Share News

Kumram Bheem Asifabad: డబుల్‌ రోడ్డుకు మార్కింగ్‌

ABN , Publish Date - Oct 10 , 2026 | 11:48 PM

కాగజ్‌నగర్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రెండు రాష్ట్రాలకు అనుసంధానం చేసేందుకు హ్యాం(హెచ్‌ఎఎం) పథకం కింద కాగజ్‌నగర్‌ క్రాస్‌రోడ్డు నుంచి మహారాష్ట్రలోని మాకోడి వరకు 40కిలోమీటర్ల మేర రోడ్డును ఆధునీకరించనున్నారు.

Kumram Bheem Asifabad:  డబుల్‌ రోడ్డుకు మార్కింగ్‌

- కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్డు నుంచి మాకోడి వరకు

- హ్యాం నిధులతో రోడ్డు పనుల అభివృద్ధి

- చిరువ్యాపారుల్లో ఆందోళన

- ప్రత్యామ్నాయం చూపించాలని డిమాండ్‌

- సర్వే పూర్తి చేసిన అధికారులు

కాగజ్‌నగర్‌, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): రెండు రాష్ట్రాలకు అనుసంధానం చేసేందుకు హ్యాం(హెచ్‌ఎఎం) పథకం కింద కాగజ్‌నగర్‌ క్రాస్‌రోడ్డు నుంచి మహారాష్ట్రలోని మాకోడి వరకు 40కిలోమీటర్ల మేర రోడ్డును ఆధునీకరించనున్నారు. ఈ రహదారి చేపట్టనుండటంతో అధికారులు క్రాస్‌రోడ్డు నుంచి కాగజ్‌నగర్‌ బస్టాండు వరకు రోడ్డు వెడల్పు కోసం మార్కింగ్‌ చేశారు. హ్యాం ఫేజ్‌-2 నిధులు కాగజ్‌నగర్‌ ఎక్స్‌రోడ్డు నుంచి మాకోడి డబుల్‌రోడ్డు వరకు రూ.73.22కోట్లు, సిర్పూరు(టి)-మహారాష్ట్ర సరిహద్దు రోడ్డుకు రూ.10.50కోట్లు, కల్వాడ-ఒడ్డుగూడ రోడ్డుకు రూ.53.52 కోట్లు, బాబాసాగర్‌-గూడెం రోడ్డుకు 15.80కోట్లు మొత్తం నాలుగు పనులకు రూ.203.76కోట్లు ఫేజ్‌-1కింద విడుదల చేశారు.

కాగజ్‌నగర్‌లో వీధిన పడనున్న చిరువ్యాపారులు..

కాగజ్‌నగర్‌ బస్టాండు సమీపంలో 30మేర చిరువ్యాపారులు దుకాణాలను పెట్టుకొని కొన్ని సంవత్సరాలుగా జీవనం గడుపుతున్నారు. ఈ రోడ్డు పనులతో పూర్తిగా దుకాణాలు పోయే అవకాశాలున్నాయి. దీంతో తమ జీవనోపాధి పోతోందని, తమను కాపాడాలని అధికారులకు, నాయకులు వినతిపత్రాలు సమర్పించారు. కాగజ్‌నగర్‌ క్రాస్‌రోడ్డు నుంచి మాకోడి వరకు ప్రస్తుతం రోడ్డు అధ్వాన్నంగా, గుంతలమయంగా ఉంది. ఈ రోడ్డు అభివృద్ధి కానుండటంతో హర్షం వ్యక్తమవుతోంది. రోడ్డు విస్తరణతో ప్రయాణసౌకర్యం మెరుగుపడే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కాగజ్‌నగర్‌ క్రాస్‌రోడ్డు, కాగజ్‌నగర్‌, సిర్పూరు(టి)వరకు రోడ్డు పక్కనున్న చిరువ్యాపారులకు సంబంధించి దుకా ణాలను తొలగించాల్సిన పరిస్థితి ఎదురవుతుండటంతో ఇప్పుడంతా ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం అధికారులు సర్వే పూర్తిచేశారు. ఎంతమేర రోడ్డుకు అవసరం ఉంటుందని, ఎక్కడి వరకు దుకాణాలను తొలగించాల్సి వస్తుందని మార్కింగ్‌ కూడా చేశారు. అలాగే ప్రతి దుకాణం ముందర కూడా నోటీసులను అంటించారు. పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయోనని చిరు వ్యాపారులంతా టెన్షన్‌తో కాలం గడుపుతున్నారు. కాగా వేంపల్లి-పెద్దబండ సమీపంలో టైగర్‌ కారిడార్‌ ఉండటంతో అటవీశాఖ అనుమలు తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుం ది. ఈ విషయంలో అటవీశాఖ అధికారులు ఎప్పటిలోగా అనుమతులు ఇస్తారన్నది ఇంకా స్పష్టత రాలేదు. సిర్పూరు నియోజకవర్గంలో బెజ్జూరు, పెంచికల్‌పేట మండలాల్లోని గిరిగ్రామాలకు సంబంధించిన రోడ్లకు నిధులు మంజూరైనప్పటికీ కూడా ఇంకా అటవీశాఖ అనుమతులు రాక పెండింగ్‌లోనే ఉన్నాయి. జిల్లాలోనే గిరిగ్రామాల్లో పదిపనులు సంవత్సరాల నుంచి పెండింగ్‌లో ఉన్నాయి.

సిర్పూరు(టి)కి మహర్దశ..

హ్యాం నిధులతో చేపట్టే రోడ్డు పనులకు సిర్పూరు(టి)కి మహర్దశ రానుంది. సిర్పూరు(టి)లో పదిహేను సంవత్సరాల నుంచి రోడ్డు వెడల్పు లేక అవస్థలు పడుతున్నారు. సిర్పూరు(టి)లో ప్రధానమార్గం నుంచి మాకోడి వరకు వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఉంది. రోడ్డంతా గుంతలమయంగా ఉంది. రోడ్డు పనులు ఎప్పుడు ప్రారంభమవుతాయోనని ఎదురుచూస్తున్నారు. గతపక్షం రోజుల క్రితం కురిసిన భారీవర్షాలతో మాకోడికి వెళ్లే రహదారిపై గుంతలు ఏర్పడ్డాయి. ఈ మార్గంలో కనీసం ద్విచక్రవాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఈరోడ్డు పనులు రహదారి విస్తరణకు ప్లస్‌ అయినప్పటికీ చిరువ్యాపారులు రోడ్డునపడే అవకాశాలున్నాయి.

Updated Date - Oct 10 , 2026 | 11:48 PM