Share News

Kumram Bheem Asifabad: పల్లెలకు ప్రత్యేక ప్రొఫైల్‌

ABN , Publish Date - Aug 26 , 2026 | 11:52 PM

ఆసిఫాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): పల్లెల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించింది.

Kumram Bheem Asifabad:   పల్లెలకు ప్రత్యేక ప్రొఫైల్‌

- గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికలు

- అభివృద్ధి పనులు చేపట్టేందుకు పూర్తి సమాచార సేకరణ

- గ్రామసభల్లో ప్రతిపాదనల రూపకల్పన

- జిల్లాలో 335 గ్రామపంచాయతీలు

ఆసిఫాబాద్‌, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): పల్లెల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేకదృష్టి సారించింది. మూడేల్ల కాలపరిమితితో గ్రామపంచాయతీల అభివృద్ధి కోసం అవసరమైన డేటా సేకరణ ప్రక్రియ ప్రారంభించింది. ఇప్పటికే ఒక ప్రత్యేకఫార్మాట్‌ అందజేశారు. ఇటీవల పంచాయతీరాజ్‌శాఖ కమిషనర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చేపట్టాల్సిన చర్యలపై జిల్లా పంచాయతీ అధికారులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర, రాష్ట్రాల బడ్జెట్‌ మాదిరిగా పంచాయతీ స్థాయిలో అదేవిధానం అమలుకు శ్రీకారం చుట్టారు. ఇందుకోసం తెలంగాణ గ్రామపంచాయతీ సమగ్రఅభివృద్ధి ప్రణాళిక(జీపీడీపీ) కింద ప్రతీ గ్రామానికి ప్రత్యేక ప్రొఫైల్‌ తయారు చేస్తున్నారు. పంచాయతీలలో చేయాల్సిన అభివృద్ధిపనులు, ముందస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. విద్య, వైద్య, అటవీ, రెవెన్యూ, పౌరసరఫరాలు, డీఆర్డీఏతో పాటు 17శాఖలతో సమావేశాలు నిర్వహించి, పల్లెల అవసరాలు తెలుసుకోనున్నారు. తద్వారా జిల్లాలోని 15మండలాల పరిధిలో 335గ్రామపంచాయతీలకు లబ్ధి చేకూరనుంది. గ్రామసభలు నిర్వహించి మండలాల వారీగా పనుల ప్రతిపాదనలు సిద్ధం చేసేం దుకు కార్యాచరణ చేపడుతున్నారు. విలేజ్‌ ప్రొఫైల్‌ తయారైతే ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టే అవకాశం ఉంది. గ్రామ జనాభాకు అనుగుణంగా రోడ్లు, తాగునీరు, విద్య, వైద్య తదితర మౌలికవసతుల సదుపాయాలు మెరుగుపడనున్నాయి.

యాప్‌లో సమగ్ర సమాచారం..

గ్రామపంచాయతీల అభివృద్ధికి పంచాయతీరాజ్‌శాఖ ప్రత్యేకంగా యాప్‌ అందుబాటులోకి తేనుంది. గ్రామ ఆవిర్భావం, ప్రొఫైల్‌ నుంచి మూడేళ్లలో ఏం చేయాలి, ఎంత బడ్జెట్‌ అవసరం ఉంది.. ఏ శాఖ నుంచి ఎంత ఖర్చు చేస్తున్నారు.. అనే పూర్తి వివరాలను 39రకాల అంశాలతో డిజిటలైజ్‌ చేయనున్నారు. దీంతో ఒక్క క్లిక్‌తో గ్రామానికి సంబంధించిన సమగ్రసమాచారం అందుబాటులోకి రానుంది. స్థానిక వనరుల ఆధారంగా పల్లెల అభివృద్ధి సాధనతో పాటు నిధుల్లో అవినీతి అక్రమాలను నియంత్రించడం, ప్రతీపైసాకు లెక్క ఉండేలా ప్రణాళిక రచిస్తోంది. గ్రామసభల ద్వారా ప్రజల ద్వారా ప్రజల అవసరాలను గుర్తించి, మూడేళ్లలో గ్రామాభివృద్ధి చేపట్టడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతీపంచాయతీలో నాలుగు గ్రామసభలు నిర్వహించాల్సి ఉండగా, ఇప్పటికే జిల్లాలో ఈ ప్రక్రియ ప్రారంభమైంది.

విలేజ్‌ ప్రొఫైల్‌..

పంచాయతీల అభివృద్ధి ప్రణాళికలను మూడు భాగాలుగా వర్గీకరించారు. మొదటి భాగంలో విలేజ్‌ ప్రొఫైల్‌ తయారు చేస్తున్నారు. ఇందులో గ్రామానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేస్తారు. గ్రామం, విస్తీర్ణం, సరిహద్దులు, లొకేషన్‌, జనాభా, స్త్రీలు, పురుషులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంఖ్య, పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, బిల్‌ కలెక్టర్‌, మల్టీపర్సస్‌ వర్కర్ల వివరాలు నమోదు చేయనున్నారు. సాగుభూమి, బోరుబావులు, కుంటలు చెరువులు, కాల్వలు, రహదారులు, వీధిదీపాలు, డ్రెయినేజీలు, హెల్త్‌ సబ్‌సెంటర్లు, బ్యాంకులు, రేషన్‌దుకాణాలు, వైకుంఠ ధామాలు, రైతువేదికలు, క్రీడాప్రాంగణాలు, పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, పశువైద్యశాలల వివరాలు నమోదు చేయనున్నారు. అలాగే పంచాయతీల ఆదాయం, కేంద్ర రాష్ట్రప్రభుత్వాల గ్రాంట్లు, ఆసరా పింఛన్లు, గతంలో ఖర్చు చేసిన వివరాలు అప్‌లోడ్‌ చేస్తారు.

నెలాఖరులోగా వంద శాతం పూర్తి చేస్తాం..

-భిక్షపతిగౌడ్‌, జిల్లా పంచాయతీ అధికారి

జిల్లాలో గ్రామ పంచాయతీల సమగ్ర అభివృద్ధి ప్రణాళికలను ఈ నెలాఖరులోగా వందశాతం పూర్తిచేస్తాం. జిల్లాలోని 335గ్రామపంచాయతీలకు గాను 275పంచాయతీలలో అంచనా ప్రణాళిక లను రూపొందించాం. గ్రామసభల ద్వారా ప్రజల ద్వారా ప్రజల అవసరాలను గుర్తించి, మూడేళ్లలో గ్రామాభివృద్ధి చేపట్టడమే లక్ష్యంగా చర్యలు చేపడతాం.

Updated Date - Aug 26 , 2026 | 11:52 PM