Share News

Kumram Bheem Asifabad: ఉరుములు.. మెరుపులు.. పిడుగులు..

ABN , Publish Date - Jun 29 , 2026 | 11:24 PM

జైనూర్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): వానాకాలంలో వర్షాలతో పాటు పిడుగులు పడటం, వరద తాకిడి వాగులు, వంకలు పొంగి పొర్లడం, విషసర్పాల సంచారం, విద్యుత్‌ ప్రమాదాలలు జరిగే ఆవకాశాలున్నాయి.

Kumram Bheem Asifabad:  ఉరుములు.. మెరుపులు.. పిడుగులు..

- వానాకాలంలో పొంచి ఉన్న ప్రమాదాలు

- ముందస్తు జాగ్రత్తలు మేలు

- కరెంటు మరమ్మతులు వద్దు

- వర్షాలు పడేటప్పుడు జాగ్రత్త

- రైతులు అప్రమత్తంగా ఉండాలన్న నిపుణులు

జైనూర్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): వానాకాలంలో వర్షాలతో పాటు పిడుగులు పడటం, వరద తాకిడి వాగులు, వంకలు పొంగి పొర్లడం, విషసర్పాల సంచారం, విద్యుత్‌ ప్రమాదాలలు జరిగే ఆవకాశాలున్నాయి. అన్నదాతలు ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాలని నిపుణులు, వైద్యులు పేర్కొంటున్నారు. వానాకాలం ప్రారంభమై పదిరోజులు గడుస్తున్నది. తొలకరి వర్షాలు కురవడంతో ఏ గ్రామంలో చూసినా వ్యవసాయపనులు ఊపందుకున్నాయి. రైతులు అరకలు, వ్యవసాయ పనిముట్లతో పొలాల వైపు పరుగులు తీస్తున్నారు. ఈక్రమంలో జాగ్రత్తగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.

కరెంటుతో జరభద్రం..

వానాకాలంలో విద్యుత్‌ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం విద్యుత్‌ వినియోగం తప్పనిసరి. కావున పొలాలకు నీళ్లు పారించబోయే సమయంలో రైతులు ప్రమాదాలకు గురవు తుంటారు. స్టాటర్ల బిగింపు, బోర్‌ మోటార్‌ కనెక్షన్‌ మరమ్మతులు, ట్రాన్స్‌ఫార్మర్ల దగ్గర వర్షం పడిన సమయంలో వాటి దగ్గరకు వెళ్లకూడదు. రైతులు ఫీజు మార్చేందుకు నేరుగా ట్రాన్స్‌ఫార్మర్ల వద్దకు వెళ్లరాదు. వ్యవసాయ మోటార్లు తడవకుండా చూసుకోవడంతోపాటు ఎర్తింగ్‌ ఉండాలి. మోటార్లకు విద్యుత్‌సరఫరా చేసే సర్వీస్‌ వైర్లకు ఎట్టి పరిస్థితుల్లో జాయింట్లు లేకుండా చూడాలి. విద్యుత్‌పై పూర్తి అవగాహన లేని రైతులు వాటి జోలికి వెళ్లక పోవడమే మంచిదని విద్యుత్‌ అధికారులు సూచిస్తున్నారు.

మందుల పిచికారి..విష కీటకాలు..

పంటల సంరక్షణకు పురుగు మందులు పిచికారీ చేసేటప్పడు చేతులకు గ్లౌజులు, కాళ్లకు రబ్బరు బూట్లు వేసుకోవాలి. మందులను కర్రతో కలపాలి. భోజనం చేసే ముందు చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. మందులు స్ర్పే చేసే సమయంలో సిగరెట్లు, బీడీలు తాగకూడదు. గాలి ఎదురుగా వీచే సమయంలో పిచికారీ చేయవద్దు. వర్షాకాలంలో చెట్లు, గట్ల వెంట, గడ్డి వాములు ఉన్నచోట పాముల సంచారం అధికంగా ఉంటుంది. పొలానికి వెళ్లేటప్పుడు రైతులు చేతిలో కర్ర, రాత్రి అయితే టార్చిలైట్‌, కాళ్లకు చెప్పులు వేసుకుని వెళ్లాలి. ఒకవేళ పాము కాటు వేస్తే వెంటనే ఆసుపత్రికి వెళ్లాలి. నాటు వైద్యాన్ని నమ్ముకొని ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు.

వాగులు, వంకలతో..

వానాకాలంలలో భారీ వర్షాలు కురిసినప్పుడు వాగులు, వంకలు ప్రవహిస్తుంటాయి. నీటి ఉధృతిని అంచనా వేయలేని అన్నదాతలు వాగులు దాటుతూ కొట్టుకోని పోయిన సందర్భాలున్నాయి. వర్షం వచ్చి వరదలోస్తే నీటి ఉధృతిని గమనించాక అంచనాకు రావాలి. వాగులు, వంకలు దాటే సమయంలో ఒంటరిగా కాకుండా గుంపుగా దాటాలి. పశువులను దాటించే సమయంలో మరింత జాగ్రత్త అవసరం.

పిడుగులు, మెరుపులతో ముప్పు..

వర్షాలతో పాటు పిడుగులతో జాగ్రత్తగా ఉండాలి. ఈ ఏడాది ఇప్పటికే అక్కడక్కడ పిడుగు పాటుకు పలువురు ప్రాణాలు కోల్పోయారు. అయితే జాగ్రత్తలు తెలియక ప్రాణాలు కోల్పోతున్నారు. ఆకాశంలో కారుమబ్బులు, మెరుపులు, ఉరుములు, వేగంగా గాలులు వీయడం వంటివి పిడుగు పాటుకు సంకేతాలు. ఎత్తయినా ప్రదేశాలు, కొండ ప్రాంతాలు, పొడవైన చెట్లు, టెలిఫోన్‌ స్థంభాలపై పిడుగులు పడే అవకాశాలు ఎక్కువ. అప్పుడు రక్షితప్రాంతాలకు వెళ్లాలి. ఫోను వెంటనే స్విచ్ఛ్‌ ఆఫ్‌ చేయాలి. బహిరంగప్రదేశాల్లో ఉన్నప్పుడు కాళ్ల మధ్య తలవంచి రెండు చేతులతో చెవులు మూసు కుని, భూమి తగలకుండా వంగి కూర్చోవాలి. పశువులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి. ట్రాన్స్‌ఫారం, విద్యుత్‌ తీగలున్న ప్రాంతాల్లో ఉండరాదు.

Updated Date - Jun 29 , 2026 | 11:31 PM