Share News

జాగ్రత్తగా ‘సాగు’దాం

ABN , Publish Date - Jun 07 , 2026 | 11:35 PM

మృగశిర ప్రవేశంతో వానాకాలం పంట సీజన పనులు జోరందుకున్నాయి. రైతులు విత్తనాల సేకరణ, ఎరువుల కొనుగోళ్లలో బిజీగా ఉన్నారు. నకిలీలు రాజ్యమేలుతున్న ప్రస్తుతకాలంలో విత్తన ఎంపిక, ఎరువుల కొనుగోలులో రైతులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.

జాగ్రత్తగా ‘సాగు’దాం

- విత్తన ఎంపికే పంటకు కీలకం

- నకిలీల జోలికి వెళ్లొందంటున్న నిపుణులు

- రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచన

- మృగశిర ప్రవేశంతో జోరందుకున్న సాగు పనులు

నెన్నెల, జూన 7 (ఆంధ్రజ్యోతి): మృగశిర ప్రవేశంతో వానాకాలం పంట సీజన పనులు జోరందుకున్నాయి. రైతులు విత్తనాల సేకరణ, ఎరువుల కొనుగోళ్లలో బిజీగా ఉన్నారు. నకిలీలు రాజ్యమేలుతున్న ప్రస్తుతకాలంలో విత్తన ఎంపిక, ఎరువుల కొనుగోలులో రైతులు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఏమాత్రం ఏమారుపాటుగా ఉన్నా దిగుబడి, పంట కాలం వృఽథా అయ్యే ప్రమాదంతో పాటు రైతులు అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది. వ్యవసాయ శాఖ నిపుణులు, శాస్త్రవేత్తల సలహాలు సూచనలతో ముందుకు సాగాలి. శాసీ్త్రయ సాగు పద్ధతులు పాటించడంతో పాటు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటేనే అన్నదాత ఏడాది కష్టానికితగ్గ ప్రతిఫలం దక్కుతుందని అధికారులు అంటున్నారు.

- విత్తనాలు కొనే ముందు జాగ్రత్త...

దళారుల మాయమాటలు నమ్మి నకిలీ, లూజు విత్తనాల జోలికి వెళ్లొద్దు. వ్యాపారులు, దళారుల మాయమాటలు నమ్మి లూజు విత్తనాలు కొనుగోలు చేయొద్దు. ప్రధానంగా పత్తి రైతులు ప్రభుత్వ నిషేధిత గ్లైసిల్‌ విత్తనాలు అసలుకే కొనొద్దు. ప్రైవేటు కంపెనీల ప్రకటనలు, ఆకర్షిత పేర్లు చూసి మోసపోవద్దు. విత్తనాన్ని ఎంచుకునే ముందు వ్యవసాయాధికారి, శాస్త్రవేత్తల సూచనలు తీసుకోవడం మంచిది. మార్కెట్లో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ సరఫరా చేసిన విత్తనాలు ఉంటే వాటినే తీసుకోవడం ఉత్తమం. లైసెన్సు పొందిన అధికృత డీలరు నుంచి మాత్రమే విత్తనాలు కొనుగోలు చేయాలి. సరిగా సీల్‌ చేసి ఉన్న ప్యాకెట్లు, బస్తాలను ధ్రువీకరణ పత్రం (ట్యాగ్‌) ఉన్న వాటినే ఎంపిక చేసుకోవాలి. బస్తా, ప్యాకెట్‌పై గడువు తేదీ, రకం పేరు, లాట్‌ నంబర్లను గమనించాలి. కొనుగోలు బిల్లుతో పాటు నంబరు, విత్తన రకం, గడువు తేదీ పేర్కొనేలా డీలరు సంతకంతో కూడిన రసీదు పొందాలి. రసీదును పంటకాలం పూర్తి అయ్యే వరకు భద్రపర్చుకోవాలి. రైతు సంతకం కూడా బిల్లుపై ఉండేలా చూసుకోవాలి.

- ఎరువుల కొనుగోలులో అప్రమత్తం..

పంటల అధిక దిగుబడికి రసాయన ఎరువులు దోహదం చేస్తాయి. నాణ్యమైన ఎరువులనే వాడాలి. లైసెన్సు ఉన్న దుకాణంలోనే ఎరువులను కొనాలి. కొనుగోలు చేసిన ఎరువులకు సరైన బిల్లులు పొందాలి. బిల్లును జాగ్రత్తగా భద్రపర్చుకోవాలి. డీలర్‌ బుక్కులో రైతు విధిగా సంతకం చేయాలి. మిషన్‌ కుట్టు ఉన్న ఎరువుల బస్తాను మాత్రమే కొనాలి. బస్తాపై ప్రామాణిక పోషకాలు, ఉత్పత్తిదారుల వివరాలను సరిచూసుకోవాలి. బరువులో అనుమానం వస్తే తూకం వేయించాలి. చిరిగిన, రంద్రాలున్న బస్తాలను తిరస్కరించాలి. ఖాళీ సంచులను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రపర్చాలి. అందమైన ప్యాకింగులకు ఆకర్షితులు కాకుండా ఆధికారులు సిఫారసు మేరకు కొనాలి. కొనుగోలు చేసిన ఎరువుల విషయంలో అనుమానం వస్తే వెంటనే వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందించాలి.

- పురుగు మందులపై అవగాహన అవసరం..

చీడపీడల నివారణకు వాడే క్రిమిసంహారక మందుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వ్యవసాయశాఖ సూచించే మందులను కొనాలి. నిషేధిత మందుల జోలికి వెళ్లొద్దు. లైసెన్సు లేని దుకాణాల్లో కొనవద్దు. అవసరానికి మించి కొని నిల్వ చేసుకుంటే మందులు చెడిపోతాయి. లేబుల్‌ లేని మందుసీసా, ప్యాకెట్‌, డబ్బాలను కొనవద్దు. లేబుల్‌మీద ప్రకటించిన మందు పేరు, రూపం, మందు శాతం, పరిమాణం, విష ప్రభావం, తెలిపే గుర్తులు, వాడకంలో సూచనలు, జాగ్రత్తలు, విరుగుడు మందులు, బ్యాచ్‌ నంబరు, వాడాల్సిన గడువు, తయారు చేసిన సంస్థ పేరు, రిజిసే్ట్రషన్‌ విషయాలు పరిశీలించాలి. వాడిన మందు సీసా, డబ్బా, ప్యాకెట్లను ధ్వంసం చేసి పాతిపెట్టాలి. మందులు కలిపిన పాత్రలను ఇతర అవసరాలకు వాడకూడదు. విచక్షణ రహితంగా పురుగు మందులను వాడటం మంచిదికాదు.

- రైతులకు ముందు జాగ్రత్త అవసరం

పుప్పాల సృజన, మండల వ్యవసాయ అధికారి, నెన్నెల

విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోళ్ల సమయంలో రైతులకు ముందు జాగ్రత్త అవసరం. ఎట్టి పరిస్థితుల్లో లూజు విత్తనాలు కొనకూడదు. దళారుల మాయమాటలు నమ్మి మోసపోవద్దు. విత్తనాలను గుర్తింపుపొందిన డీలర్‌ వద్దనే తీసుకోవాలి. కొనుగోలు చేసిన విత్తన ప్యాకెట్‌పై వివరాలను సరి చూసుకోవాలి. తయారీ తేదీ, లాట్‌ నంబరు, ఎక్స్‌పైరీ డేట్‌లను చూసి వాటిని రసీదుపై రాయించుకోవాలి. విత్తనాల ఖాళీ ప్యాకెట్లు, సంచులు, రసీదులను పంటకాలం పూర్తయ్యే వరకు భద్రంగా దాచి ఉంచాలి. సరిగ్గ మొలవక పోవడం, దిగుబడి రాకపోవడం లాంటి సమస్యలు వస్తే కంపెనీ నుంచి పరిహారం పొందవచ్చు. ఎరువులు యాప్‌ ద్వారా బుక్‌ చేసుకొని తీసుకోవాలి. ఎరువులను నిపుణుల సిఫారసు మేరకు వేయాలి. క్రిమిసంహారక మందులను విచక్షణ రహితంగా వాడరాదు. నాణ్యమైన మందులనే తీసుకోవాలి.

Updated Date - Jun 07 , 2026 | 11:35 PM