Kumram Bheem Asifabad: ‘ఇందిరమ్మ’కు కొత్త నిబంధనలు
ABN , Publish Date - Oct 05 , 2026 | 11:17 PM
బెజ్జూరు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు గృహనిర్మాణ శాఖ ఝలక్ ఇచ్చింది.
- పైకప్పు విస్తీర్ణం 750చదరపు అడుగులు మాత్రమే
- ఇళ్ల విస్తీర్ణం పెరిగితే బిల్లుచెల్లింపు నిలిపివేత
- ఈనెల1 నుంచి అమలుకు శ్రీకారం
బెజ్జూరు, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు గృహనిర్మాణ శాఖ ఝలక్ ఇచ్చింది. సొంత స్థలంలో ఇళ్లు నిర్మించుకునే పేదలకు ప్రభుత్వం అందిస్తున్న 5లక్షల రూపాయల ఆర్థికసాయం సద్వినియోగం కావాలనే ఉద్దేశంతో కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చింది. అనుమతించిన స్లాబ్‌కు మించి విస్తీర్ణం పెంచే వారిపై నియంత్రణ విధించింది. నిబంధనలు అతిక్రమించి స్లాబ్‌సైజ్ విస్తరిస్తే ప్రభుత్వం నుంచి ఇచ్చే సాయం నిలిచిపోతుందని హెచ్చరించింది. ఈ కొత్తరూల్స్ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లకు కూడా వర్తిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొన్నది. కాగా ఇప్పటికే జిల్లాలో నోటీసుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. క్షేత్రస్థాయిలో చాలామంది లబ్ధిదారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో గోడల కంటే 3నుంచి 8అడుగుల వరకు స్లాబ్‌ను ముందుకు పొడిగించినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇలా చేయడం వల్ల ప్రభుత్వం నుంచి అందే ఐదు లక్షల రూపాయల సాయం సరిపోక పేదలు అప్పుల భారిన పడుతున్నారని, మరికొందరు ఈ భారం తట్టుకోలేక ఇళ్ల నిర్మాణాలను మధ్యలోనే వదిలే స్తున్నారని భావిస్తున్నారు. ఈ ఇబ్బందులను తొలగించి ప్రభుత్వ సాయంతోనే ఇళ్ల నిర్మాణం పూర్తవ్వాలనే లక్ష్యంతో స్లాబ్ వైశాల్యంపై పరిమితులు విధించారు. ఈ నేపథ్యంలో ఇంటి స్లాబ్ 750చదరపు అడుగులు దాటితే బిల్లు చెల్లింపులు నిలిపివేస్తామంటూ గృహనిర్మాణ శాఖ లబ్ధిదారులకు నోటీసులు పంపిణీ చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియను వేగవంతం చేశారు.
- జీవో 352 ప్రకారం..
ప్రభుత్వం విడుదల చేసిన జీవో 352ప్రకారం...400చదరపు అడుగుల ప్లింత్ ఏరియా కలిగిన ఇంటికి స్లాబ్ వైశాల్యం గరిష్ఠంగా 500ఫీట్లలోపే ఉండాలి. అలాగే 600స్క్వేర్‌ఫీట్ ప్లింత్ ఏరియా కలిగిన ఇంటికి స్లాబ్ గరిష్ఠంగా 750స్క్వేర్ ఫీట్ల వరకే ఉండాలి. ఇంటి ముందువైపు స్లాబ్ పొడగింపును గరిష్ఠంగా 3లడుగులకు పరిమితం చేసి మిగిలిన మూడువైపులా ఒక్కఅడుగు మాత్రమే పొడిగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ నిబంధనలు అక్టోబరు 1నుంచి అమల్లోకి వచ్చాయని, స్లాబ్‌నిర్మాణంలో సైజుపెంచితే బిల్లుచెల్లింపులు నిలిపివేస్తామని నోటీసులో హెచ్చ రించారు. ఇప్పటికే ఎక్కువ విస్తీర్ణంలో స్లాబ్ వేసినవారు ఏఈ, డీఈఈని సంప్రదించాలని, నిబంధనలు పాటించకుండా ఆర్థికంగా నష్టపోతే లబ్ధిదారులే బాధ్యులని హౌసింగ్ శాఖ పేర్కొ న్నది. మార్గదర్శకాలకు విరుద్ధంగా అదనపు నిర్మాణం చేపట్టి నష్టపోకుండా జాగ్రత్త వహించాలని జారీ చేసిన నోటీసుల్లో ప్రభుత్వం సూచించింది.
- జిల్లా వ్యాప్తంగా..
కుమరం భీం ఆసిపాబాద్ జిల్లా పరిధిలోని 15మండలాల్లో మొదటి, రెండో ఫేజ్‌లో 9,662ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటికే 1,267ఇళ్లు పూర్తయ్యాయి. 8,332ఇళ్లకు మార్కవుట్ చేశారు. బేస్‌మెంట్ లెవల్ దశలో 2,190,రూఫ్ లెవల్‌లో 1,427, స్లాబ్‌దశలో 2,956, ప్రారంభం కాని ఇళ్లు 1,330ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ క్రమంలో జిల్లాలో ఇళ్ల నిర్మాణం నత్తనడకన సాగుతుండడంతో అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు మరింత పెంచింది. డీఈఈ, ఏఈలు, పంచాయతీ కార్యదర్శులు గ్రామాల్లో పర్యటిస్తూ లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తున్నారు. స్లాబ్ సైజు ఎక్కువ చేసి అప్పుల పాలు కావద్దని అధికారులు లబ్ధిదారులకు సూచిస్తున్నారు.
ఫ నిబంధనల ప్రకారమే కట్టుకోవాలి..
- ప్రకాష్‌రావు, గృహ నిర్మాణశాఖ పీడీ
ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో పలు నిబంధనలు జారీచేసిన నేపథ్యంలో లబ్ధిదారులు నిబంధనల ప్రకారమే ఇళ్లు నిర్మించుకోవాలి. ఇప్పటికే అబ్ధిదారులకు నోటీసులు అందజేస్తున్నాం. స్లాబ్‌సైజు ఎక్కువ వేయడం వల్ల లబ్ధిదారులపై అదనపు భారం పడి అప్పుల పాలవుతున్నారు. అందుకే ప్రభుత్వం స్లాబ్ విస్తీర్ణంలో పరిమితి విధించింది. ప్రభుత్వం నిర్ధేశించిన సైజులో ఇళ్లు కట్టుకుంటే దశల వారీగా బిల్లులు వస్తాయి.