Share News

Mancherial: దసరా హంగామా!

ABN , Publish Date - Oct 15 , 2026 | 12:17 AM

మంచిర్యాల, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): మార్కెట్లో దసరా పండుగ హంగామా మొదలైంది. వారం రోజులు ముందుగానే పండుగ షాపింగ్‌లు ప్రారంభమయ్యాయి.

Mancherial:  దసరా హంగామా!

-షాపుల్లో భారీ ఆఫర్లు

-హోం నీడ్స్‌ షోరూముల్లో బంపర్‌ బొనాంజాలు

-కస్టమర్లను ఆకట్టుకునేందుకు యజమానుల తంటాలు

మంచిర్యాల, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): మార్కెట్లో దసరా పండుగ హంగామా మొదలైంది. వారం రోజులు ముందుగానే పండుగ షాపింగ్‌లు ప్రారంభమయ్యాయి. దసరా పండుగను క్యాష్‌ చేసుకునేందుకు వ్యాపార వర్గాలకు చెందిన వారు వినూత్నరీతిలో ప్రచారం చేపడుతున్నారు. వివిధ రకాల వస్తువులపై బంపర్‌ బొనాంజా ఆఫర్లు ప్రకటించడం ద్వారా వినియోగదారులను ఆకర్శించే పనిలో నిమగ్నమయ్యారు. ఒక వస్తువు కొంటే మరొకటి ఉచితం.. గృహోపకరణలపై వెండి, బంగారు నాణాలతోపాటు ఎలక్ర్టిక్‌ స్కూటర్లు, నగదు బహుమతులు అంటూ బంపర్‌ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. దీంతో మార్కెట్‌లో చిన్న దుకాణాలు మొదలుకొని పెద్ద షాపింగ్‌ మాల్స్‌, షోరూంల వరకు వ్యాపార సంస్థలన్నీ కష్టమర్లతో కిటకిటలాడుతున్నాయి.

ద్విచక్ర వాహనాలపై తగ్గింపు..

దసరా పండుగను పురస్కరించుకొని వివిద రకాల ద్విచక్రవాహనాలపై గరిష్టంగా రూ.3వేల వరకు తగ్గించి విక్రయిస్తున్నారు. ఆఫర్లకు తోడు స్కూటర్లు, మోటార్‌ సైకిళ్లలో నూతన మోడళ్లను అందుబాటులో ఉంచారు. పండుగ సెంటిమెంట్‌ను క్యాష్‌ చేసేందుకు షోరూంల నిర్వాహకులు పెద్ద మొత్తంలో ద్విచక్రవాహనాలను అందుబాటులో ఉంచగా, కార్ల బుకింగ్‌లు కూడా ఆశాజనకంగా ఉన్నట్లు నిర్వాహకులు చెబుతున్నారు. వివిధ రకాల ఫర్నీచర్‌ ధరలు సైతం ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. డబుల్‌ కాట్‌లు రూ.26వేలు ధరల్లో లభిస్తుండగా పండుగ ఆఫర్‌లో భాగంగా కేవలం రూ. 18వేల నుంచి 19వేలకే విక్రయిస్తున్నారు.

కిటకిటలాడుతున్న బట్టల దుకాణాలు..

బట్టల దుకాణాలు, రెడీమేడ్‌ షోరూంలు, కిడ్స్‌ వేర్‌ షాపులు వినియోగదారులతో కిటకిటలాడుతున్నాయి. ట్రెండును బట్టి రకరకాల డిజైన్లు, రంగులతో రెడీమేడ్‌ వస్త్రదుకాణాలు ప్రజల అభిరుచికి అనుగుణంగా పెద్ద మొత్తంలో స్టాక్‌ను అందుబాటులో ఉంచాయి. పెద్ద పెద్ద షోరూంల్లో రూ.5వేల కొనుగోళ్లపై వెండి నాణెం బహుమతిగా అందజేస్తూ కష్టమర్లను ఆకర్శిస్తున్నారు. సామాన్య ప్రజలకు అనువైన రకరకాల చీరలను రూ.200 మొదలుకొని రూ.2500ధరల్లో అందుబాటులో ఉంచారు.యువతుల కోసం చుడీదార్‌, గాగ్రా డ్రెస్సులు అందుబాటులో ధరల్లో లభిస్తున్నాయి. మెన్స్‌ వేర్‌లలో రూ. 1000కి రెండు మల్టీ బ్రాండెండ్‌ షర్టులు ఆఫర్‌ ప్రకటించడంతో యువకులు మొగ్గు చూపుతున్నారు.వివిధ బ్రాండ్‌లకు చెందిన చొక్కాల ధరలు రూ.1000 నుంచి 2500మధ్యలో అందుబాటులో ఉన్నాయి.

ఎల్‌ఈడీల్లో రూ.40వేల వరకు ఆఫర్‌..

ప్రస్తుతం మార్కెట్లో 24అంగుళాలు మొదలుకొని గరిష్టంగా 55 అంగుళాల పొడవులో ఎల్‌ఈడీ టీవీలు అందుబాటులో ఉన్నాయి. వీటి ధరలు కంపెనీ, మోడల్‌ను బట్టి రూ.12,900 మొదలుకొని రూ.4లక్షల వరకు ధరలు పలుకుతున్నాయి. మొబైల్‌ ఫోన్లపైనా ఆఫర్లు ప్రకటించారు.

ఫ్రిజ్‌ల కొనుగోళ్లపైనా షోరూంల నిర్వాహకులు భారీ ఆఫర్లు ప్రకటిస్తుండటం గమనార్హం. బ్రాండెడ్‌ కంపెనీలకు చెందిన అధునాత వాషింగ్‌ మెషీన్లుకూడా వివిధ మోడళ్లలో అందుబాటులో ఉన్నాయి. సింగరేణి కార్మికులకు యాజమాన్యం లాభాల బోనస్‌ ప్రకటించినందున ఈ సారి దసరా బిజినెస్‌ ఊపందుకుంటుందన్న చర్చ సాగుతోంది.

మద్యం ధరల తగ్గింపు..

దసరా పండుగను పురస్కరించుకొని మద్యం షాపుల నిర్వాహకులు బంపర్‌ ఆఫర్లు ప్రకటించారు. తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌, లక్షెట్టిపేట ఎక్సైజ్‌ సర్కిళ్ల పరిధిలో మొత్తం 73వైన్‌షాపులు ఉన్నాయి. ఆయాషాపుల్లో కొన్నింటిలో దసరా ఆఫర్లు ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్శిస్తున్నారు. ప్రధాన బ్రాండ్‌లైన 100పైపర్స్‌, బ్లాక్‌డాగ్‌, బ్లాక్‌అండ్‌వైట్‌, బ్యాలంటైన్స్‌, రాయల్‌ రత్నంబోర్‌, జానీవాకర్‌ రెడ్‌లేబుల్‌, బ్లోండ్‌, టీచర్స్‌, తదితర మద్యం ఫుల్‌ బాటిళ్లపై రూ.150మొదలుకొని గరిష్టంగా రూ.500వరకు తగ్గింపు ధరల్లో విక్రయిస్తున్నారు.

Updated Date - Oct 15 , 2026 | 12:17 AM