Share News

Kumuram Bheem Asifabad: వీబీ జీరాంజీలో.. శాశ్వత అభివృద్ధి పనులు

ABN , Publish Date - Oct 22 , 2026 | 11:57 PM

చింతలమానేపల్లి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): వీబీ జీరాంజీ పథకంతో కేవలం కూలీ పనులకే పరిమితం కాకుండా గ్రామాల శాశ్వత అభివృద్ధిని కాంక్షిస్తూ అధికారులు ప్రణాళికలు రూపొందించారు.

Kumuram Bheem Asifabad:   వీబీ జీరాంజీలో.. శాశ్వత అభివృద్ధి పనులు

- ప్రతి కుటుంబానికి ఏడాదికి 125రోజుల ఉపాధి లక్ష్యం

- మొత్తం జాబ్‌కార్డుల సంఖ్య 2.66లక్షలు

- పనిలో పాల్గొంటున్న కూలీలు 10970

చింతలమానేపల్లి, అక్టోబరు 22 (ఆంధ్రజ్యోతి): వీబీ జీరాంజీ పథకంతో కేవలం కూలీ పనులకే పరిమితం కాకుండా గ్రామాల శాశ్వత అభివృద్ధిని కాంక్షిస్తూ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గిరిజన పల్లెలు, మారుమూల గ్రామాల్లో మౌలిక సదుపాయాలతోపాటు జీవనోపాధిని మెరుగుపరిచేందుకు కార్యచరణ చేపట్టారు. ఎల్‌నినో ప్రభావం, భవిష్యత్తులో నీటిఎద్దడిని తగ్గించేలా అభివృద్ధి పనులు చేయడంపై దృష్టిసారిస్తున్నారు. జిల్లాలో యాక్టివ్‌గా 86వేల జాబ్‌ కార్డులు, 1.57లక్షల కూలీలు ఉన్నారు. ప్రస్తుతం 1836పనులు చేపట్టగా, 10970మంది పనులు చేస్తున్నారు. గ్రామీణప్రాంతాల్లో ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితులను తగ్గించడంతోపాటు స్థానికంగానే కూలీలకు పనులు కల్పించడంపై అధికారులు దృష్టి సారిస్తున్నారు.

గ్రామసభల్లో అభివృద్ధి పనుల గుర్తింపు..

జాబ్‌కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి గరిష్టంగా 125రోజుల ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ముందుకెళ్లున్నారు. ఇదివరకే ఆయా గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు ఏర్పాటు చేసి గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులను గుర్తించారు. ఈ పథకంలో 375రకాల పనులు చేసుకునే అవకాశం కల్పించారు. అంగన్వాడీ భవనాలు, సీసీరోడ్లు, వ్యవసాయానికి సంబంధించిన కాల్వలు, మరమ్మతులు, చెక్‌ డ్యాంలు, కోళ్ల, పశువుల షెడ్లు తదితర నిర్మాణాలు చేపట్టనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులను పరిరక్షించడం, భూగర్భ జలమట్టాలను పెంచడం, వర్షపునీటిని సమర్థంగా వినియోగించుకోవడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. నీటి కుంటలు, బోర్‌ వెల్‌ రీచార్జి ఇంకుడుగుంతలు తవ్వనున్నారు. గ్రామసభల్లో పనులు గుర్తించడం మొదటి అడుగు మాత్రమే ఎంపిక చేసిన పనులకు నిధులు కేటాయించడం వాటిని ప్రారంభించడం, కూలీలకు వేతనాలు చెల్లించటం, పనుల నాణ్యతను పర్యవేక్షించడం కూడా అంతే ముఖ్యం. జిల్లాలో మొత్తం జాబ్‌కార్డుల సంఖ్య 2.66లక్షలు, కూలీల సంఖ్య 2.44లక్షలు ఉండగా, ఇందులో యాక్టివ్‌ జాబ్‌ కార్డులు 1.57లక్షలు ఉన్నాయి. ప్రస్తుతం జిల్లాలో పనులు 1836పనులు ప్రారంభం అయ్యాయి. అలాగే జిల్లాలో 10970కూలీలు పనిచేస్తున్నారు. వీరందరికి ఈ పథకంలో మేలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వీబీ జీరాంజీ పథకంలో జల సంరక్షణకే ప్రాధన్యత ఇస్తుండటంతో భూ గర్భ జలాలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని రైతులు పేర్కొంటున్నారు.

Updated Date - Oct 22 , 2026 | 11:57 PM