Share News

Kumuram Bheem Asifabad: ఫీజు వసూళ్లలో ఇష్టారాజ్యం

ABN , Publish Date - Nov 02 , 2026 | 11:32 PM

ఆసిఫాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రైవేటు జూనియర్‌, డిగ్రీకళాశాలల ఫీజుల వసూలు వ్యవహారం విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇప్పుడు తలనొప్పిగా మారింది.

Kumuram Bheem Asifabad:   ఫీజు వసూళ్లలో ఇష్టారాజ్యం

- వార్షిక పరీక్షకు ఫీజు కట్టాలంటే ట్యూషన్‌ ఫీజుతో మెలిక

- విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమాడుతున్న ప్రైవేటు కళాశాలలు

- ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు

- నిబంధనలన్నీ గాలికి

- నిద్రావస్థ వీడని జిల్లా అధికారులు

ఆసిఫాబాద్‌, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రైవేటు జూనియర్‌, డిగ్రీకళాశాలల ఫీజుల వసూలు వ్యవహారం విద్యార్థులు, తల్లిదండ్రులకు ఇప్పుడు తలనొప్పిగా మారింది. వార్షిక పరీక్ష కోసం ఫీజులు కట్టేందుకు గడువు ప్రభుత్వం ప్రకటించింది. అయితే దీన్ని ఆసరాగా తీసుకొని ట్యూషన్‌ ఫీజులు చెల్లిస్తేనే పరీక్ష ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నారు. వారం రోజులుగా జిల్లాలోని ప్రైవేటు కళాశాలల యాజమాన్యం కొత్తతరహా పంథాను ఎంచుకుంది. వార్షిక పరీక్ష ఫీజు కట్టాలంటే ట్యూషన్‌ఫీజు కట్టాల్సిందేనని ఖరాఖండిగా తేల్చి చెబుతున్నారు. వాస్తవంగా ప్రభుత్వం నిర్ణయించిన ధరల కంటే ఒక్కొక్క కళాశాల యాజమాన్యం ఇష్టానుసారంగా అధికంగా ఫీజులను ముక్కుపిండి వసూలు చేస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తల్లిదండ్రులు ఫీజులు చెల్లించేందుకు కొంతసమయం కోరుతున్నప్పటికీ కూడా యాజమాన్యాలు పెడచెవిన పెట్టేస్తున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎంత తీసుకోవాలి..?. ఎంత వసూలు చేస్తున్నారనేది స్పష్టంగా బోర్డుపై రాసి పెట్టాల్సి ఉంటుంది. జిల్లాలోని ప్రైవేటు కళాశాలలో ఒక్కొక్క రేటు విధిస్తూ ఇష్టారాజ్యంగా వసూలు చేస్తున్నారు. వార్షిక పరీక్ష ఫీజు పేరుతో ట్యూషన్‌ ఫీజు కట్టాలంటూ సంబంధిత కళాశాలలను నుంచి ఫోన్లు చేసి వేధిస్తున్నారు. విద్యార్థుల భవిషత్యుతో చెలగాటం ఆడుతుండటంతో విద్యార్థుల చదువులపై భారం పడే అవకాశం ఉందని పలువురు పేర్కొంటున్నారు. ఇంత జరుగుతున్నా కూడా పట్టించుకోవాల్సిన జిల్లా అధికారులు మీన మేషాలెక్కిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.

నిబంధనలన్నీ గాలికే...

జిల్లాలోని ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ నియోజకవర్గాలో ఉన్న ప్రైవేటు కళాశాలలను నిర్వాహకులు నిబంధనలు పక్కన పెట్టి నడిపిస్తున్నారు. కాగజ్‌నగర్‌లోని ప్రైవేటు కళాశాలల పరిస్థితి మరీ అధ్వాన్నంగా ఉంది. కాలేజీలో అగ్నిప్రమాద భద్రత పాటించని పరిస్థితి ఉంది. అలాగే కళాశాలకు సంబంధించిన క్రీడా మైదానాన్ని ఒక ప్రాంగణంలో ఒక ఎకరం ప్లే గ్రౌండు సౌకర్యం చూపించాల్సి ఉంటుంది. అలాగే పార్కింగ్‌ సౌకర్యం కూడా తప్పకుండా ఉండాలి. ప్రతి ఏటా కూడా ప్లే గ్రౌండ్‌ సర్టిఫికేట్‌ తప్పకుండా చూపాల్సి ఉంటుంది. వీటన్నింటిని పక్కనపెట్టి విద్యార్థులకు క్రీడా సౌకర్యాలు లేకుండా పాతఫైళ్లపైనే సంతకాలు చేయించి యథేచ్ఛగా నడిపిస్తున్నారు. కాగజ్‌నగర్‌లోని సదరు ప్రైవేటు కళాశాలలపై ఫిర్యాదులు వచ్చినప్పటికీ అవన్నీ బుట్టదాఖాలవుతున్నాయే తప్పా విచారణ జరపడం లేదదని పలువురు తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి విచారణ జరిపితే మరిన్ని లోపాలు ఇట్టే బయటపడుతాయని విద్యార్థి సంఘాలు పేర్కొంటున్నాయి.

విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు..

-అన్నం నాగర్జున, ఓయూ జేఏసీ రాష్ట్ర కార్యదర్శి

జిల్లాలోని ప్రైవేటు కళాశాలలు ఫీజులపేరుతో విద్యార్థులను వేధిస్తున్నారు. కాగజ్‌నగర్‌లోని ప్రైవేటు కళాశాలలు మరి దారుణంగా చేస్తున్నారు. వార్షిక ఫీజు కోసం ట్యూషన్‌ ఫీజు చెల్లిస్తేనే అనుమతిస్తామని భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. జిల్లా స్థాయి అధికారులు వెంటనే స్పందించి కాగజ్‌నగర్‌లోని ప్రైవేటు కళాశాలలను ఒక్కసారి పరిశీలించి చర్యలు తీసుకోవాలి. కళాశాలల్లో కనీసం క్రీడామైదాన సౌకర్యం లేదు, పార్కింగ్‌ సౌకర్యం అసలే లేదు. నిబంధనలు ఎందుకు పట్టించుకోవటం లేదు. ఈ విషయంలో జిల్లా అధికారులతోపాటు ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా ఫిర్యాదు చేశాను.

Updated Date - Nov 02 , 2026 | 11:35 PM