Kumuram Bheem Asifabad: సరికొత్త ‘సహకారం’
ABN , Publish Date - Nov 23 , 2026 | 11:46 PM
చింతలమానేపల్లి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వ్యవస్థను పునర్‌వ్యవస్తీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న సహకార సంఘాలను విభజించి కొత్త సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలను రూపొందించింది.
- రైతులకు మరింత ప్రయోజనం
- జిల్లాలో కొత్తగా 3సహకార సంఘాల ఏర్పాటు
- సహకార వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు
- జిల్లాలో సొసైటీ పునర్ వ్యవస్తీకరణ
చింతలమానేపల్లి, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల వ్యవస్థను పునర్‌వ్యవస్తీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం ఉన్న సహకార సంఘాలను విభజించి కొత్త సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలను రూపొందించింది. ప్రస్తుతం ఉన్న వ్యవసాయ సహకార సంఘాల(ప్యాక్స్) సంఖ్య పెంచేలా నిర్ణయించింది. ప్రస్తుతం ఒక్కో సహకార సంఘం కింద పదిగ్రామాల వరకు ఉండడంతో రుణాలతోపాటు సబ్సిడీ వ్యవసాయ సామగ్రి సైతం పొందలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం కొత్తసంఘాల ఏర్పా టుకు నిర్ణయం తీసుకుంది. గతంలోనే అవసరం ఉన్నచోట నూతన సహకార సంఘాలను ఏర్పాటు చేసి అర్హులైన రైతులను సంఘాల్లో సభ్యత్వం కల్పించాలన్న డిమాండు తెరపైకి వచ్చింది. కానీ ప్రక్రియ పూర్తిస్థాయిలో ముందుకు సాగలేదు.
ప్రభుత్వం నిర్ణయంతో..
తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా కొత్తగా పీఏసీఎస్‌లు ఏర్పడనున్నాయి. ఒక్కో సంఘంలో ఎంతమంది రైతులకు సభ్యత్వం ఇవ్వాలన్న అంశాన్ని త్వరలోనే నిర్ణయించనున్నారు. కొత్తసంఘాల ఏర్పాటుతో రైతులకు పంటసాగుకు అవసరమయ్యే పెట్టుబడులను తక్కువ వడ్డీతో పొందవచ్చు. ఇలా రైతులకు ప్రయోజనం చేకూరనుంది. కొద్దిరోజుల్లోనే జిల్లాలో కొత్తగా ప్రతిపాదించిన సహకార సంఘాల ఏర్పాటు కానున్నాయని అధికారులు చెబుతున్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు సైతం జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న సహకార సంఘాల సర్వసభ్య సమావేశం నిర్వహించి కొత్త సంఘాల్లో సభ్యత్వం విషయమై ఓ నిర్ణయం వెలువడనుంది. రైతుల కోరిక మేరకు ప్రభుత్వం కొత్తసంఘాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయంతో జిల్లాలో 3పీఏసీఎస్‌లను ఏర్పాటు చేయనున్నాయి. జిల్లాలో చింతలమానేపల్లి, పెంచికల్‌పేట్, లింగాపూర్‌లో సహకారం సంఘాలను అదనంగా ఏర్పాటు చేయబోతున్నారు. కొత్త సంఘాల కార్యకలాపాలు కొద్దిరోజుల్లోనే మొదలుకానున్నాయని అధికారులు చెబుతున్నారు. సహకార సంఘాల ద్వారా ముఖ్యంగా రుణాల విషయంతోపాటు సబ్సిడీ వ్యవసాయ పనిముట్లు, ఎరువులు, విత్తనాలు లాంటివి రైతులకు అందనున్నాయి. ప్రస్తుతం ఉన్న సంఘాలు దూరప్రాంతాల్లో ఉండడంతో రైతులకు దూరభారం కలుగుతోంది. దీంతో సంఘాలకు చేరుకోవడంలో ఆలస్యమవుతున్న కారణంగా ఎరువులు, విత్తనాలు అందుబాటులో లేకుండా పోతున్నాయి. చాలారోజులుగా సమీప గ్రామాల్లోనే పీఏసీఎస్ లను ఏర్పాటు చేయాలని రైతులు కోరుకుంటున్నారు. దీంతో గతంలోనే ప్రభుత్వం కొత్తసంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలను కోరింది. అప్పట్లో అధికారులు రూపొందించినా వివిధ కారణాలతో ప్రతిపాదనలకు మోక్షం లభించలేదు. ఎట్టకేలకు అప్పటి ప్రతిప్రాదనలను ఆధారంగా చేసుకొని కొత్త సంఘాల ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రైతులు సంబరపడుతున్నారు.