Share News

Kumram Bheem Asifabad: అందుబాటులోకి.. డయాలసిస్‌ సేవలు

ABN , Publish Date - Jul 05 , 2026 | 11:44 PM

కాగజ్‌నగర్‌, జూలై5 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో వైద్యరంగంలో సేవలు అందించేందుకు మరో అడుగుపడింది.

Kumram Bheem Asifabad: అందుబాటులోకి.. డయాలసిస్‌ సేవలు

- జిల్లాలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఊరట

- త్వరలో పది యంత్రాలతో డయాలసిస్‌

- ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ ఆసుపత్రులకు చేరుకున్న పరికరాలు

- త్వరలోనే నిత్యం 90మంది పేషంట్లకు డయాలసిస్‌కు అవకాశం

- నిరుపేదలకు వరంగా మారిన వైనం

కాగజ్‌నగర్‌, జూలై5 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో వైద్యరంగంలో సేవలు అందించేందుకు మరో అడుగుపడింది. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రాష్ట్ర ప్రభుత్వం ఊరటనిచ్చింది. ఇప్పటికే కాగజ్‌నగర్‌ ఏరియా ఆసుపత్రి, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో పది డయాలసిస్‌ యంత్రాలతో సేవలు అందిస్తుండగా, పెరుగుతున్న రోగుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అదనంగా మరో పది డయాలసిస్‌ యంత్రాలను మంజూరు చేసింది. ఈ మేరకు రెండు ఆసుపత్రులకు డయాలసిస్‌ యంత్రాలకు సంబంధించిన పరికరాలు వచ్చాయి. ఈ మేరకు ఇన్‌స్టాలేషన్‌ కార్యక్రమం చేపట్టాల్సి ఉంది. ఈ ప్రక్రియ కూడా త్వరలోనే చేపట్టేందుకు అంతా సిద్ధం చేస్తున్నారు. వివిధ గదుల్లో ప్రత్యేక సౌకర్యం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటివరకు డయాలసిస్‌ చేసేందుకు సీట్ల లభ్యత లేకపోవటంతో ప్రత్యామ్నాయంగా మంచిర్యాల, కరీంనగర్‌, హైదరాబాద్‌ ప్రభుత్వాసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఉండేది. దీంతో సమయంతో పాటు అదనంగా ఖర్చులు కూడా అయ్యేవని, బస్సులు, ప్రయివేటు వాహనాల ద్వారా రెండ్రోజులకొకసారి వెళ్లాల్సి వచ్చేదని పలువురు పేర్కొంటున్నారు. జిల్లాలోనే ప్రస్తుతం నలభై మందికి నిత్యం డయాలసిస్‌ చేస్తుండగా, అదనపు యంత్రాలతో నిత్యం జిల్లాలో రెండుచోట్ల మరో నలభై మందికి డయాలసిస్‌ చేసేందుకు అవకాశం ఏర్పడింది. ప్రభుత్వం పూర్తిగా ఉచితంగా డయాలసిస్‌ ప్రక్రియను నిర్వహిస్తోంది. దరఖాస్తులు చేసుకున్న వారు రోజురోజుకు పెరుగుతుండటంతో వీరికి డయాలసిస్‌ చేసే అవకాశం లేకపోవటంతో అంతా ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు ఆ సమస్యకు ఉండకుండా త్వరలోనే అదనంగా సేవలు అందించేందుకు ఏర్పాట్లు చకచకా చేస్తున్నారు. కిడ్నీ వ్యాఽధిగ్రస్తులకు డయాలసిస్‌ చేయాల్సి వస్తే ఏరియా ఆసుపత్రిలో ఆధార్‌కార్డు, ఆహారభద్రత కార్డు చూయిస్తే వివరాలు నమోదు చేసుకొని నేరుగా చికిత్స అందిస్తారు. ఇందుకు డయాలసిస్‌ కేంద్రాల్లో ఎనిమిది మంది టెక్నీషియన్లు, నలుగురు స్టాఫ్‌నర్సులతో ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వం ఉచితంగా డయాలసిస్‌ సేవలను అందిస్తుండటంతో పేదకుటుంబాలకు పెద్దఎత్తున ఆర్థికభారం తగ్గుతోంది. ప్రయివేటు ఆసుపత్రుల్లో ఒక్కో డయాలసిస్‌కు వేల రూపాయిలు ఖర్చు అవుతుండగా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో పూర్తిగా ఉచితంగా చికిత్స లభించటంతో రోగులకు వరంగా మారింది. జిల్లాలో వైద్యసేవలను మరింత బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం కిడ్నీ బాధితులకు ఎంతో మేలు చేయనుంది. అదనపు డయాలసిస్‌ యంత్రాలు మంజూరుపై రోగులు, వారి కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో నాణ్యమైన వైద్యసేవలు అంద బాటులోకి రావటంతో ఇకపై ఇతర జిల్లాలకు వెళ్లే తగ్గుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఏర్పాట్లు చేస్తున్నాం..

-డాక్టర్‌ అవినాష్‌, జిల్లా ఆసుపత్రి సేవల సమన్వయ అధికారి

కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. వీరికి డయాలసిస్‌ చేసేందుకు జిల్లాలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌లో పదియంత్రాలతో వినియోగిస్తున్నారు. ప్రభుత్వం మరో పది యంత్రాలను పంపించింది. వివిధ పరికరాలు కూడా వచ్చాయి. వీటిని ఇన్‌స్టాలేషన్‌ చేసి నిత్యం 45మంది చొప్పున రెండుచోట్ల చేసే అవకాశం ఉంది. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో నిరుపేదలు ఇక ఇతర జిల్లాలకు వెళ్లాల్సిన అవసరం లేదు.

Updated Date - Jul 05 , 2026 | 11:44 PM