Share News

Kumuram Bheem Asifabad: కౌలు రైతుకు కరువైన ఆదరణ

ABN , Publish Date - Nov 20 , 2026 | 12:01 AM

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కౌలు రైతు పేరు వినగానే ప్రభుత్వ పెద్దలకు, బ్యాంకులకు చిన్నచూపు అయింది.

 Kumuram Bheem Asifabad:  కౌలు రైతుకు కరువైన ఆదరణ

- కరుణించని ప్రభుత్వం

- కనికరించని బ్యాంకులు

- బీఆర్‌ఎస్‌ బాటలోనే కాంగ్రెస్‌

ఆసిఫాబాద్‌రూరల్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కౌలు రైతు పేరు వినగానే ప్రభుత్వ పెద్దలకు, బ్యాంకులకు చిన్నచూపు అయింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులే ఎక్కువగా ఉన్నారనేది వాస్తవం. నేడు వ్యవసాయ రంగంలో ముఖ్యపాత్రం పోషిస్తున్న కౌలురైతును అటు ప్రభుత్వం, ఇటు బ్యాంకర్లు గుర్తించకపోవడంతో ఆదుకునే వారికోసం ఎదురుచూడడం మినహా ఏమీచేయలేని పరిస్థితిలో ఉన్నారు. గత సీఎం కేసీఆర్‌ ప్రతిమీటింగ్‌లో కౌలురైతులకు తాము ఎలాంటి సహాయం అందించమని ప్రకటించడంతో కౌలురైతుల ఆవేదన ఆవేదనలాగే మిగిలింది. రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం మేనిఫెస్టోలో కౌలురైతులకు సాయం చేస్తామని ప్రకటించింది. అయితే మూడు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ప్రభుత్వం దీనిపై ఏ నిర్ణయం తీసుకోలేదు. ప్రభుత్వ నిర్ణయంపై కౌలురైతులు కోటి ఆశలతో ఎదురుచూస్తున్నారు.

కౌలురైతుకు కరువైన అదరణ..

జిల్లాలో 15మండలాల్లో మొత్తం రైతులు 1,19,979మంది రైతులు ఉండగా ఇందులో 30వేలకు పైగా కౌలురైతులు ఉన్నట్లు అధికారుల సర్వేలో తేలింది. అయితే కౌలురైతుకు చేయూతను ఇవ్వడానికి ప్రత్యేకంగా కౌలురైతు చట్టం ఉన్నప్పటికీ దానికింద నమోదయింది అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో కేవలం వందలోపు మంది మాత్రమే. అంటే ఇటువంటి చట్టం ఉన్నదని జిల్లాలో అనేక మంది కౌలురైతులకు తెలియదు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా.. గత ప్రభుత్వం లాగే..

ప్రస్తుతం ప్రజాప్రభుత్వం కూడా గత ప్రభుత్వం లాగానే ఖరీఫ్‌, రబీ పంటకు రైతు భరోసా ఇస్తోంది. ప్రతి ఎకరానికి రూ.6వేలు పెట్టుబడి సాయం కింద అందిస్తోంది. అలాగే బ్యాంకులు కూడా రుణప్రణాళికలు ఖరారు చేసి రైతులకు రుణాలు ఇచ్చే పేరుతో సాగుదారుడైన కౌలురైతును కాదని భూయజమానికి రుణాలు ఇస్తున్నాయి. దీంతో భూయజమాని కౌలుతో కౌలుదారుడి దగ్గరి నుంచి రుణాల పేరుతో బ్యాంకుల దగ్గరి నుంచి పెట్టుబడి సాయం పేరుతో ప్రభుత్వం దగ్గరి నుంచి నగదును పొందుతున్నారు. ఈ విషయాన్ని కూడా అటు ప్రభుత్వాలు, ఇటు బ్యాంకర్లు గుర్తించకపోవడంతో కౌలురైతుల కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. దీనికి తోడు గత ప్రభుత్వం ప్రకటించిన రైతుబీమా కూడా కౌలురైతులకు వర్తించకపోవడం దారుణమని రైతులు వాపో తున్నారు.

ప్రజాప్రభుత్వంపై కోటిఆశలు..

రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వం మేనిఫెస్టోలో కౌలురైతులకు ఆర్థిక సాయం ప్రకటిస్తామని పేర్కొంది. దీంతో కౌలు రైతులు ప్రభుత్వంపై కోటిఆశలు పెట్టుకున్నారు. అయితే ఇప్పటికి ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించలేదని కౌలు రైతులు పేర్కొంటున్నారు.

Updated Date - Nov 20 , 2026 | 12:01 AM