల్లా కేంధ్రంలోని ఓ జువెల్లరీ షాపు నిర్వాహకులు ఆ మధ్య స్కీముల పేరుతో పెద్ద మొత్తంలో సభ్యుల నుంచి డబ్బులు సేకరించి బోర్డును తిప్పేశారు. ఇందులో చేరిన వందలాదిమంది బాధితులు పోలీస్‌స్టేషన్ చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకుండా పోయింది. అలాగే స్టేషన్‌రోడ్‌లోని మరో జువెల్లరి షాపు కొంతకాలంగా తెరవకపోయేసరికి స్కీంలో చేరిన సభ్యులు ఆందోళన చెందారు. గతంలో పెద్ద ఎత్తున స్కీములు నిర్వహించి నష్టాల పాలైన పట్టణానికి చెందిన చిలువేరు శ్రీకాంత్ అనే నగల వ్యాపారి బార్యా పిల్లలతో కలిసి ఆత్మహత్యకు యత్నించగా దంపతులిద్దరూ తనువు చాలించారు. ఈ ఘటనలో అందులో చేరిన సభ్యులకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లింది. అలాగే జిల్లా కేంద్రంలోని మరో జువెల్లరీ షాపు యజమానులు రెండు సంవత్సరాల క్రితం బోర్డు తిప్పేయడంతో ప్రజలు ఽనిలువునా మోసపోయారు. షాపు యజమాని, అతని ఇద్దరు కుమారులు కొంతకాలంగా స్థానికంగా నగల దుకాణం నిర్వహిస్తున్నారు. పట్టణంతోపాటు పరిసర ప్రాంతాలకు చెందిన పలువురు పరిచయస్తుల నుంచి నగల తయారీ కోసం పెద్ద మొత్తంలో బంగారం, డబ్బులు తీసుకున్నారు. అలాగే తెలిసిన వారి నుంచి భారీమొత్తంలో అప్పులు కూడా చేసినట్లు తెలుస్తోంది. అలా సేకరించిన డబ్బులను షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. ఈ క్రమంలో నగలు, డబ్బులు ఇచ్చిన వారు ఒత్తిడి తెస్తుండటంతో తట్టుకోలేక యజమాని కుమారుడు పరార్ అయ్యాడు. దీంతో తండ్రిపై ఒత్తిడి పెరగడంతో అతను కూడా కుటుంబ సభ్యులతో కలిసి ఇల్లు వదిలి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో నిర్వాహకులు దాదాపు రూ. 10 కోట్లకు పైగా అప్పులు చేసి ఉడాయించినట్లు భావిస్తున్నారు.
పండగదినాల్లో పెరుగుతున్న అక్రమ వ్యాపారం..
దసరా, దీపావళి తదితర పండగలతోపాటు ఆషాడం, శ్రావణమాసాలను పురస్కరించుకుని స్కీంల నిర్వాహకులు మరిన్ని ఆకర్షణీయైున ప్రకటనలతో ప్రజలకు కుచ్చుటోపీ పెట్టడం ఆనవాయితీగా వస్తోంది. ధరల తగ్గుదల పేరుతో వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రకటనలు గుప్పిస్తూ స్కీంలలో చేర్పించుకుంటున్నారు. దీపావళి పండగను పురస్కరించుకుని జిల్లాలోని వివిధ షో రూముల్లో పదుల సంఖ్యలో రకరకాల స్కీములు ప్రారంభించి వందల సంఖ్యలో సభ్యులను చేర్పిం చినట్లు ప్రచారం జరుగుతోంది. సామాన్య ప్రజల అవసరాలను ఆసరాగా తీసుకుంటున్న పలువురు వ్యాపారులు చివరికి వారి నెత్తిన శఠగోపం పెడుతూ అందినకాడికి దండుకుంటున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. గతంలో మాదిరిగా అక్రమార్కులు ఉడాయించకముందే పోలీసులు చర్యలు తీసు కోవలసిన అవసరం ఎంతైనా ఉంది.