Kumram Bheem Asifabad: బాల్యానికి బాసటగా.. ‘ఆపరేషన్ ముస్కాన్’
ABN , Publish Date - Aug 17 , 2026 | 11:38 PM
కాగజ్‌నగర్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఆటపాటలతో కూడిన చదువులతో ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన బాల్యం వివిధ కారణాలతో నేడు బాలకార్మికులుగా మారిపోతున్నారు.
- బాల కార్మికులకు చెక్ పెట్టేందుకు మార్గం
- ఆపరేషన్ ముస్కాన్‌తో 74 మందికి విముక్తి
- జిల్లా అంతటా దాడులు
కాగజ్‌నగర్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఆటపాటలతో కూడిన చదువులతో ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన బాల్యం వివిధ కారణాలతో నేడు బాలకార్మికులుగా మారిపోతున్నారు. దీన్ని అరికట్టేందుకు ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం ఆపరేషన్ ముస్కాన్, ఆపరేషన్ స్మైల్ వంటి కార్యక్రమాలు చేపడుతోంది. అయినా కూడా ఎక్కడో ఓ చోట బాల్యం బానిసగా మారుతూనే ఉంది. గత నెలలో జిల్లా వ్యాప్తంగా పోలీసు, కార్మిక, మహిళా శిశుసంక్షేమ, విద్యాశాఖల సంయుక్త ఆపరేషన్‌లో ముస్కాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. 74మంది బాలకార్మికులను రక్షించి చైల్డ్‌వెల్ఫేర్ కమిటీ ముందు హాజరుపరిచారు. వారితో పనులు చేయిస్తున్న యాజమానులపై కూడా కేసులు నమోదు చేశారు. పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర అత్యంత కీలకమైంది. ఆర్థికఇబ్బందులు, అవగాహణ రాహిత్యంతో పిల్లలను బడి మాన్పించి పనికి పంపడం వారి భవిష్యత్తును చీకట్లోకి నెట్టడమే అవుతోంది. ప్రభుత్వం అందిస్తున్న ఉచితవిద్యతో పాటు ఇతర సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి.
బాల కార్మిక వ్యవస్థకు తావులేకుండా..
బాల్య వివాహాలు బాలకార్మిక వ్యవస్థకు తావులేకుండా వారి స్వేచ్ఛను, హక్కులను కాపాడాలి. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన కేవలం అధికారుల బాధ్యతే కాదు. ప్రతి పౌరుడి బాధ్యత, ఎక్కడైనా బాల కార్మికులు పని చేస్తున్నట్టు కన్పిస్తే, తప్పిపోయిన వారు అనాథ పిల్లలు కన్పిస్తే వెంటనే టోల్ ఫ్రీ నంబర్లు 1098, డయల్ 100కు సమాచారం ఇవ్వాలని అధికారులు చెబుతున్నారు. బాలల హక్కులను కాపాడేందుకు రాజ్యంగంలో స్పష్టమైన నిబంధనలున్నాయి. 6-14ఏళ్ల వయస్సు పిల్లలందరికీ ఉచిత నిర్భంద ప్రాథమిక విద్య అందించటం 14ఏళ్ల లోపు పిల్లలు ఏ రకమైన వ్యాపార, పారిశ్రామిక, సర్వీసు రంగాల్లో పనిలో పెట్టుకోవటం పూర్తి చట్టవిరుద్ధం. 14-18 ఏళ్ల లోపు కౌమార బాలలు పరిశ్రమలు, గనులు, ఇతర ప్రమాదకర పని వాతావరణాల్లో పనిచేయరాదు. 14ఏళ్ల లోపు పిల్లలతో పనులు చేయించే వారిపై ఆరునెలల నుంచి రెండేళ్ల వరకు జైలుశిక్ష లేదా రూ.20వేల నుంచి రూ.50 వేల వరకు జరిమానా విధించే అవకాశం కూడా ఉంది. పిల్లలను పనుల్లో పెట్టుకుంటే యాజమానులపై చట్టప రమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యత ఉంటుందని, మన చుట్టు ఎక్కడైనా బాల కార్మికులు కన్పించినా, అనాథలు కన్పించినా చైల్డ్ హెల్ప్‌లైన్, పోలీసులకు సమాచారం అందించాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ పేర్కొన్నారు.