Share News

Kumaram Bheem Asifabad: వీబీ జీరామ్‌జీ ఉద్యోగుల పోరుబాట

ABN , Publish Date - Aug 06 , 2026 | 11:59 PM

వాంకిడి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): పేస్కేల్‌ కోసం వీబీ జీరామ్‌ జీ ఉద్యోగులు పోరుబాట పడుతున్నారు.

Kumaram Bheem Asifabad:  వీబీ జీరామ్‌జీ ఉద్యోగుల పోరుబాట

- రెండు దశాబ్ధాలుగా పనిచేస్తున్నా పేస్కేల్‌ లేదు

- మూడునెలలుగా వేతనాలు అందడంలేదు.

- ఆగస్టు 15లోగా డిమాండ్లు అంగీకరించకుంటే సమ్మె

వాంకిడి, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): పేస్కేల్‌ కోసం వీబీ జీరామ్‌ జీ ఉద్యోగులు పోరుబాట పడుతున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ప్రారంభమైన నాటి నుంచి వారికి పేస్కేల్‌ అమలు కావడంలేదు. రెండు దశాబ్దాలుగా ఒకే కేడర్‌లో కొనసాగుతన్నారు. తమ పక్కనే పని చేస్తున్న సెర్ప్‌ ఉద్యోగులకు పేస్కేల్‌ అమలుచేస్తున్న ప్రభుత్వం రోజు లక్షల మందితో పని చేయిస్తున్న తమను విస్మరించడంపై ఉద్యోగులు అందోళనకు సిద్ధమవుతున్నారు. నెలనెలా వేతనాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ ఇబ్బందిగా మారిందని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్లు అంగీరించాలని జిల్లా వ్యాప్తంగా ఇటీవల కలెక్టర్లకు, ఎంపీడీవోలకు వినతులు సమర్పించారు. ఈనెల 15లోగా సమస్యలు పరిష్కరించాలని లేదంటే విధులు బహిష్కరించి పోరుబాటకు దిగుతామని పేర్కొంటున్నారు.

ఫ జిల్లాలో 317మంది ఉద్యోగులు..

వీబీ జీరామ్‌ జీ పథకంలో కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో వివిధ కేటగిరీలలో మొత్తం 317 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. పథకంలో పనిచేసే ఏపీవోలు, ఇంజినీరింగ్‌ కన్సల్టెన్సీలు, టెక్నికల్‌ అసిస్టెంట్లు, కంప్యూటర్‌ ఆపరేటర్లు, ఔట్‌సౌర్సింగ్‌ ఉద్యోగులు పేస్కేల్‌ కోసం డిమాండ్‌ చేస్తున్నారు. ఇందులో 11మంది ఏపీవోలు, 74మంది టెక్నికల్‌ అసిస్టెంట్‌లు, 148మంది ఎఫ్‌ఏలు, ఆరుగురు ఇంజనీరింగ్‌ కన్సల్టెన్సీలు, 37మంది కంప్యూటర్‌ ఆపరేటర్లు, 41మంది ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరంతా 2005లో పథకం ప్రారంభమైన నాటినుంచి పని చేస్తున్నారు. 20ఏళ్లుగా పే స్కేల్‌కు నోచుకోవడంలేదు. అప్పుడు ఏ స్థాయిలో ఉద్యోగ నియామకాలు జరిగాయో 20ఏళ్ల తరువాత కూడా అదేస్థాయిలో ఉన్నారు. పదోన్నతులు, బదిలీలు జరగడంలేదు. పైగా 3 నెలల నుంచి వేతనాలు ఇవ్వడంలేదు. ఇదివరకు నెలనెలా ఉద్యోగుల వేతనాలు వస్తుండగా ఇటీవల కాలంలో మూడు, నాలుగు నెలలకు ఒకసారి ఇస్తున్నారు. రెగ్యులర్‌ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రతినెల మొదటి తేదీన వేతనాలు చెల్లించాలని, సెలవుదినాలలో పనిచేసే ఉద్యోగులకు, ప్రయోజనాలు కల్పించాలని కోరుతున్నారు. ఎస్‌ఆర్‌డీఎస్‌ బోర్డు సమావేశంలో ఆమో దించిన అన్ని నిర్ణయాలను అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ఫ టార్గెట్‌ పూర్తి చేస్తున్నా...

ఈనెల 15లోగా డిమాండ్‌లు పరిష్కరించని పక్షంలో 16వతేదీ నుంచి విధులు బహిష్కరించి పోరుబాట పడతామని ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. వలసలను నివారించి, ఉన్నచోట కూలీలకు పనులు కల్పించేందుకు ఉద్యోగులంతా శ్రమిస్తున్నారు. వేసవిలో టార్గెట్‌లు విధించగా అధిక సంఖ్యలో కూలీలతో పనులుచేయించారు. పథకంలో కీలకంగా పనిచేస్తున్న తమను నిర్లక్ష్యం చేస్తున్నారని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. ప్రతీనెల టార్గెట్‌ ప్రకారం కూలీలను తెచ్చి పనులు చేయకపోతే వేతనాలు నిలిపివేయడం, ఉద్యోగాల నుంచి తొలగించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారని వాపోతున్నారు. అయినా అందుకు తగ్గట్టుగా పనులు చేయిస్తున్నా తమకు పే స్కేల్‌ ఎందుకు అమలు చేయడం లేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Aug 06 , 2026 | 11:59 PM