Mancherial: సీఎంఆర్ సర్దుబాటు కష్టాలు
ABN , Publish Date - Oct 01 , 2026 | 11:53 PM
మంచిర్యాల, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం రైస్ మిల్లర్లకు సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కోసం అప్పగించిన ధాన్యాన్ని మాయం చేసిన రైస్‌మిల్లర్లు.. తిరిగి ఆలోటు భర్తీ చేసేందుకు నానా కష్టాలు పడుతున్నారు.
- బియ్యం లోటు భర్తీ చేసేందుకు మిల్లర్ల తంటా
- ప్రభుత్వం కొరఢా ఝళిపిస్తుండటంతో ఆగమాగం
- పీడీఎస్ బియ్యం కొనుగోలుకు యత్నం
- ఎంఎల్‌ఎస్ పాయింట్ల ఇంచార్జిలతో కుమ్మక్కు
- తద్వారా సీఎంఆర్ భర్తీకి సన్నాహాలు
మంచిర్యాల, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం రైస్ మిల్లర్లకు సీఎంఆర్ (కస్టమ్ మిల్లింగ్ రైస్) కోసం అప్పగించిన ధాన్యాన్ని మాయం చేసిన రైస్‌మిల్లర్లు.. తిరిగి ఆలోటు భర్తీ చేసేందుకు నానా కష్టాలు పడుతున్నారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడి నుంచి పీడీఎస్ బియ్యం సేకరించడం ద్వారా సర్దుబాటు చేసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సీఎంఆర్ రికవరీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ష్టాత్మకంగా తీసుకోవడంతో అధికార యంత్రాంగం కూడా ఆ మేరకు వేగం పెంచింది. సీఎంఆర్ బకాయి ఉన్న మిల్లర్లపై రెవెన్యూ రికవరీ యాక్టు నమోదు, క్రిమినల్ కేసులు, ఆస్తుల జప్తుకు పూనుకుంటున్నారు. ప్రభుత్వం రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని సీఎమ్మార్ కోసం మిల్లర్లకు అప్పగించగా, వారు అధిక ధరలకు అమ్ముకొని కోట్లలో సొమ్ము చేసుకున్నారు. వాటిని తిరిగి భర్తీ చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. సీఎంఆర్ ధాన్యం అమ్మిన ఒక్కోమిల్లర్ సీజన్‌కు రూ.3 కోట్ల నుంచి రూ.5కోట్లకు పైగా సొమ్ము చేసుకున్నట్లు తెలుస్తోంది.
మంచిర్యాల జిల్లాలో 2022-23నుంచి సీఎంఆర్ పెండింగులో ఉండగా, ఇప్పటివరకు కూడా సర్దుబాటు కాలేదు. ఆ సంవత్సరం వానాకాలం, యాసంగి సీజన్లకు సంబంధించి సుమారు 1.60 లక్షల టన్నుల వడ్లు మిల్లుల్లో నిల్వ ఉండాల్సి ఉండగా, మిల్లర్లు వాటిని పక్కదారి పట్టించారు. అప్పటినుంచి ప్రతియేటా పౌరసరఫరాలశాఖ అధికారులు రైస్‌మిల్లులకు సీఎంఆర్ ధాన్యం కేటా యించడం, వారు దాన్ని అమ్ముకోవడం షరా మామూలైపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తరు వాత సీఎంఆర్ బకాయిలున్న మిల్లులకు జియో ట్యాంగ్ నిలిపివేయడమేగాకుండా, ధాన్యం రికవరీ చేస్తూ వస్తోంది. జిల్లాలో మొత్తం 54 రైస్‌మిల్లులు ఉండగా 2025-26సంవత్సరం ఖరీఫ్ సీజన్‌కు సంబంఽధించి 28మిల్లులకు జియోట్యాగింగ్ ఇవ్వగా మొత్తం 48,539మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం అప్పగించారు. అందులో ఇప్పటివరకు 77శాతం మాత్రమే తిరిగి ఇవ్వడం గమనార్హం. మరో 11,409మెట్రిక్ టన్నులకు సంబంధించిన బియ్యం ఇవ్వాల్సి ఉంది. అలాగే ఆ ఏడాది రబీ సీజన్‌లో 21మిల్లులకు జియో ట్యాగింగ్ ఇచ్చి 41,991మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని అప్పగించారు. అందులో ఇప్పటివరకు కేవలం 21,600మెట్రిక్ టన్నులకు సంబంధించిన బియ్యాన్ని తిరిగి ఇవ్వగా మరో 20,000మెట్రిక్ టన్నులు పెండింగులో ఉంది.
అక్రమంగా పీడీఎస్ రైస్ సేకరణ..
సీఎంఆర్ పూర్తి చేసేందుకు ప్రభుత్వం పట్టుదలతో ఉండటంతో డిఫాల్టర్లుగా మారిన మిల్లర్లు తమ బియ్యం లోటును భర్తీ చేసేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇందుకోసం ఎంఎల్‌ఎస్ (మండల లెవల్ స్టాకిస్ట్) పాయింట్ల ఇంచార్జిలు కొందరితో సన్నిహిత సంబంధాలు ఏర్పరు చుకున్నట్లు తెలుస్తోంది. వారి ద్వారా చౌక ధరల దుకాణాల నుంచి ప్రజలకు పంపిణీ చేసే పీడీఎస్ బియ్యాన్ని అక్రమంగా సేకరించేందుకు సిద్దపడుతున్నారు. మిల్లర్లకు సహకరించేందుకుగాను ఎం ఎల్‌ఎస్ పాయింట్ల ఇంచార్జిలు కొన్ని హాస్టళ్లు, రేషన్‌షాపుల నుంచి పీడీఎస్ బియ్యం కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలా సేకరించిన బియ్యాన్ని అధికధరలకు మిల్లర్లకు అమ్ముతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. మధ్యాహ్నభోజనం నిర్వహణ కోసం ప్రభుత్వ సంక్షేమహాస్టళ్లు, వివిధ వసతిగృహాలకు ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి సరఫరా అవుతున్న బియ్యంలో ఆయా హాస్టళ్ల వార్డెన్ల సహకారంతో కోత విధిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. విద్యార్థుల సంఖ్యకు సరిపడా బియ్యం కోటా విడుదల అవుతున్నప్పటికీ గైర్హాజరు కారణంగా ప్రతినెల కొంతమొత్తం మిగులుతున్నదని సమాచారం. అలా మిగులు సరుకును మరుసటి నెలకు వాడుకొని, ఆ నెలలో తీసుకోవలసిన కోటాను వార్డెన్లు ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్దనే అమ్ముకుంటున్నట్లు సమాచారం. అలాగే కొన్ని రేషన్ షాపుల్లో లబ్ధిదారులకు బియ్యం ఇవ్వకుండా డబ్బులు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అలా మిగులు బియ్యాన్ని డీలర్లు ఎంఎల్‌ఎస్ పాయింట్ల ఇంచార్జిలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. ఇలా కొనుగోలు చేసిన బియ్యాన్ని గోదాముల ఇంచార్జిలు మిల్లర్లకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మంచిర్యాల ఎంఎల్‌ఎస్ పాయింట్ నుంచి 34క్వింటాళ్ల బియ్యాన్ని వ్యాన్‌లో ఓ రైస్‌మిల్లు వైపు తరలిస్తుండగా లక్షెట్టిపేట పోలీసులు పట్టుకోవడమే దీనికి నిదర్శనం. గతంలో మహారాష్ట్ర నుంచి బియ్యం తెప్పించడం ద్వారా సీఎంఆర్ భర్తీ చేసేవారు. రెండేళ్ల క్రితం జైపూర్ మండలంలోని ఓ రైస్‌మిల్లుకు మహారాష్ట్రకు చెందిన రెండులారీల ద్వారా రాత్రివేళల్లో బియ్యం తరలించగా, అప్పట్లో సంచలనం సృష్టించింది. దొడ్డు బియ్యం పంపిణీ సమయంలో ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి పెద్దమొత్తంలో రేషన్‌బియ్యం మహారాష్ట్రకు తరలిపోయేవి. వాటిని అక్కడి కొన్ని రైస్‌మిల్లుల్లో రీసైక్లింగ్ చేసి, సన్నబియ్యంగా మార్చేవారు. అలా రీసైకిల్ చేసిన బియ్యాన్ని ఇక్కడి సీఎంఆర్ డిఫాల్టర్లయిన మిల్లర్లు కొనుగోలు చేసి, లోటు భర్తీ చేసేవారు. ప్రస్తుతం పీడీఎస్ రైస్ కింద ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ చేస్తుండటంతో సీఎంఆర్ భర్తీకోసం మిల్లర్లు సంక్షేమ హాస్టళ్లు, రేషన్‌డీలర్లపై గోదాముల ఇంచార్జీల ద్వారా ఆధారపడుతున్నారు. ఈవిషయమై సంబంధిత అధికారులు లోతుగా ధృష్టిసారిస్తే మరిన్ని నిజాలు వెలుగుచూసే అవకాశం ఉంది.