kumuram bheem asifabad : పని బారెడు.. జీతం మూరెడు
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:45 PM
బెజ్జూరు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అహర్నిశలు కృషిచేస్తున్న వీవోఏ(విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్)లకు ఉద్యోగభద్రత కరువైంది.
- వీవోఏల బతుకులు భారం
- ఉద్యోగ భద్రత కరువు
- పట్టించుకోని పాలకులు
- కుటుంబ పోషణకు తీవ్ర ఇబ్బందులు
- ప్రభుత్వ పథకాల్లో కీలకపాత్ర
- కనీస వేతనం రూ.25వేలు ఇవ్వాలని డిమాండ్
బెజ్జూరు, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక స్వావలంబన కోసం అహర్నిశలు కృషిచేస్తున్న వీవోఏ(విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్)లకు ఉద్యోగభద్రత కరువైంది. గ్రామాల్లో మహిళా సంఘాలను ఏర్పాటు చేసి, బ్యాంకు లింకేజీలు, స్ర్తీనిధి ద్వారా వారికి రుణాలు మంజూరయ్యేలా వీరు చూస్తున్నారు. చాలీచాలని వేతనాలతో పనిచేస్తూ, ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కీలకపాత్ర పోషిస్తున్న వీవోఏల భద్రతను పట్టించుకునే వారే లేకుండాపోయారు. ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలో మహిళా సంఘాల సభ్యులను భాగస్వాములను చేస్తున్న వీవోఏల పరిస్థితి ‘పని బారెడు.. జీతం మూరెడు’ అన్న చందంగా మారింది. జిల్లాలో 298మంది వీవోఏలు విధులు నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, దివ్యాంగులు, కిశోర బాలికలను సంఘాలుగా ఏర్పాటు చేయడం, వారికి బ్యాంకు లింకేజీ, స్ర్తీనిధి, మండల, గ్రామైక్య సంఘాల ద్వారా రుణాలు ఇప్పించడం వీరి బాధ్యత. మహిళలకు కుట్టు శిక్షణ ఇప్పించి పాఠశాల యూనిఫాంలు కుట్టించడం, ఐకేపీ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేసి మార్కెటింగ్ చేయడం వంటి కీలక విధులు కూడా నిర్వహిస్తుంటారు. నగదు, సమావేశ, రసీదు, అప్పుల, పొదుపు పుస్తకాలతోపాటు రకరకాల రికార్డులను ఎప్పటికప్పుడు రాస్తుంటారు. లోకోస్, లఖ్‌పతీ దీదీ, సెర్ప్ ప్రొఫైల్, వీవో అకౌంటింగ్, అజీవిక, ఈ-కేవైసీ తదితర యాప్‌లలో సంఘం సభ్యుల వివరాలు, రుణాలు, బకాయిలను ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో నమోదు చేస్తుంటారు. నెలకు నాలుగుసార్లు మండల సమాఖ్య సమావేశాలకు హాజరవ్వడంతోపాటు గ్రామాల్లో ప్రభుత్వం చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ పాల్గొనాల్సి ఉంటుంది.
అరకొర వేతనాలు..
అన్ని రకాల విధులు నిర్వహిస్తున్న వీవోఏలకు మాత్రం అరకొర వేతనాలు అందుతున్నాయి. డీఆర్‌డీఏ ద్వారా వీరికి నెలకు కేవలం రూ.5వేల చొప్పున గ్రామైక్య సంఘం ఖాతాలో జమ చేస్తారు. ఆ తర్వాత గ్రామైక్య సంఘం ప్రతినిధులు చెక్కుల ద్వారా వీవోఏలకు ఆ వేతనాన్ని చెల్లిస్తారు. ఈచాలీచాలని వేతనంతో కుటుంబపోషణ భారంగా మారిందని ఆవేదన చెందు తున్నారు. వీవో ఆదాయాన్ని బట్టి వచ్చే కమీషన్ కూడా తమకు ఇవ్వాలని, టీఏలు చెల్లించి డీఆర్‌డీఏ నుంచి ఐడీ కార్డులు జారీచేయాలని వీరు కోరుతున్నారు. తమను గుర్తించి వేతనాలు పెంచి రెగ్యూలర్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఎన్నాళ్లీ వెట్టిచాకిరి..
మహిళల ఆర్థిక స్వావలంబనకు పాటుపడుతున్న తమను ఏ ప్రభుత్వాలు పట్టించుకోని కారణంగా తమ బతుకులు చిద్రమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా వెట్టిచాకిరి చేస్తున్న తమకు కనీస ఉద్యోగభద్రత కూడా కరువైందంటూ వాపోతున్నారు. మహిళలను ఆర్థికంగా ఎదిగేలా కృషిచేస్తున్నా.. తమ ఆర్థిక స్వావలంబన పట్టించుకునేవారెవ్వరని ప్రశ్నిస్తున్నారు. ఇచ్చే రూ.5వేల జీతం ఏ మూలకు సరిపోక అనేక అవస్థలు పడుతున్నామని, పిల్లల చదువు, ఆసుపత్రి ఖర్చులు, ఇతరత్రా ఖర్చులకు సరిపోక బయట అప్పులు చేయాల్సి వస్తుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ఇచ్చే వేతనం కూడా ప్రతి నెలా అందదు. తమ కృషిని గుర్తించి కనీసం రూ.25వేలు వేతనం ఇచ్చినట్లయితే ఇంతో అంత కుటుంబ పోషణకు ఇబ్బందులు ఉండవని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఉద్యోగ భద్రత కల్పించాలి..
- సంతోష్, వీవోఏల సంఘం మండల అధ్యక్షుడు, బెజ్జూరు
గ్రామీణ ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న వీవోఏలకు ఉద్యోగ భద్రత కరువైంది. పనికి తగ్గట్టుగా కనీసవేతనం రూ.25వేలు ఇవ్వాలి. వీవోఏలు చేసే పనికి సంబంధించి సెర్ప్ సీఈవో ద్వారా జాబ్‌చార్టు ఇవ్వాలి. జీవో58ని తక్షణమే రద్దు చేయాలి. అలాగే అందరికీ బీమా సదుపాయం కల్పించాలి. ఐడీ కార్డులు అందించి ఉద్యోగ భద్రతను కల్పించాలి.
భారంగా కుటుంబ పోషణ..
- మంచర్ల సురేష్, వీవోఏ, బెజ్జూరు
ప్రభుత్వం అందిస్తున్న చాలీచాలని వేతనంతో కుటుంబ పోషణ భారంగా మారింది. ఇచ్చే వేతనాలు కూడా నెలనెల ఇవ్వని కారణంగా అప్పులు చేయాల్సి వస్తోంది. ఇచ్చే రూ.5వేలు వేతనం సరిపోవడం లేదు. పనికి తగిన వేతనం ఇవ్వాలి. ఉపాధి పనికి వెళ్లే కూలీకి ఇచ్చే వేతనం కూడా తమకు ఇవ్వడం లేదు.
రెగ్యూలర్ చేయాలి..
- గోరెంటల విజయ్, వీవోఏ, బారెగూడ
ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి కార్యక్రమంలో పాలుపంచుకుంటున్న తమను గుర్తించి రెగ్యులర్ చేయాలి. ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్న తమను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. ఇప్పటికైనా తమ శ్రమను గుర్తించి రెగ్యులర్ చేయాలి.