Share News

Mancherial: దిక్కుతోచని స్థితిలో కంప్యూటర్‌ ఆపరేటర్లు

ABN , Publish Date - Sep 02 , 2026 | 11:55 PM

మంచిర్యాల, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్ల బతుకు భారంగా మారింది.

Mancherial: దిక్కుతోచని స్థితిలో కంప్యూటర్‌ ఆపరేటర్లు

- ఎనిమిదేళ్లుగా రెవెన్యూ కార్యాలయాల్లో విధులు

- అర్ధాంతరంగా ఉద్యోగం నుంచి తొలగింపు

- కొద్ది రోజులుగా లాగిన్‌ ఇవ్వని అధికారులు

- ప్రభుత్వ నిర్ణయంతో పస్తులు ఉండాల్సిన పరిస్థితి

- ఐదు నెలలుగా వేతనాలకూ నోచుకోని వైనం

మంచిర్యాల, సెప్టెంబరు 2 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న కంప్యూటర్‌ ఆపరేటర్ల బతుకు భారంగా మారింది. అర్ధాంతరంగా ఉద్యోగాల్లో నుంచి తొలగించడంతో దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. పొమ్మనలేక పొగబెట్టిన చందంగా వారం రోజులుగా ఆపరేటర్లకు ఉన్నతాధికారులు లాగిన్‌ ఇవ్వకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ కోసం గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘ధరణి’ పోర్టల్‌ను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అన్ని మండలాల్లో తహసీల్దార్లకు సంయుక్త సబ్‌రిజిస్ట్రార్‌లుగా అదనపుబాధ్యతలను అప్పగించి, వ్యవసాయభూములకు సంబంధించిన రిజిస్ట్రేష న్‌ల విధులు కూడా వారికే కేటాయించింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్‌ కోసం ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసి పరికరాలను సమకూర్చడంతోపాటు ఎనిమిదేళ్ల క్రితం కేటగరీ-3 ఫీల్డ్‌ టెక్నికల్‌స్టాఫ్‌(ఆపరేటర్ల) నియామకాలను చేపట్టింది. అప్పటినుంచి తహసీల్దార్‌ కార్యాలయాలు, కలెక్టరేట్‌లలో విధులు నిర్వహిస్తున్నారు.

వారం రోజులుగా లాగిన్‌ బంద్‌..

రెవెన్యూ కార్యాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఆపరేటర్లకు ఉన్నతాధికారులు వారం రోజులుగా లాగిన్‌ ఇవ్వడం లేదు. వారి స్థానంలో ఆయా కార్యాలయాల్లో గ్రామపాలన అధికారులు, జూనియర్‌ అసిస్టెంట్‌లకు లాగిన్‌ ఇస్తూ విధులు కేటాయిస్తున్నారు. దీంతో తమను ఉద్యోగాల్లో నుంచి తొలగిం చారన్న ఆత్మన్యూనత భావనలో ఆపరేటర్లు మదనపడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 636, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 60మంది ఆపరేటర్లు విధులు నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్‌లో జిల్లా కోఆర్డినేటర్‌ హోదాలో ఒక్కో ఆపరేటర్‌ విధులు నిర్వహిస్తున్నారు. గతంలో కలెక్టరేట్‌లలో కోఆర్డినేటర్‌తో పాటు ఆయనకు సహాయకులుగా ఇద్దరేసి ఆపరేటర్లు(బఫర్స్‌) ఉండేవారు. ప్రస్తుతం కోఆర్డినేటర్‌ స్థాయితోపాటు మండలాల వారిగా ఆపరేటర్లుగా కొనసాగుతున్నారు. ఆపరేటర్లకు ఇచ్చే వేతనం కూడా చాలా తక్కువ. వారికి ప్రస్తుతం నెలకు రూ.12,035చొప్పున చెల్లిస్తున్నారు. మొదట్లో వీరికి రూ.10వేల చొప్పున చెల్లించేవారు. కంప్యూటర్‌ ఆపరేటర్లుగా నియమితులైనవారిలో అత్యధికులు ఇంజనీరింగ్‌, ఇతరవిభాగాలలో పట్టభద్రులే అయినప్పటికీ ప్రభుత్వం భవిష్యత్తులో వేతనాలు పెంచుతుందనే ఆశతో విధుల్లో చేరారు. కేవలం ఆపరేటర్‌ విధులే కాకుండా, తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు, ఎన్నికల సర్వే, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఇతరత్రా డేటా ఎంట్రీ కూడా వారితోనే చేయిస్తున్నారు. వేతనం తక్కువగా ఉండటం, రకరకాల పనుల కారణంగా వెట్టిచాకిరికి గురవుతున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు విధులు నిర్వహించడమేగాక, అవసరమైతే రాత్రివరకు కూడా పని చేయాల్సివస్తోంది. పైగా మండలానికి ఒక్క ఆపరేటరే ఉండడంతో అత్యవసర పని ఉన్నప్పుడో, ఆనారోగ్యానికి గురైనప్పుడో సెలవు పెట్టాల్సి వస్తే ప్రత్యామ్నాయం లేక ఇబ్బందులు పడాల్సివస్తోంది. ఒక మండలం ఆపరేటర్‌ సెలవు పెడితే పక్క మండలం ఆపరేటర్‌తో విధులు నిర్వహింపజేస్తున్నారు. ప్రస్తుతం విధులు కేటాయించకపోవడంతో వారంతా తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు.

ఐదు నెలల వేతనాలు పెండింగ్‌..

ఆపరేటర్లకు ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఆగస్టు వరకు ఐదునెలల వేతనాలు పెండింగ్‌లో ఉన్నట్లు చెబుతున్నారు. గతంలో ప్యారాడిగమ్‌-ఐటీ అనే ఏజెన్సీ ద్వారా ఆపరేటర్లకు వేతనాలు అందేవి. దాని ఒప్పందం జూలై2024తో ముగిసింది. అనంతరం అదే సంవత్సరం ఆగస్టు నుంచి కాంగ్రెస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వ టెక్నికల్‌ సర్విసెస్‌ (టీజీటీఎస్‌)కు అనుసంధానం చేసింది. ఇకమీదట ఆ ఏజెన్సీ ద్వారానే వేతనాలు చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఆపరేటర్ల వివరాలను ఏజెన్సీకి అందజేసింది కూడా. ఇంతకాలం పాటు వేతనాలు సక్రమంగా అందినప్పటికీ ఏప్రిల్‌ నుంచి పెండింగులో ఉన్నాయి. ఒక్కో ఆపరేటర్‌కు రూ.62వేల వేతన బకాయిలు రావలసి ఉంది. మొత్తంగా 60మందికి పైబడి ఉన్న ఆపరేటర్లకు రూ.సుమారు రూ.37లక్షల50వేల పైచిలుకు బకాయిలు ఉన్నాయి. సమాన పనికి సమాన వేతనం చెల్లించడంతోపాటు పెండింగ్‌లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఆపరేటర్లు కోరుతున్నారు. అసలు తాము విధుల్లో ఉన్నట్టా? లేనట్టా అన్న సందేహంలో ఆపరేటర్లు కొట్టుమిట్టాడుతున్నారు. మొదట్లో వీరిని తొలగించాలని ప్రభుత్వం అనుకున్నప్పటికీ.. తర్వాత మనసు మార్చుకుని కొత్తవారిని నియమించే బదులు వారినే కొనసాగించాలన్న నిర్ణయానికి వచ్చింది. ప్రైవేటు ఏజెన్సీ నుంచి నేరుగా ప్రభుత్వ ఆధ్వర్యంలోని టీజీటీఎస్‌కు తమను అటాచ్‌ చేయడంతో ఆపరేటర్లు ఒకింత సంతోషించారు. భవిష్యత్తులో తమ సర్వీస్‌ రెగ్యులర్‌ అవుతుందని ఆశపడ్డారు. వేతనాలు కూడా పెరుగుతాయనుకున్నారు. కానీ వారి ఆశలన్నీ ఆడియాశలయ్యాయి. వేతనాల విషయం పక్కనబెడితే... అసలు ఉద్యోగం ఉంటుందో లేదోనన్న విషమ పరిస్థితులను ఆపరేటర్లు ఎదుర్కొంటున్నారు.

అసెంబ్లీలో ప్రస్తావిస్తా..

ఎనిమిదేళ్లుగా విధుల్లో ఉన్న తమను అర్ధాంతరంగా తొలగించడంతో ఉద్యోగ భద్రత కల్పించాలని ఆపరేటర్లు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ఉద్యోగభద్రత కల్పించడంతోపాటు పెండింగ్‌ వేతనాలను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ బుధవారం జిల్లాలోని ఆపరేటర్లు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావును కలిసి వినతిపత్రం అందజేశారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఆపరేటర్ల సమస్యను పరిష్కరించేందుకుగాను త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. ఈ విషయమై అసెంబ్లీ ఇన్‌చార్జికి ఫోన్‌ చేసిన ఎమ్మెల్యే తనకు క్వశ్చన్‌ అవర్‌లో అవకాశం కల్పించాలని సూచించారు.

Updated Date - Sep 02 , 2026 | 11:55 PM