Share News

Kumaram Bheem Asifabad: అద్దెకారు ఓనర్ల గోస

ABN , Publish Date - Aug 06 , 2026 | 11:53 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ అధికారుల సేవల్లో నిరంతరం శ్రమిస్తున్న అద్దెకారు యాజమానుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి.

Kumaram Bheem Asifabad:  అద్దెకారు ఓనర్ల గోస

- 2016నాటి అద్దెలే నేటికీ కొనసాగింపు

- నాడు లీటర్‌ డీజిల్‌ రూ.58, ఇప్పుడు రూ.100

- ధరల పెంపును పట్టించుకోని ప్రభుత్వం

- ఏడాదిన్నరగా బిల్లుల పెండింగ్‌

- వాహనాలను ఉపసంహరించుకుంటున్న యజమానులు

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ అధికారుల సేవల్లో నిరంతరం శ్రమిస్తున్న అద్దెకారు యాజమానుల అవస్థలు వర్ణనాతీతంగా మారాయి. తొమ్మిదేళ్ల క్రితం నాటి ధరలనే ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తుండటం.. అరకొర బిల్లులు కూడా సకాలంలో విడుదల కాకపోవడంతో వాహన యాజమానులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల అవసరాల కోసం సుమారు 20కి పైగా అద్దెవాహనాలు సడుస్తున్నాయి. జిల్లాలోని ఆయా శాఖల అధికారులు అద్దె వాహనాలనే వాడుతున్నారు. అయితే అద్దె గిట్టుబాటు కాకపోవడం, నెలల తరబడి బిల్లులు రాకపోవడంతో కొందరు యాజమానులు తమకార్లను ఉపసంహరించుకుంటున్నారు. దీంతో చేసేదేమి లేక కొన్నిశాఖల అధికారులు సొంతంగా వాహనాలను సమకూర్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

తొమ్మిదేళ్ల క్రితం నాటి ధరలే..

ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారుల కార్ల అద్దెకు సంబంధించిన ధరలను చివరిగా 2016లో నిర్ణయించారు. ఒక్కో వాహనం నెలకు 2500కిలోమీటర్లు తిరగాల్సి ఉంటుంది. దీనికోసం ప్రభుత్వం నెలకు కేవలం రూ.33వేలు మాత్రమే చెల్లిస్తోంది. 2016లో లీటర్‌ డీజిల్‌ ధర కేవలం రూ.58 ప్రస్తుతం ధర రూ.100 ఉంది. కానీ ఆనాటి అద్దెనే ఇప్పటికీ చెల్లిస్తోంది. ప్రభుత్వం నెలకు ఇచ్చే రూ.33వేలలోనే డీజిల్‌ ఖర్చు, డ్రైవర్‌ వేతనం, కారు మెయింటెనెన్స్‌, అన్ని చూసుకోవాలి. డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటడంతో ప్రభుత్వం ఇచ్చే అద్దెలో సగానికి పైగా ఇంధనానికే సరిపోతోంది. కారు కరెక్టుగా తిరిగితే యాజమానికి రూపాయి కూడా మిగలని పరిస్థితి ఉంది. సంబంధితశాఖ అధికారుల దయాదాక్షిణ్యాలపైనే కాలం వెళ్లదీయాల్సి వస్తోందని యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అప్పుల్లో యజమానులు..

పెరిగిన ధరలతో ఒకవైపు సతమతమవుతుంటే మరోవైపు ప్రభుత్వం గడిచిన ఏడాదిన్నర నుంచి అద్దె బకాయిలను విడుదల చేయలేదు. దీంతో డీజిల్‌ పోయించడానికి, డ్రైవర్లకు వేతనాలు ఇవ్వడానికి చివరికి తమ కుటుంబాలను పోషించు కోవడానికి కూడా యాజమానులు భారీగా అప్పులు చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ఎప్పుడు బిల్లులు ఇస్తే అప్పుడు ఆ డబ్బును తెచ్చిన అప్పులకే కట్టేస్తున్నారు. తొమ్మిదేళ్లుగా నిత్యావసరాలు, వాహన విడిభాగాలు, ఇంధన ధరలు భారీగా పెరిగినందున అందుకు అనుగుణంగా కార్ల అద్దెను పెంచాలని యాజమానులు డిమాండ్‌ చేస్తున్నారు. అలాగే ఏడాదిన్నర నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలను వెంటనే విడుదలచేసి తమ కుటుంబాలను ఆదుకోవాలని వారు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు.

వాహనాల అద్దె పెంచాలి..

- సుధాకర్‌, తెలంగాణ ఫోర్‌ వీలర్స్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి, ఆసిఫాబాద్‌

ప్రభుత్వం తొమ్మిదేళ్ల క్రితం అద్దె నిర్ణయించింది. అదే ఇప్పటివరకు కొనసాగుతోంది. డీజిల్‌, పెట్రోల్‌ ధరలు పెరిగాయి. నిత్యావసరాలు పెరిగాయి. ప్రభుత్వం ఇచ్చే అద్దె సరిపోవడంలేదు. అద్దె పెంచితేనే గిట్టుబాటు అవుతుంది.

Updated Date - Aug 06 , 2026 | 11:53 PM