Share News

Kumram Bheem Asifabad: స్కూళ్ల తనిఖీలకు.. అకడమిక్‌ బృందాలు

ABN , Publish Date - Jun 29 , 2026 | 11:32 PM

పాఠశాలల తనిఖీలకు ఇకపై అకడమిక్‌ బృందాలు ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వపాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపర్చేందుకు త్వరలోనే విద్యాశాఖ అకడమిక్‌ కమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌నికోలస్‌ ఉత్తర్వులు జారీచేశారు.

Kumram Bheem Asifabad: స్కూళ్ల తనిఖీలకు.. అకడమిక్‌ బృందాలు

- 100 ప్రైమరీ స్కూళ్లకు ఒక టీమ్‌ ఏర్పాటు

- ఉపాధ్యాయుల బోధనా పద్ధతులపై పర్యవేక్షణ

- నివేదికను విద్యయాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని విద్యాశాఖ ఆదేశాలు

పాఠశాలల తనిఖీలకు ఇకపై అకడమిక్‌ బృందాలు ఏర్పాటు కానున్నాయి. ప్రభుత్వపాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపర్చేందుకు త్వరలోనే విద్యాశాఖ అకడమిక్‌ కమిటీలను ఏర్పాటు చేయాల్సిందిగా విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌నికోలస్‌ ఉత్తర్వులు జారీచేశారు.

వాంకిడి, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): విద్యాసంవత్సరం 2026-27కి గాను జిల్లా స్థాయి అకడమిక్‌ ప్యానెల్‌ ఇన్‌స్పెక్షన్‌ టీమ్స్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రైమరీ, ఆప్పర్‌ప్రైమరీ, హైస్కూళ్లలో ఉపాధ్యాయుల బోధనా పద్ధతులను పర్యవేక్షించడం, ఉపాధ్యాయులకు అవసరమైన సూచనలు ఇవ్వడం ఈ బృందాల ముఖ్య ఉద్దేశం. పాఠశాలల సంఖ్య ఆధారంగా ఈ ప్యానెల్‌ బృందాలను ఏర్పాటు చేయాలని విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాలు జారీచేశారు. వాస్తవానికి గత ఏడాది నుంచే అమలు చేయాలని ఉత్తర్వులు జారీ చేసినప్పుటికీ కొన్ని కారణాల వల్ల మధ్యలోనే నిలిపివేశారు. కొత్త గైడ్‌లెన్స్‌ ప్రకారం ప్రతీ 100ప్రాథమిక పాఠశాలకు ఒక ప్యానెల్స్‌ టీమ్‌, ప్రతి 100ప్రాథమికోన్నత పాఠ శాలలకు ఒక టీమును ఏర్పాటు చేయాలని భావించారు. అయితే 50 ఉన్నత పాఠశాలలకు ఒక బృందం చొప్పున ఏర్పాటు చేస్తే పటిష్టమైన పర్యవేక్షణకు వీలు కలుగుతుందనే ఉద్దేశంతో ఈ బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలకు ఎంపికైన ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యా యులు పూర్తిస్థాయిలో తనిఖీ విధుల్లోనే ఉంటారు. అయితే వారు రెగ్యులర్‌గా పనిచేస్తున్న పాఠశాలల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆయాస్థానాల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని డీఈవోలను ఆదేశించారు.

- ఎఫ్‌ఎల్‌ఎన్‌ పాఠశాలపై ప్రత్యేక దృష్టి..

ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమంలో భాగంగా ప్రతీ క్లస్టర్‌లో ఎక్కువ ఎన్‌రోల్మెంట్‌ ఉన్న మూడు పాఠశాలలను ఎఫ్‌ఎల్‌ఎన్‌ కాంపిటెంట్‌ పాఠశాలలుగా విద్యాశాఖ గుర్తిస్తుంది. ఈ పాఠశాలలను ప్యానెల్‌ బృందాలు నెలకోసారి తప్పనిసరిగా సందర్శించి అక్కడి విద్యార్థులు లక్ష్యాలను రీచ్‌అయ్యేలా ఉపాధ్యాయులకు అకడమిక్‌ సపోర్ట్‌ అందిం చాల్సి ఉంటుంది. ఈ బృందాలు మండలస్థాయి రివ్యూ సమావేశాలను నిర్వహించాలి. నెలవారి నివేదికలను సమర్పించాలి. ఆ తర్వాత డీఈవోలు ఈ బృందాల వివరాలను వెంటనే ఆన్‌లైన్‌ పోర్టల్‌లో ఆప్‌లోడ్‌ చేయాలని ఆదేశించారు. ప్యానెల్‌ సభ్యులు తమకు కేటాయిం చిన పాఠశాలలను సందర్శిస్తారు. ప్రతీసారి సందర్శించినప్పుడు కనీసం రెండు సబ్జెక్టుల బోధనను క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఉపాధ్యాయులకు ఫీడ్‌బ్యాక్‌ ఇస్తారు. ప్రతీ రెండునెలలకోసారి ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో స్పాట్‌ అసెస్మెంట్‌ నిర్వహిస్తారు. తనిఖీ వివరాలను అదే రోజున తెలంగాణ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే పాఠశాలలోని అకడమిక్‌ గైడెన్స్‌ రిజిస్టర్‌లో కూడా ఈ డేటాను రికార్డు చేయాల్సి ఉంటుంది.

Updated Date - Jun 29 , 2026 | 11:32 PM