Share News

Mancherial: ' ’దసరా’ జోష్‌!

ABN , Publish Date - Oct 21 , 2026 | 11:55 PM

మంచిర్యాల, అక్టోబరు 21 (ఆంద్రజ్యోతి): దసరా పండుగ ఈ సంవత్సరం ప్రజలకు మాంచి కిక్‌ ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. గత సంవత్సరంతో పోల్చితే ఈ సారి మద్యం, ఇతర వ్యాపారాల్లో విక్రయాలు పెరడమే దీనికి నిదర్శనం.

 Mancherial: '  ’దసరా’ జోష్‌!

-గణనీయంగా పెరిగిన మద్యం అమ్మకాలు

-జిల్లాలో రూ.23.11 కోట్ల అమ్మకాలు నమోదు

-కళకళలాడిన వస్త్ర, రెడీమేడ్‌ దుకాణాలు

-గృహోపకరణాల కొనుగోళ్లకూ బారులు తీరిన జనం

-లాభాల వాటాతో జోరందుకున్న కొనుగోళ్లు

మంచిర్యాల, అక్టోబరు 21 (ఆంద్రజ్యోతి): దసరా పండుగ ఈ సంవత్సరం ప్రజలకు మాంచి కిక్‌ ఇచ్చిందనడంలో ఎలాంటి సందేహం లేదు. గత సంవత్సరంతో పోల్చితే ఈ సారి మద్యం, ఇతర వ్యాపారాల్లో విక్రయాలు పెరడమే దీనికి నిదర్శనం. దసరా పండగను పురస్కరించుకొని తెలంగాణ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా జిల్లాలోని మంచిర్యాల, బెల్లంపల్లి, చెన్నూర్‌, లక్షెట్టిపేట ఎక్సైజ్‌ సర్కిళ్ల పరిధిలోని 73 వైన్‌షాపులు, బార్లలో ఈనెల 18,19,20తేదీల్లో సుమారు రూ.23.11కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్లు అంచనా. నాలుగు సర్కిళ్ల పరిధిలో మొత్తం 19,059కేసుల లిక్కర్‌ అమ్మకాలు నమోదు కాగా 33,782కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి.

పెరిగిన మద్యం అమ్మకాలు..

దసరా పండుగను పురస్కరించుకొని ఏ వ్యాపారం ఎలా ఉన్నా మద్యం అమ్మకాలు మాత్రం విపరీతంగా జరుగుతుండం విశేషం. గత ఏడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు గణనీయంగా పెరడంతో వ్యాపారస్థులు ఆనందోత్సాహాల్లో తేలియాడుతున్నారు. 2025లో దసరా సమయంలో మూడు రోజుల పాటు సాగిన మద్యం అమ్మకాల వల్ల అబ్కారీ శాఖకు రూ.11.19కోట్ల ఆదాయం సమకూరగా ఈ సంవత్సరం గతఏడాది కంటే అదనంగా రూ.11.92కోట్ల విలువైన మద్యం అమ్మకాలు నమోదు కావడం గమనార్హం. సోమ, మంగళవారాల్లో మాంసాహారం, మద్యం సేవించని వారంతా ఒకరోజు ముందుగానో, లేదా బుధవారం రోజున వేడుకలు జరుపుకున్నారు. బుధవారం ప్రభుత్వం ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించడం కూడా ప్రజలు ఇంటివద్ద ఉండి, పండుగను జరుపుకోవడానికి దోహదపడింది. దీంతో నాలుగు రోజులపాటు ఈ ఏడాది దసరాను ప్రజలు జరుపుకున్నారు. ఈ కారణంగా మద్యం అమ్మకాల్లో వృద్ధి జరిగినట్లు భావిస్తున్నారు. దీనికి తోడు దసరా పండుగను పురస్కరించుకొని మద్యం షాపుల నిర్వాహకులు బంపర్‌ ఆఫర్లు ప్రకటించారు. ఆయా షాపుల్లో కొన్నింటిలో మద్యం ధరల్లో దసరా ఆఫర్లు ప్రకటిస్తూ కస్టమర్లను ఆకర్శించారు. ప్రధాన బ్రాండ్‌లైన 100పైపర్స్‌, బ్లాక్‌డాగ్‌, బ్లాక్‌అండ్‌వైట్‌, బ్యాలంటైన్స్‌, రాయల్‌ రత్నంబోర్‌, జానీవాకర్‌ రెడ్‌ లేబుల్‌, బ్లోండ్‌, టీచర్స్‌, తదితర మద్యం ఫుల్‌ బాటిళ్లపై రూ.200మొదలుకొని గరిష్టంగా రూ.500 వరకు తగ్గింపు ధరల్లో విక్రయించడంతో లిక్కర్‌ అమ్మకాలు పెరిగాయి. అలాగే ప్రీమియం మద్యం బ్రాండ్‌లైన బ్లెండర్స్‌ ప్రైడ్‌, సిగ్నేచర్‌, తదితర ఫుల్‌ బాటిళ్లపై రూ.150వరకు ఆఫర్లు ప్రకటించారు.

యువతలో దసరా కిక్‌..

ఈ యేడు యువత దసరాను మస్తుగా ఎంజాయ్‌ చేశారు. దసరాకు మూడు రోజుల ముందు నుంచి సాగిన మద్యం అమ్మకాలను పరిశీలిస్తే బీర్ల అమ్మకాలు ఊపందుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా మూడు రోజుల్లో ఏకంగా 33,782కేసుల బీర్ల విక్రయాలు జరుగగా, గతేడాది కేవలం 14,296కేసుల బీర్ల విక్రయాలు నమోదయ్యాయి. బీర్ల సేవనంపై యువత మక్కువ చూపడంతో ఈ ఏడాది అదనంగా 19,486 కేసుల బీర్ల విక్రయాలు జరిగాయి. అలాగే రెడీమేడ్‌ దుస్తుల షాపుల్లోనూ యువత కొనుగోళ్లు అధికంగా ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు.

కళకళలాడిన వస్త్ర దుకాణాలు..

దసరా పండుగను పురస్కరించుకొని వస్త్ర, రెడిమేడ్‌ దుకాణాలు ఈ సంవత్సరం కళకళలాడాయి. జిల్లావ్యాప్తంగా ఈ సంవత్సరం రూ.50కోట్ల మేర వ్యాపారం జరిగినట్లు అంచనా. గత సంవత్సరంతో పోలిస్తే వస్త్రదుకాణాల్లో విక్రయాలు గణనీయంగా వృద్ధి సాధించినట్లు వ్యాపారులు తెలిపారు. దసరా పండుగ నేపథ్యంలో పేరుగాంచిన షాపింగ్‌మాల్‌లు, షోరూములలో ప్రజల ఆసక్తికి అనుగుణంగా పెద్దమొత్తంలో స్టాకు ఉంచగా, ఊహించిన దానికంటే రెట్టింపు అమ్మకాలు నమోదైనట్లు తెలుస్తోంది. మరోవైపు మాంసం అమ్మకాలు కూడా అధికంగానే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.2కోట్ల విలువగల మేకలు, చికెన్‌, మటన్‌ విక్రయాలు జరిగినట్లు తెలుస్తోంది.

జోరుగా వాహనాల కొనుగోళ్లు..

దసరా పండుగను పురస్కరించుకొని వివిధ రకాల ద్విచక్రవాహనాలతోపాటు కార్లు కూడా పెద్ద మొత్తంలో అమ్ముడుపోయాయి. వివిధ వాహన షోరూంల్లో వినియోగదారులు బారులు తీరారు. ప్రధానంగా మారుతీ, టాటా, తదితర కార్ల విక్రయాలు అధికంగా నమోదైనట్లు షోరూంల నిర్వాహకులు తెలిపారు. ఇక ద్విచక్రవాహనాలపై గరిష్టంగా రూ.3వేల వరకు తగ్గింపు ధరలకు విక్రయించారు. ఫర్నీచర్‌ దుకాణాల్లోనూ భారీగానే విక్రయాలు నమోదైనట్లు తెలుస్తోంది. గృహోప కరణాలకు సంబంధించి బంపర్‌ ఆఫర్లు ప్రకటించడంతో వినియోగదారులు కొనుగోళ్లపై ఆసక్తి కనబరిచారు. ఒక వస్తువు కొంటే మరొకటి ఉచితం.. వెండి, బంగారు నాణేలతోపాటు ఎలక్ర్టిక్‌ స్కూటర్లు, నగదు బహుమతులు అంటూ బంపర్‌ ఆఫర్లు ప్రకటించారు. స్ర్కాచ్‌ కార్డులు ప్రవేశపెట్టి నగదు బహుమతులను అందజేయడంతో మార్కెట్‌లో చిన్న దుకాణాలు మొదలుకొని పెద్ద షాపింగ్‌ మాల్స్‌, షోరూంల వరకు వ్యాపార సంస్థలన్నీ కస్టమర్లతో కిటకిటలాడాయి.

లాభాల బోనస్‌ జమ చేయడంతో..

సింగరేణి కార్మికులకు యాజమాన్యం లాభాల బోనస్‌ అందజేయడంతో ఈ సంవత్సరం కొనుగోళ్లు ఊపందుకున్నాయి. లాభాల బోనస్‌ 34శాతం చెల్లించడంతో ప్రతికార్మికుడికి సగటున రూ.లక్షా 50వేల పైచిలుకు చేతికి అందడంతో దసరా కొనుగోళ్లపై దృష్టిసారించినట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ ఏడాది ప్రజలు దసరా పండుగను ఘనంగా జరుపుకోగా, వ్యాపారంలోనూ వృద్ధి కనిపించడంతో సర్వత్రా ఆనందోత్సాహాల్లో మునిగి తేలారు.

Updated Date - Oct 21 , 2026 | 11:55 PM