Kumram Bheem Asifabad: సమష్టిగా నిలబడి ఎల్‌నినోను ఎదుర్కొందాం
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:38 PM
ఉట్నూర్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో
- రైతులు, ప్రజల రక్షణే ప్రభుత్వ ప్రధానలక్ష్యం
- అన్నిశాఖలు మిషన్ మోడ్‌లో పనిచేయాలి
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి సృష్టికరణ
ఉట్నూర్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్నిశాఖలు సమన్వయంతో మిషన్‌మోడల్‌లో పనిచేయాలని ఉమ్మడి ఆదిలాబాద్‌జిల్లా ప్రత్యేక అధికారి ఇల్లంబర్తి అధికారులను ఆదేశించారు. ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు, కంటింజెన్సీ ప్లాన్‌లను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఆయన పేర్కొన్నారు. సోమవారం మండల కేంద్రంలోని కుమరంభీం కాంప్లెక్స్‌లో ఆదిలాబాద్, నిర్మల్, కుమరంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన ఎల్‌నినో సమీక్ష సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ముందుగా ప్రత్యేక అధికారికి కలెక్టర్లు, అధికారులు పూలమొక్కలు అందించి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రత్యేక అధికారి ఇల్లంబర్లి మాట్లాడుతూ ఎల్‌నినో వ్యవసాయ రంగానికే పరిమితం కాదని.. తాగునీరు, సాగునీరు, విద్యుత్, పశుసంవర్ధక, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి,ఉద్యానవనం, భూగర్భజలాలు, ఇరిగేషన్ తదితర అన్ని రంగాలపై ప్రభావం చూపే పరిస్థితిగా భావించి శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామ గ్రామాన రైతులకు వర్షాభావ పరిస్థితులు, నీటి వినియోగం, ప్రత్యామ్నయ పంటల సాగు పై విస్త్రృత అవగాహణ కల్పించాలని అన్నారు. కందులు, పెసర్లు, నువ్వులు, వేరుశనగ, చిరుధాన్యాలు, ఉద్యాన పంటలను ప్రోత్సహించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.
సమావేశంలో జిల్లాల వారీగా జలాశయాల నీటి నిల్వలు, భూగర్భ జలాల పరిస్థితి, తాగునీటి లభ్యత, సాగునీటి పరిస్థితులు, విద్యుత్ సరఫరా, పంటల స్థితిగతులను సమీక్షించారు. వ్యవసాయం, ఉద్యానవనం, పశుసంవర్ధక, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, మున్సిపల్, తాగునీరు, విద్యుత్,వైద్యం, భూగర్భజలాలు, ఇరిగేషన్, మహిళ శిశు సంక్షేమం, కృషి విజ్ఞాన కేంద్రం తదితర శాఖలు తమ యాక్షన్ ప్లాన్‌లు, కంటింజెన్సీప్రణాళికలను సిద్ధం చేసి అమలు చేయాలని ఆదేశించారు. ప్రస్థుత అంచనాల ప్రకారం 40-45 శాతం వరకు వర్షపాత లోటు నమోదయ్యే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు, ప్రజలను కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ప్రజా ప్రతినిధులు, అధికారులు, అన్ని శాఖల సిబ్బంది సమిష్టిగా పని చేస్తే ఎల్‌నినో ప్రభావాన్ని సమర్తవంతంగా ఎదుర్కొగలమని ప్రత్యేక అధికారి అన్నారు.
కుమరంభీం ఆసిఫాబాద్‌జిల్లా కలెక్టర్ హారిత మాట్లాడుతూ ప్రస్థుత వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తూ రైతులకు వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలను చేరవేయాలని, అన్ని శాఖలు సమన్వయంతో కార్యచరణ ప్రణాళికలను అమలు చేయాలని, అత్యవసర పరిస్థితులకు ఎల్లప్పుడు సిద్ధంగా ఉండాలని అధికారులకుసూచించారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం మిషన్‌మోడల్‌లో పనిచేస్తోందని సూచించారు. నీటి నిర్వహణకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన సహాయక చర్యలు చేపడతామని తెలిపారు. ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబొజ్జుపటేల్ మాట్లాడుతూ తాగునీరు, సాగునీటి సమస్యల పరిష్కారానికి అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులు తమ శాఖల యాక్షన్‌ప్లాన్‌లు, కంటింజెన్సీ ప్రణాళికలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఎల్‌నినో బుక్‌లెట్, తెలంగాణ జలసిరి పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల అదనపుకలెక్టర్లు రాజేశ్వర్, ఆర్‌ఎస్ చిత్రు, బి వెంకటేశ్వర్లు, పి చంద్రయ్య, యువరాజ్ మర్మట్, మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధరణి మధుకర్, క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ సంధ్యారాణి, చెన్నూర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పి పద్మ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మందమకరందు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.