Kumuram Bheem Asifabad: ఐటీడీఏలకు పూర్వవైభవం తీసుకొస్తాం
ABN , Publish Date - Oct 27 , 2026 | 12:19 AM
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్ రూరల్/కెరమెరి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీడీఏలకు పూర్వవైభవం తీసుకొస్తామని, గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
-గిరిజనుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
-కుమరం భీం 86వ వర్ధంతి సభలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్క
-జనసంద్రంగా మారిన జోడెఘాట్
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్ రూరల్/కెరమెరి, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐటీడీఏలకు పూర్వవైభవం తీసుకొస్తామని, గిరిజనుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. సోమవారం కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కెరమెరి మండలం జోడెఘాట్‌లో గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కుమరం భీం 86వ వర్ధంతి వేడుకలకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్కతో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా కుమరం భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన మన్నెం వీరుడు కుమరం భీం అన్నారు. ఆయన త్యాగాలను స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయాల సాధనకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. జీవో49ని నూటికి నూరుశాతం రద్దు చేస్తామన్నారు. జిల్లాలో రోడ్లు, వంతెనల నిర్మాణం కోసం ప్రత్యేక దృష్టిసారించి నిధులను మంజూరు చేస్తామన్నారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో మౌలికవసతులను కల్పిస్తామన్నారు. నియోజక వర్గాల అభివృద్ధికి వచ్చిన రూ.108కోట్ల నిధులను మోడిఫికేషన్ చేసి ఇతర జిల్లాలకు కేటాయించారని స్థానిక ఎమ్మెల్యేల అభ్యర్థన మేరకు వాటిని తిరిగి జిల్లాలోని నియోజకవర్గాలకే కేటాయించేలా కృషి చేస్తామన్నారు. మహారాష్ట్రలో అటవీశాఖ చేపడుతున్న అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు త్వరలో కమిటీ ఏర్పాటు చేసి జిల్లాలో అభివృద్ధిపనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామ న్నారు. పోడుభూముల శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలను తయారు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. వచ్చే వర్ధంతి నాటికి సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామన్నారు. ఆదివాసీ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టికి సారిస్తామన్నారు. అనంతరం రాష్ట్ర పంచాయతీశాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల కోసం నైజాం ప్రభుత్వంతో కుమరం భీం పోరాడి అమరుడు అయినట్టు తెలిపారు. ఆయన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని భావితరాలు ముందుకు సాగాలన్నారు. గిరిజన ప్రాంతాల్లో పని చేసే అధికారులు సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేయాలని, ప్రజలకు ప్రభుత్వానికి అధికారులు వారధిగా మారాలన్నారు. జోడెఘాట్‌లో టూరిజం అభివృద్ధికి రూ.5కోట్ల నిధులు మంజూరు చేశామన్నారు. కాటేజీల నిర్మాణం కొనసాగుతోందన్నారు. గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తోందని జిల్లాకు 8వేల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసిందన్నారు. రాష్ట్ర సీఎం ఆదివాసీల అభివృద్ధి కోసం ప్రత్యేక దృష్టిసారించినట్టు తెలిపారు. ఆదివాసీలు ఐక్యంగా ఉండి హక్కులను సాధించుకోవాలన్నారు. త్వరలో పోడుభూముల సమస్యను పరిష్కరిస్తా మన్నారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో జిల్లాలకు ప్రత్యేక నిధులు కేటాయించామన్నారు. నీటి సంరక్షణ చర్యలు చేపడతామన్నారు. అంతకు ముందు గిరిజన సంప్రదాయ రీతిలో కుమరం భీంకు ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎంపీ నగేష్, ఎమ్మెల్సీ దండే విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, హరీష్ బాబు, వెడ్మ బొజ్జు, కలెక్టర్ హరిత, ఎస్పీ నితికా పంత్, ఐటీడీఏ పీవో మకరందు, డీఎఫ్‌వో బాలమణి, అడిషనల్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, సబ్ కలెక్టర్ హర్షచౌదరి, మాజీఎమ్మెల్యే ఆత్రం సక్కు, కుమరం భీం మనుమడు కుమరం సోనేరావు, ఉత్సవకమిటీ చైర్మన్ పెందోర్ రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
గుస్సాడీ నృత్యాలతో మంత్రులకు ఘన స్వాగతం..
కుమురం భీం వర్ధంతి సందర్భంగా జోడెఘాట్‌కు విచ్చేసిన మంత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సీతక్కకు ఆదివాసీ గిరిజనులు గుస్సాడి సంప్రదాయాలతో ఘనస్వాగతం పలికారు. కుమరం భీంకు గిరిజన సంప్రదాయరీతిలో మంత్రులు ఘన నివాళులర్పించి పూలమాలలు వేశారు. అలాగే కుమరం భీం సహచరుడు కుమరం సూరు వర్ధంతి కూడా నిర్వహించి నివాళులర్పించారు. అంతకు ముందు కుమరం భీం మనుమడు కుమరం సోనేరావు వారి కుటుంబ సభ్యులు సోంబాయి, వారసులు భీం సమాధి వద్ద ఐదు గోత్రాలు తెలిపే సంప్రదాయ రీతిలో జెండాను ఆవిష్కరించి నివాళులర్పించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆతరం సక్కు, అడిషనల్ కలెక్టర్ యువరాజ్ మర్మాట్, సబ్‌కలెక్టర్ హర్ష చౌదరి, ఏఎస్పీ చిత్త రంజన్, డీసీసీ అధ్యక్షురాలు సుగణ, నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ అనిల్, మార్కెట్‌కమిటీ చైర్మన్లు మంగ, విశ్వనాథ్, జీసీసీ మాజీ ఛైర్మన్ కొట్నాక తిరుపతి, బీజేపీ నాయకులు అరిగెల నాగేశ్వర్ రావు, శ్రీశైలం, కొట్నాక విజయ్, కోవ విజయ్, బీఆర్‌ఎస్ నాయకులు సరస్వతి, కలాం, అలీబీన్ అహ్మద్, మాజీ డీసీసీ అద్యక్షులు విశ్వ ప్రసాద్ రావు, కాంగ్రెస్ నాయకులు మునీర్, సుజాయిత్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.
స్టాళ్ల పరిశీలన..
వర్ధంతి సందర్భంగా వివిధ శాఖలు స్టాళ్లు ఏర్పాటు చేయగా, మంత్రులు లక్ష్మణ్‌కుమార్, సీతక్క ఉన్నతాధికారులు స్టాళ్లను పరిశీలించారు.
సమస్యలపై ఏకరువు..
కుమరం భీం వర్ధంతి సభలో హాజరైన ఆదివాసీ తెగలకు చెందిన నాయకులు కోవ విజయ్, ప్రేంకుమార్, ఎల్లయ్య, మోతీరాం మాట్లాడుతూ ఆదివాసీ చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమైనట్టు ఆరోపించారు. నేడు ఆదివాసీల సమస్యలు పరిష్కారానికి నోచుకోక అభివృద్ధికి ఆమడదూరంలో గిరిజనులు ఉన్నారన్నారు. పోడుభూముల విషయంలో ఫారెస్టు అధికారులు దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఫారెస్టు, రెవెన్యూ అధికారులు జాయింట్ సర్వే చేయాలన్నారు.
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు..
కళాకారులు, చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఆదివాసీ సంప్రదాయ రీతిలో ఐటీడీఏ పీవో పంచకట్టుతో వేడుకలకు హాజరై గోండి భాషలో ప్రసంగించటం ఆదివాసీలను ఆకట్టుకుంది. కళాకారులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
600మంది పోలీసులతో భారీ బందోబస్తు..
వర్ధంతి సభకు ప్రముఖులు రావడంతో ఎస్పీ నితికాపంత్ నేతృత్వంలో 600మంది పోలీసులతో భారీ బందోబస్తు నిర్వహించారు. హట్టినుంచి జోడెఘాట్ వరకు బాంబుస్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టాయి. ఏఏస్పీ చిత్త రంజన్, డీఎస్పీ ఆశోక్ ఆధ్వర్యంలో సీఐ, ఎస్సైల ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.