Kumaram Bheem Asifabad: కౌలు రైతుకు గుర్తింపేది?
ABN , Publish Date - Aug 31 , 2026 | 11:59 PM
ఆసిఫాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): సొంత భూములు లేక కౌలుపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులను ఏళ్ల తరబడి ప్రభుత్వాలు గుర్తించడం లేదు.
- ఏళ్ల తరబడి పట్టించుకోని ప్రభుత్వాలు
- పండిన పంటను అమ్ముకోవడానికి అవస్థ్థలు
- ప్రతీసీజన్‌లో ఎరువుల కోసం తిప్పలు
- రుణాలు అందక ప్రైవేటుగా అప్పులు
ఆసిఫాబాద్, ఆగస్టు 31 (ఆంధ్రజ్యోతి): సొంత భూములు లేక కౌలుపైనే ఆధారపడి వ్యవసాయం చేస్తున్న కౌలు రైతులను ఏళ్ల తరబడి ప్రభుత్వాలు గుర్తించడం లేదు. పంటసాగు పెట్టుబడి కోసం ప్రభుత్వం నుంచి సాకారం అందక, పండించిన పంట అధికారికంగా అమ్ముకోలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో వందల ఎకరాలు కల్గిన భూస్వాములు కనీసం సాగువైపు కన్నెత్తి చూడకపోయినా రైతుభరోసా అందుతోంది.. కానీ ఆ భూమిని నమ్ముకొని కష్టపడి పనిచేసే కౌలు రైతుకు ఎక్కడా సహాయం అందలేదు. దీంతో ఎందరో కౌలు రైతులు పంట చేతికి వచ్చినా.. రాకున్నా.. కౌలుమాత్రం కడుతూ వస్తున్నారు. ప్రతియేటా. పండిన పంటలను అమ్ముకోవడానికి నానాఇబ్బందులు పడుతున్నారు. పైౖగా వ్యవసాయమే తప్ప ఇతర పనిచేయలేని కౌలు రైతులంతా ఏడాదంతా కష్టపడి పండించిన పంటను.. అధిక శాతం వడ్డీకి తీసుకున్న ప్రైవేటు అప్పులు తీసుకోవడానికే సరిపోతోంది. ఈ నేపథ్యంలో గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులకు రైతుభరోసా కల్పిస్తామని హామీ ఇచ్చింది. అయితే ప్రస్తుతం వానాకాలం పనులు జోరుగా సాగుతుండగా ఇంతవరకు కౌలు రైతులకు అందే సహాయంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో ఇంకా ఎప్పుడు తమకు పంట పెట్టుబడి సాయం అందుతుందోనని ఎదురుచూస్తున్నారు.
జిల్లాలో సుమారు 30వేల కౌలు రైతులు..
జిల్లాలోని 15మండలాల పరిధిలో సుమారుగా 30వేల వరకు కౌలు రైతులున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, ఇతరత్రా రంగాలకు చెందిన వారు వ్యవసాయం చేసే ఆసక్తి లేక పోవడంతో పాటు సాగు కష్టాలను ఎదర్కొనే పరిస్థితులు లేకపోవడంతో తమ భూములను కౌలుకు ఇచ్చేస్తుంటారు. గతప్రభుత్వం రెండు విడతలుగా అందించిన రైతుబంధు పథకం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రైతుభరోసా పేరిట అందిస్తున్న పెట్టుబడి సహాయం పట్టాదారు రైతుల ఖాతాల్లోనే జమవుతున్నది. దీంతో పంటను సాగుచేసిన కౌలురైతు పేరే.. ఎక్కడా లేకుండా పోయింది. పంటలు సాగు చేసి ఎరువులు, కలుపులు తీయాల్సిన పరిస్థితుల్లో పెట్టుబడి కోసం ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం అదేపరిస్థితి నెలకొంది. బ్యాంకులు కూడా కౌలు రైతులకు రుణాలు ఇవ్వడం లేదు. గతంలో కౌలు రైతులకు రుణ అర్హత కార్డులను జారీ చేసేవారు. కొంతకాలంగా భూములన్నీ ఆన్‌లైన్‌లో నమోదు చేసి పాస్‌పుస్తకాల్లో పట్టాదారు పేరు మినహా ఇతర కాలం ఎక్కడా లేదు. దీంతో కౌలు రైతుల గుర్తింపునకు శాశ్వతంగా అడ్డుకట్ట పడింది.
పెరుగుతున్న పెట్టుబడులు..
రోజురోజుకూ పంట పెట్టుబడులు పెరుగుతున్నాయి. ఒకఎకరంలో పత్తిపంట వేయాలంటే సుమారుగా రూ.25వేలు, వరి పొలానికి రూ.23నుంచి రూ.25వేలు, మొక్కజొన్న చేనుకు రూ. 20వేల వరకు ఖర్ఛు చేయాల్సి వస్తున్నది. కౌలు డబ్బులు కాకుండా కౌలు కుటుంబీకుల కష్టం పోను విత్తనాలు, ఎరువులకే అధికపెట్టుబడి వెచ్చించాల్సిన పరిస్థితి. ఎంత కష్టపడినప్పటికీ ఎకరానికి 10వేల నుంచి 15వేల వరకు మిగిలే పరిస్థితిలేదు. 2018నుంచి గత ప్రభుత్వం రైతు బంధు అమలు చేయగా.. ప్రస్తుత ప్రభుత్వం రైతుభరోసా కింద ఎకరానికి రూ.ఆరువేలు పట్టాదారుల ఖాతాల్లో జమ చేస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కౌలురైతులకు రైతుభరోసాను అమలు చేస్తామని హామీ ఇచ్చినా.. ఇంకా కార్యరూపం దాల్చలేదు. దీంతో కౌలురైతులు ఇబ్బందులు పడుతున్నారు. కౌలురైతులను ప్రభుత్వం గుర్తించి ఏదో రూపకంగా ప్రభుత్వం సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
అమ్ముకోవడానికి సైతం తిప్పలు..
కౌలురైతులు తాము పండించిన పంటను అమ్ముకోవడానికి సైతం తిప్పలు పడుతున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు కల్గిన ఉన్న రైతులే అమ్ముకోవడానికి వీలు ఉండడంతో కౌలు రైతులు పంటలను తక్కువ దరకే దళారులకు విక్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. కౌలురైతులను గుర్తించి ప్రత్యేకగుర్తింపు కార్డులు అందజేసి బ్యాంకుల నుంచి రుణాలు అందేలా చూడాలని పలువురు కోరుతున్నారు. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం కౌలురైతులకు రైతు భరోసా పథకం రూ.12వేల సాయం వర్తింపజేయాలని కోరుతున్నారు. దీంతో కొంతమేరనైనా రైతులు నష్టపోకుండా ఉంటారని.. ప్రభుత్వం త్వరగా కౌలురైతులపై విధివిధానాలు ఖరారు చేయాలని కౌలు రైతులు కోరుతున్నారు.