Kumram Bheem Asifabad: పంచాయతీలకు నిధుల కొరత
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:13 AM
చింతలమానేపల్లి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): నిధుల కొరతతో పంచాయతీలు నీరసించిపోతున్నాయి. కొన్నేళ్లుగా సాధారణ నిధుల(జనరల్ ఫండ్)పై ఫ్రీజింగ్ ఉండడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తోంది.
- సాధారణ నిధులపై ఫ్రీజింగ్
- నిర్వహణ పనులు, మరమ్మతులకు ఆటంకం
- అవస్థలు పడుతున్న పాలకవర్గాలు
చింతలమానేపల్లి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): నిధుల కొరతతో పంచాయతీలు నీరసించిపోతున్నాయి. కొన్నేళ్లుగా సాధారణ నిధుల(జనరల్ ఫండ్)పై ఫ్రీజింగ్ ఉండడంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి వస్తోంది. రాష్ట్ర ఆర్థికసంఘం కేవలం పారిశుధ్య సిబ్బంది వేతనాలు చెల్లించి చేతులు దులుపుకుంటోంది. ఫలితంగా కేంద్రం ఇచ్చే 16వ ఆర్థికసంఘం నిధులపైనే గ్రామ పంచాయతీలు ఆధారపడాల్సి వస్తోంది. దీంతో పల్లెల్లో మౌలికవసతులు లేక ప్రజలు అల్లాడి పోతున్నారు. జిల్లాలో 335పంచాయతీలుండగా, వీటికి ఏటా కేంద్రం 16వ ఆర్థికసంఘం కింద కోట్లలో మంజూరు చేస్తోంది. వీటిని తాగునీరు, పారిశుధ్య పనులకు మాత్రమే వినియోగించాల్సి ఉంటుంది. మిషన్‌భగీరథలో నాసిరకంగా పనులు చేయడంతో తరుచూ లీకేజీలు ఏర్పడుతున్నాయి. గేట్‌వాల్వులు చెడిపోతున్నాయి. వీటి మరమ్మతు, బోరు మోటార్ల కొనుగోలు వీధి దీపాల ఖర్చు ఆర్థికంగా భారమవుతోంది. గతంలో పన్నుల రూపంలో వచ్చిన నిధులను స్థానిక అవసరాలకు అనుగుణంగా పాలకవర్గం తీర్మానం చేసి ఖర్చు చేసుకునే వెసులుబాటు ఉండేది. జిల్లాలో ఏటా రూ.3కోట్ల వరకు వివిధ పన్నులు వసూలవుతున్నాయి. ప్రస్తుతం ఆయానిధులు విడుదలపై ఫ్రీజింగ్ ఉంది. పనులు చేసి రికార్డులు సమర్పించినప్పటికీ కూడా విడుదలకు నోచుకోవడం లేదు. రెండేళ్లుగా కొనసాగుతున్న ఫ్రీజింగ్ ఎత్తివేస్తే జిల్లాకు నిధులు అంందుబాటులోకి వస్తాయి. వీటితో గ్రామాల్లో మెరుగైన మౌలిక వసతులు కల్పించవచ్చు. పలు అభివృద్ధి పనులను చేపట్టవచ్చు.
- రాష్ట్ర ప్రభుత్వ వాటా..
కేంద్రం ఎంత మంజూరు చేస్తే అదేస్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించాల్సి ఉంటుంది. రాష్ట్ర వాటాలో మల్టీపర్పస్ వర్కర్లకు(పారిశుధ్య సిబ్బంది) వేతనాలు జమ అవుతున్నాయి. 2011 జనాభా ఆధారంగా పారిశుధ్య సిబ్బందికి వేతనాలు చెల్లిస్తున్నారు. 500జనాభాకు ఒక్కరే సిబ్బంది నియమించుకోవాలి. మూడు వేల జనాభా ఉన్నచోట ఆరుగురు సిబ్బంది ఉంటే వీరిలో ముగ్గురు మల్టీపర్పస్ వర్కర్లు, ఇద్దరు పంపు డ్రైవర్లు, ఒకరు కారోబార్ ఉంటున్నారు. అదనంగా నియమించుకుంటే అదనపు ఖర్చు అవుతోంది. కాగా రెండేళ్లుగా బిల్లులు చెల్లించక పోవడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. చేపట్టిన పనులు అసంపూర్తిగా మిగిలిపోతున్నాయి. చాలాచోట్ల పంచాయతీ, అంగన్‌వాడీ భవనాలు, ప్రహరీపనులు ముందుకు సాగడంలేదు. అసంపూర్తి పనులు పూర్తి చేసేందుకు నిధులు లేక నిలిచిపోయాయి.
- పంచాయతీ చట్టానికి..
అసెంబ్లీలో ఈనెల 11న గ్రామపంచాయతీ చట్టానికి సవరణ చేసింది. దీని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే పంచాయతీ నిధులను ప్రభుత్వం నిర్ధేశించిన విధంగా సమీప జాతీయ బ్యాంకు, సహకార బ్యాంకు లేదా పోస్టాఫీసుల్లో నేరుగా జమ చేస్తారు. గతంలో నిధులు ప్రభుత్వ ట్రెజరీలో ఉంచే విఽధానం అమల్లో ఉండేది. అంటే పంచాయతీల నిధులపై కేంద్రీకృత నియంత్రణ తగ్గించి, ఆర్థికస్వయం ప్రతిపత్తిని పెంచే దిశగా చర్యలు తీసుకోవడంపై పంచాయతీ పాలకవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నా నిధులు మాత్రం ఇప్పటి వరకు జమకాక పోవడంపై అంసతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. గ్రామపంచాయతీల జనరల్ ఫండ్ ఫ్రీజింగ్ ఎత్తివేస్తే వాటిని గ్రామంలోని వీధుల శుభ్రత, చెత్త సేకరణ, తరలింపు, కాల్వల శుభ్రత పారిశుధ్య కార్మికులకు సంబంధించిన ఖర్చులు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. గ్రామ నీటిసరఫరా వ్యవస్థ నిర్వహణ, పైపులైన్లు, చిన్న మరమ్మతులు, నీటిట్యాంకులు, పంపుల నిర్వహణ, అవసరమైన విద్యుత్, ఆపరేషన్ ఖర్చులు, విద్యుత్ బిల్లుల, వీధిదీపాల మరమ్మతులు చేసే అవకాశం ఉంటుంది. అవసరమైన దీపాలు, పరికరాల నిర్వహణ, స్టేషనరీ, కంప్యూటర్ ప్రింటర్ వంటి కార్యాలయ పరికరాల నిర్వహణ, భవనాల మరమ్మతులు చేపట్టేందుకు ఇబ్బందులు ఉండవు. గ్రామపంచాయతీ ఆస్తుల నిర్వహణ తదితర వాటికి వినియోగించుకోవడానికి వీలు కలుగుతుంది.
రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల చేయాలి..
- డోంగ్రె సంతోష్, సర్పంచ్‌ల ఫోరం జిల్లా అధ్యక్షుడు
గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధులను విడుదల చేయాలి. అదే విధంగా గ్రామపంచాయతీ నిధులు నేరుగా వాడుకునే విధంగా అసెంబ్లీలో చట్టం చేసినప్పటికీ ఇంకా సర్క్యులర్ రాలేదు. సర్క్యులర్ జారీచేసి నిధులు వాడుకొని గ్రామాలు అభివృద్ధి చేసుకునే విధంగా చూడాలి. ఇప్పటివరకు కేంద్రప్రభుత్వ నిధులతో గ్రామపంచాయతీలను నెట్టుకరావల్సి వస్తోంది.