Kumuram Bheem Asifabad: నేడు దసరా
ABN , Publish Date - Oct 19 , 2026 | 11:27 PM
ఆసిఫాబాద్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): విజయానికి సూచికగా జరుపుకునే పండుగే విజయదశమి. ఇది చాలా విశిష్టమైన రోజు. ఈ రోజున చేపట్టిన ప్రతీపనిలో విజయం లభిస్తుందని నమ్మకం.
- ఉత్సవాలకు, శమీ పూజకు ఏర్పాట్లు పూర్తి
ఆసిఫాబాద్, అక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి): విజయానికి సూచికగా జరుపుకునే పండుగే విజయదశమి. ఇది చాలా విశిష్టమైన రోజు. ఈ రోజున చేపట్టిన ప్రతీపనిలో విజయం లభిస్తుందని నమ్మకం. విజయదశమి అంటే విజయాలను కలుగచేసే దశమి అని అర్థం. చెడుమీద మంచి విజయం సాధించినందుకు గుర్తుగా మనం విజయదశమి పండుగను ప్రతీసంవత్సరం జరుపుకుంటాం. విజయదశమి రోజున ప్రారంభించే ఏ పని అయినా విజయం సాధిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని నవమి వరకు దేవీనవరాత్రులు జరుపుకుంటాం. ఈ తొమ్మిది రోజులు దుర్గాదేవిని వివిధ రూపాల్లో అలంకరించి అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు. అశ్వయుజన మాసం నుంచి వర్ష రుతువు వెళ్లి శరద్ రుతువు ప్రవేశిస్తుంది. కనుక ఈ నవరాత్రులను శరన్నవరాత్రులు అని కూడా అంటారు. దేవీ నవరాత్రులలో పదవ రోజు విజయ దశమి అని అంటారు.
జిల్లాలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి..
జిల్లాలో దసరా ఉత్సవాలను మంగళవారం అత్యంతవైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తిచేశారు. జిల్లా కేంద్రమైన ఆసిఫాబాద్‌లో పెద్దవాగు నదితీరాన గల కేస్లాపూర్ ఆంజనేయస్వామి ఆలయం వద్ద ఏర్పాట్లను ఉత్సవసమితి ఆధ్వర్యంలో పూర్తిచేశారు. కాగజ్‌నగర్ పట్టణంలో విజయ దశిమి ఉత్సవాలతో పాటు రావణదహన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. ఉత్సవాల ఏర్పాటు పనులను అధికారులు పరిశీలించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు కాగజ్‌నగర్ పట్టణంలో త్రిశూల్‌పహాడ్, శివమల్లన్న ఆలయప్రాంగణంలో ఉత్సవాలు జరుపుకునేందుకు ఏర్పాట్లు చేశారు. అదేవిధంగా జిల్లాలోని సిర్పూర్(టి), కౌటాల, చింతలమానేపల్లి, బెజ్జూరు, దహెగాం, రెబ్బెన, వాంకిడి, కెరమెరి, జైనూర్, సిర్పూర్(యూ), లింగాపూర్, తిర్యాణి మండలాల్లో ఏర్పాట్లు పూర్తి చేశారు.