Share News

Kumuram Bheem Asifabad: ఇంటింటికీ ఇందిరమ్మ బీమా

ABN , Publish Date - Nov 18 , 2026 | 11:45 PM

ఆసిఫాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రతి కుటుంభానికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉదేశ్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అమలుకు శ్రీకారం చుట్టింది.

Kumuram Bheem Asifabad:   ఇంటింటికీ ఇందిరమ్మ బీమా

- నేటి నుంచి పథకం ప్రారంభం

- 20నుంచి దరఖాస్తుల స్వీకరణ

- మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం

- కుటుంబ పెద్ద మరణిస్తే రూ.5లక్షల ఆర్థికసాయం

-జిల్లాలో 1.65లక్షల కుటుంబాలకు ప్రయోజనం

ఆసిఫాబాద్‌, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి): ప్రతి కుటుంభానికి ఆర్థిక భరోసా కల్పించాలనే ఉదేశ్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా అమలుకు శ్రీకారం చుట్టింది. మాజీప్రధాని ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని గురువారం (నేడు) సిద్దిపేట వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పథకం అమలుపై ఇదివరకే స్పష్టమైన మార్గదర్షాకాలు జారీచేసిన ప్రభుత్వం ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంతో జిల్లాలో 1.65లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.

రూ.5లక్షల భీమా..

పేద, మధ్యతరగతి వర్గాల్లో ఇంటిపెద్ద అనుకోకుండా మరణిస్తే ఆ కుటుంబం పడే వేధన అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ జీవిత బీమా అమలుకు నిర్ణయించింది. ఈ పథకం కింద.. సంపాదించే ఇంటి పెద్ద మరణిస్తే ఆ కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సహాయం అందజేయనుంది. ఈ నిర్ణయం పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా భరోసా ఇవ్వనుంది. పథకం అమలుపై ఇదివరకే కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించిన డిప్యూటీసీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు.

మార్గదర్శకాలు ఇలా..

ఇంటింటికి ఇందిరమ్మ బీమా పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. కుటుంబంలో సంపాదించే వ్యక్తి వయస్సు 18నుంచి 59ఏళ్లలోపు ఉండాలి. ఆధార్‌లోని పుట్టిన తేదీ ఆధారంగా వయస్సును నిర్దారిస్తారు. జనాభా గణనలో గుర్తించిన కుటుంబాల సంఖ్యకు అనుగుణంగా అమలుచేయనున్నారు. ఈ పథకం తీరుతెన్నులను ప్రజలకు తెలియ జేసేలా జిల్లాలోని ఆయాగ్రామాలు, వార్డుల్లో టాంటాం ద్వారా విసృతప్రచారం కల్పించాలని ఇదివరకే అధికారులను ఆదేశించారు.

ఆన్‌లైన్‌లో డిజిటలైజ్‌..

ఇందిరమ్మ బీమా పథకంకోసం ఈనెల 20నుంచి 30వతేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఇందుకోసం గ్రామీణ ప్రాంతాల్లో గ్రామపంచాయతీల్లో, మున్సిపాలిటీల్లోని వార్డు స్థాయిలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయనున్నారు. ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆన్‌లైన్‌లో డిజిటలైజ్‌ చేయనున్నారు. ఇందుకోసం నిర్దిష్ట ప్రొఫార్మా సిద్ధం చేసిన ప్రభుత్వం ఇప్పటికే జిల్లాలకు చేరవేసింది. వీటిద్వారానే ప్రజలు ఈ బీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అమలు ఇలా..

బీమా క్లైమ్‌లకు సంబంధించి గ్రామస్థాయిలో ఐతే పంచాయతీ కార్యదర్శి, ఎంపీడీవో, సీపీవో/ డీఆర్డీవో, కలెక్టర్‌/స్థానిక సంస్థల అదనపుకలెక్టర్‌ ఆమోదం ద్వారా బీమా కంపనీకి ఫార్వర్డ్‌ చేస్తారు. మున్సిపల్‌స్థాయిలో వార్డు అధికారి దరఖాస్తులను స్వీకరించనుండగా, మున్సిపల్‌ కమిషనర్‌ పరిశీలించాల్సి ఉంటుంది. కమిషనర్‌తోపాటు సీపీవో/మెప్మా పీడీ పరిశీలించి కలెక్టర్‌/స్థానిక సంస్థల అదనపుకలెక్టర్‌కు పంపిస్తారు. వారి ఆమోదం తర్వాత క్లైమ్‌ఫాం బీమా కంపెనీకి వెళ్తుందని అధికారులు చెబుతున్నారు. కుటుంబంలో ఒక్కరి కంటే ఎక్కువగా సంపాదించే వారు ఉంటే ఎవరిపేరిట బీమా పొందాలనుకుంటున్నారో వారి నామినీలను నిర్ణయించుకొనే వెసులు బాటు దరఖాస్తుదారులకు కల్పించింది.

జిల్లాలో 1.65లక్షల కుటుంభాలకు లబ్ధి..

జిల్లాలో మొత్తం 335గ్రామపంచాయతీలు, 2మున్సిపాలిటీలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 280 రేషన్‌ దుకాణాల పరిధిలో 1,65,456 ఆహరభద్రత కార్డులు ఉండగా, వాటి పరిధిలో 5.40లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. రేషన్‌కార్డులు లేని అర్హులైన కుటుంబాలకూ పథకాన్ని వర్తింప జేసేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పారదర్శకంగా దరఖాస్తుల స్వీకరణ..

-కె హరిత, కలెక్టర్‌, కుమరంభీం ఆసిఫాభాద్‌

ప్రతి కుటుంభానికి భీమా కల్పించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం నేటి నుండి ఇందిరమ్మ కుటుంభ జీవిత భీమా పథకాన్ని ప్రారంభిస్తుంది.జిల్లాలోని 335 గ్రామ పంచాయతీలు.రెండు మున్సిపాలిటీల పరిధిలో అర్హుల గుర్తింపునకు ప్రత్యేక కార్యచరణ చేపట్టి, అర్హులైన కుటుంబాలన్నింటికి పథకం ప్రయోజనం అందేలా చర్యలు తీసుకుంటున్నాం.ఈ పథకంపై గ్రామాల్లో ప్రత్యేక శిబిరాల ద్వారా అవగహన కల్పించి,పారదర్శకంగా దరఖాస్తుల స్వీకరించి అర్హులైన వారి వివరాలను సక్రమంగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించాం.

Updated Date - Nov 18 , 2026 | 11:45 PM