Share News

Kumuram Bheem Asifabad: ఎల్‌నినో పేరు.. దోపిడీ తీరు..

ABN , Publish Date - Nov 10 , 2026 | 12:02 AM

కాగజ్‌నగర్‌ టౌన్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావాన్ని వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు.

Kumuram Bheem Asifabad:  ఎల్‌నినో పేరు.. దోపిడీ తీరు..

- కృత్రిమ కొరత సృష్టిస్తున్న వ్యాపారులు

- అడ్డగోలు ధరలు

- బియ్యం ఽవ్యాపారుల సిండికేటు మాయాజాలం

- తూతూ మంత్రంగా తనిఖీలు

- రైస్‌ మిల్లర్లవైపు కన్నెత్తి చూడని అధికారులు

కాగజ్‌నగర్‌ టౌన్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావాన్ని వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. బియ్యాన్ని అధిక ధరలకు విక్రయిస్తూ అందినకాడికి దండుకుంటున్నారు. నిర్ణీత ధరల కన్నా ఎక్కువ ధరకు బియ్యం విక్రయిస్తున్నప్పటికీ అధికారులు వ్యాపారులపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం లేదు. నెలరోజులుగా అడ్డగోలు ధరలకు బియ్యం అమ్ముతున్నప్పటికీ వారం రోజుల నుంచే తనిఖీలను ప్రారంభించారు. ప్రభుత్వం వినియోగదారు లకు అమ్మాల్సిన బియ్యం ధరల్ని ఖరారు చేసింది. అయినా వ్యాపారుల తీరు మారడం లేదు. ఈ సంవత్సరం బియ్యం ఇంకా మార్కెట్‌లోకి అందుబాటులోకి రాకముందే ఇదే అదునుగా వ్యాపారులు బ్లాక్‌ మార్కెట్‌కు తెరలేపారు. బియ్యం వ్యాపారులు ఇప్పటికే ఒక్కో 26కిలోల బస్తాపై 650-750 పెంచేసి విక్రయిస్తున్నారు. ఎల్‌నినో పరిస్థితులతో రానురాను బియ్యం ధరలు మరింత పెరగడమే కాకుండా నాణ్యత కూడా తగ్గుతుందని చెబుతున్నారు. ఎల్‌నినో సాకుతో ఒక్కో జైశ్రీరాం 25కిలోల బస్తాకు రైస్‌ట్రేడర్‌ రూ.2400-2500వసూలు చేస్తున్నారు. నెలక్రితం ఒక్కో 26కిలోల బస్తాకు 1800 చెల్లించి కొనుగోలు చేసిన వినియోగదారులకు నెలలోనే ధరల షాక్‌ తగిలింది. రూ.2350-2450 చెల్లించనిదే బియ్యం దొరకవని ఎక్కడికెళ్లినా ఇదే ధర ఉంటుందని ట్రేడర్స్‌ చెప్పడం చూస్తుంటే బియ్యం వ్యాపారుల సిండికేటు భాగోతం బహిర్గతం అవుతోంది.

రైస్‌ మిల్లర్లను చూసీ చూడనట్లేనా?

లీగల్‌ మెట్రాలజి నిబంధనల ప్రకారం 25కిలోల బియ్యం బస్తాను అమ్మితే 5శాతం జీఎస్టీ ప్రభుత్వానికి చెల్లించాలి. దీంతో బియ్యం బస్తాపై 26కిలోలు ఉన్నట్లు ముద్రించి మిల్లర్లు బియ్యం మాత్రం 25కిలోలు ఉంచుతున్నారు. ఇటీవల డీఎస్‌వో, లీగల్‌ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్‌ ఆధ్వర్యంలో కాగజ్‌నగర్‌ మార్కెట్‌తోపాటు పలు ప్రాంతాల్లోని బియ్యం దుకాణాలు తనిఖీ చేశారు. ఈ తనిఖీలు తూతూ మంత్రంగా సాగిస్తున్నారు. అధికధరలకు విక్రయించే రైస్‌ట్రేడర్స్‌ గానీ, మిల్లర్లు గానీ అధికారులకు కనిపించకపోవడం గమనార్హం. నిబంధనలకు విరుద్ధంగా బియ్యం అమ్మితే కేసులు తప్పవని హెచ్చరిస్తున్న అధికారులు మిల్లర్స్‌వైపు కన్నెత్తి చూడడం లేదనే ఆరోపణలున్నాయి. మిల్లర్స్‌ నుంచి బియ్యం రిలైల్‌ మార్కెట్‌లోకి వస్తాయని, వారే అధిక రేట్లకు సప్లయ్‌ చేస్తుంటే తామేమీ చేయాలని ట్రేడర్స్‌ వాపోతున్నారు. నామ్‌కే వాస్తే కేసులు నమోదు చేసి, పైగా నిబంధన లకు విరుద్ధంగా విక్రయాలు జరిగినట్లయితే ఫిర్యాదు చేయాలని ప్రకటించడం కొసమెరుపు.

సామాన్య, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర ఇబ్బంది

ఎల్‌నినో ప్రభావంతో తగినంత వర్షాలు కురవకపోవడంతో కరువుపరిస్థితి నెలకొంది. ఇదే అదునుగా వ్యాపారులు ధరలు ఆకాశాన్నంటించారు. నెలరోజుల క్రితం జైశ్రీరాం బియ్యం ఒక్క సారిగా పెంచేసి అమ్మకాలు సాగిస్తున్నారు. క్వింటాళుకు 7400ఉన్న బియ్యం ప్రస్తుతం రూ.9900-10వేలకు వ్యాపారులు మార్కెట్‌లో అమ్ముతున్నారు. కొన్నిచోట్ల రూ.9200కు కూడా ఇస్తున్నారు. ఇంతవ్యత్యాసం ఉందంటే బ్లాక్‌ మార్కెట్‌కు ద్వారాలు తెరిచినట్లేనని వినియోగదారులు వాపోతున్నారు. మిల్లర్లు, వ్యాపారులు మిలాఖత్‌ అయి బియ్యం ధరలు పెంచారనే ఆరోపణలున్నా కూడా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదు. అన్నిరకాల బియ్యం బీపీటీ, హెచ్‌ఎంటీ, తదితర రకాలు కూడా అమాంతం పెంచేశారు. మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో లేనంతగా ధరలు ఒక్కసారిగా పెంచి అమ్మకాలు సాగిస్తున్నప్పటికీ పట్టించునే నాథుడే కరువయ్యాడు. నిత్యావసరాల ధరలు పెరిగి ఒకవైపు ఇబ్బందులు పడుతున్న ప్రజలకు వ్యాపారులు చేస్తున్న బ్లాక్‌ మార్కెట్‌ దందా మరో తలనొప్పిగా మారింది. వాతావరణ పరిస్థితుల్లో ఇబ్బందులు దృష్ట్యా నేపాల్‌, శ్రీలంక దేశాలతో పాటు ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, బీహార్‌, పశ్చిమ బెంగా రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.

కృత్రిమ కొరత..

బియ్యం ధరలను నియంత్రణలో ఉంచాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో వ్యాపారులు ఇష్టారాజ్యంగా కృత్రిమకొరత సృష్టించి లాభాలు రాబడుతున్నారు. అక్రమంగా నిల్వ చేసిన బియ్యం ధరలు పెంచి అమ్మకాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మార్కెట్‌లో బియ్యం లభ్యత, ధరల పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ప్రభుత్వ ఆదేశాలున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. బియ్యం నిల్వలు అందుబాటులో ఉన్నప్పటికీ కొరత ఉన్నట్లు చూపించే వ్యాపారులపై కఠినచర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. బియ్యం విక్రయాలు చేపడుతున్న వ్యాపారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కోచోట ఒక్కో రేటు ఉండడంతో అనుమానాలు కలుగుతున్నాయి. నిన్న మొన్నటి వరకు జైశ్రీరాం బియ్యం కిలో రూ.75ఉండగా అక్టోబరు నుంచి ఒక్కసారిగా రూ.99పలుకుతుండడంతో ప్రజలకు ఇబ్బందిగా మారింది. కేవలం రెండు నెలల్లో బియ్యం ధరలు రెట్టింకు అయ్యాయని అంటున్నారు. భవిష్యత్తులో రేషన్‌ బియ్యంపై ఆధారపడాల్సి వస్తుందని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Updated Date - Nov 10 , 2026 | 12:02 AM