Share News

Mancherial: వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖకు.. గూడు కరువు

ABN , Publish Date - Oct 07 , 2026 | 11:54 PM

మంచిర్యాల, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి ప్రస్తుతం నిలువనీడ లేకుండా పోయింది.

Mancherial:  వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖకు.. గూడు కరువు

-యార్డ్‌ భూములు వైద్యకళాశాలకు కేటాయింపు

-ముల్లె, మూటలతో బయటకొచ్చిన సిబ్బంది

-షాపింగ్‌ కాంప్లెక్స్‌ గదుల్లో విధులు

మంచిర్యాల, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌ కమిటీకి ప్రస్తుతం నిలువనీడ లేకుండా పోయింది. అన్ని హంగులతో ఉన్న భవనం, ఇతర సౌకర్యాలను వదిలి ముల్లె, మూటతో సిబ్బంది బయటకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు మార్కెట్‌ యార్డు పరంగా రోడ్డుపక్కన నిర్మించిన కాంప్లెక్స్‌ అద్దెగదుల్లో విధులు నిర్వహించాల్సిన దుస్థితి దాపురించింది. వ్యవసాయ మార్కెట్‌కమిటీ యార్డు స్థలాన్ని 2021లో మెడికల్‌ కళాశాలకు కేటాయించారు. కొంతకాలం తరువాత అదే స్థలాన్ని ప్రభుత్వ జనరల్‌ ఆస్పత్రికి(జీజీహెచ్‌) కేటాయించగా, భవన నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చొంది.

సకల సౌకర్యాలు..

వ్యవసాయ మార్కెట్‌యార్డులో పంటను అమ్ముకునేందుకు వచ్చే రైతులకు అవసరమైన ఏర్పాట్లను కోట్ల రూపాయలు వెచ్చించి చేశారు. మార్కెట్‌ యార్డు ఆవరణలో పంట తూకం వేసేందుకు 40టన్నుల సామర్థ్యంగల అత్యాధునిక ఎలకా్ట్రనిక్‌ వే బ్రిడ్జితోపాటు మరో 3టన్నుల సామర్థ్యంగల ఎడ్లబండి కాంటాలను నిర్మించారు. 2007లో మార్కెట్‌ కమిటీ ఆవరణలో సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కొనుగోలు చేసిన పంటను నిల్వ ఉంచేందుకు నాలుగు పెద్దపెద్ద గోదాములను నిర్మించారు. అప్పటి నుంచి పత్తి రైతులు నేరుగా తమ పంటతో మార్కెట్‌యార్డుకు వచ్చి విక్రయాలు చేపట్టేవారు. విశాలమైన ప్రాంతం కావడం, పట్టణ నడి బొడ్డున ఉండటంతో పత్తి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తేవి కావు. అల్పాహారం, చాయ్‌, భోజనం, తదితర సౌకర్యాలు రైతులకు యార్డుబయట అందుబాటులో ఉండేవి. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్లు, మార్కెటింగ్‌శాఖ అధికారులు ఇక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహించేవారు. కాల క్రమంలో జిన్నింగ్‌మిల్లుల ఆవిర్భావంతో పత్తి కొనుగోళ్ల ప్రక్రియను అధికారులు అక్కడికే తరలించగా, తూకం మాత్రం మార్కెట్‌ యార్డులోనే నిర్వహించేవారు.

వైద్య కళాశాల ఏర్పాటుతో..

తెలంగాణ ప్రభుత్వం మంచిర్యాలకు జిల్లాకు ప్రత్యేకంగా వైద్యకళాశాల మంజూరు చేయడంతో మార్కెట్‌ యార్డు ఆవరణ మొత్తం అప్పగించాల్సి వచ్చింది. మార్కెట్‌ యార్డు స్థలం వైద్య కశాశాలకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేసింది. దీంతో మార్కెట్‌ యార్డు స్థలం స్వాధీనం చేసుకోవాలంటూ కలెక్టర్‌ 2001సెప్టెంబర్‌ 20న రెవెన్యూ అధికారులను ఆదేశించారు. దీంతో స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్లను రెవెన్యూశాఖ స్వాధీనం చేసుకొని వైద్య, ఆరోగ్యశాఖ అధికారులకు అందజేసింది. స్థలం డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న వైద్య, ఆరోగ్యశాఖ మార్కెట్‌ కమిటీని ఖాళీ చేయించింది. అయితే వైద్యకళాశాలకు స్థలం కేటాయింపులు జరుగుతాయని తెలిసీ, మార్కెట్‌యార్డు కమిటీ కోసం ఏర్పాట్లు చేయకపోవడంపట్ల విమర్శలు వస్తున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లేవీ లేకుండానే ఉన్న ఫలంగా మార్కెట్‌ యార్డు భవనాన్ని ఖాళీ చేయిచడంతో మార్కెట్‌ కమిటీ సిబ్బంది, అధికారులు రోడ్డుపైకి చేరాల్సి వచ్చింది. మార్కెట్‌ యార్డు ఆవరణలో రోడ్డు పక్కన గతంలో నిర్మించిన రైతు బజార్‌ను ఆనుకొని ఉన్న కాంప్లెక్స్‌ అద్దెగదుల్లో విధులు నిర్వహిస్తున్నారు. నిత్యం జనసంచారం కలిగి ఉన్న రోడ్డు పక్కన సింగిల్‌రూంలో వ్యవసాయ మార్కెట్‌శాఖ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఇరుకైన గదుల్లో మార్కెట్‌కమిటీ చైర్మన్‌, మార్కెటింగ్‌శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌తో పాటు కార్యదర్శి, ఇతర ఆఫీస్‌ సబార్డినేట్లు అంతా ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్నారు. ముఖ్యమైన రికార్డులు కూడా అవే గదుల్లో భద్రపరిచారు.

స్థలాన్ని పరిశీలించినా..

మెడికల్‌కాలేజీ కోసం స్థలం కేటాయించడంతో వ్యవసాయమార్కెట్‌ యార్డు ఏర్పాటుకు అవసరమైన స్థలాన్ని ప్రజాప్రతినిధులు పరిశీలించారు. హాజీపూర్‌ మండలం గుడిపేట వద్ద 6.5 ఎకరాల స్థలాన్ని పరిశీలించగా, ఐదు సంవత్సరాలు గడుస్తున్నా అడుగుముందుకు పడటం లేదు. కేవలం పరిశీలన దశలోనే స్థలం ఉండగా, అక్కడ నిర్మాణాలు ఎప్పుడు చేపడతారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ లోగా రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో వ్యవసాయ మార్కెట్‌ యార్డు భవన నిర్మాణమే మరుగునపడింది. వ్యవసాయ మార్కెట్‌కమిటీ కార్యకలాపాల నిర్వహణకు శాశ్వత భవనం నిర్మాణంతోపాటు రైతులకు అవసరమైన కాంటాలు, ప్లాట్‌ఫాంలు, ఇతర సౌకర్యాలు కల్పించాల్సి ఉంది. పై పనులన్నీ పూర్తిచేయాలంటే కనీసం ఏడాది సమయం పడుతుందని అంచనా. ఇప్పటివరకు స్థలం ఎంపిక కూడా తుది దశకు చేరనందున, నిర్మాణ పనులు ఎప్పుడు ప్రారంభిస్తారో తెలియని పరిస్థితులు ఉన్నాయి. స్థలం ఎంపిక ఇంకా పూర్తికానందున మరో కొన్నాళ్లపాటు మార్కెట్‌ కమిటీ కార్యాలయాన్ని ఇరుకు గద్దుల్లో, అరకొర సౌకర్యాల మధ్య కొనసాగించక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

Updated Date - Oct 07 , 2026 | 11:55 PM