Share News

Kumaram Bheem Asifabad: ఇన్‌చార్జిలే దిక్కు..

ABN , Publish Date - Jul 06 , 2026 | 11:48 PM

ఆసిఫాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివిధ ప్రభుత్వశాఖల్లో అధికారుల పోస్టుల ఖాళీలు పెరిగిపోతున్నాయి. కీలకమైన శాఖలకు ఇన్‌చార్జి అధికారులే బాధ్యత వహిస్తున్నారు.

Kumaram Bheem Asifabad:  ఇన్‌చార్జిలే దిక్కు..

- ప్రధానశాఖల్లోని ప్రధాన పోస్టులు ఖాళీ..

- కొత్తగా రాని అధికారులు..

- వచ్చినా మూన్నాళ్లే..

- జిల్లాలో గాడితప్పుతున్న పాలన..

ఆసిఫాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వివిధ ప్రభుత్వశాఖల్లో అధికారుల పోస్టుల ఖాళీలు పెరిగిపోతున్నాయి. కీలకమైన శాఖలకు ఇన్‌చార్జి అధికారులే బాధ్యత వహిస్తున్నారు. బదిలీ లేదా, ఉద్యోగవిరమణ తర్వాత కీలకపోస్టులు భర్తీ కాక ఇతర శాఖల అధికారులకు ఇన్‌ చార్జిగా బాధ్యతలు అప్పగించాల్సిన పరిస్థితులు జిల్లాలో ఉత్పన్నమవుతున్నాయి. జిల్లా ఏర్పాటై దశాబ్దం గడుస్తున్నా చాలా శాఖలకు శాఖాధిపతులు లేరు. బదిలీలు పదవీ విరమణ పొందినవారి స్థానంలో కొత్తవారు రావడం లేదు. కొన్ని శాఖలలో ఆ శాఖలో ద్వితీయశ్రేణి ఉద్యోగులే బాధ్యతలు చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. మరికొన్ని శాఖలకైతే కనీసం కార్యాలయం, సిబ్బంది కూడా లేరు.

జిల్లాలో ఇది పరిస్థితి..

ఒకటి కాదు, రెండు కాదు జిల్లాలోని కీలక శాఖలన్నీ ఇన్‌చార్జిల పాలనలో కొనసాగుతున్నాయి. ఇక్కడి నుంచి బదిలీ కావడమే తప్పా.. కొత్త వారు వచ్చేందుకు ఆసక్తి చూపకపోవడం.. వచ్చిన వారు పైరవీలతో తిరిగి వెళ్తుండడంతో పాలన గాడి తప్పుతోంది. డివిజన్‌ స్థాయి అధికారులే జిల్లా ఇన్‌చార్జిలుగా కొనసాగుతున్నారు. కొందు అధికారులకు రెండు, మూడు శాఖల బాధ్యతలను సైతం కేటాయించడంతో దేనికీ పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోతున్నారు. విద్యాశాఖకు రెగ్యులర్‌ డీఈవో లేరు. కొన్ని ఏండ్లుగా ఇన్‌చార్జిలతోనే నెట్టుకొస్తున్నారు. జిల్లా విద్యాశాఖలో ఏడీగా పని చేస్తున్న సచ్చిదానంద చారికే ఇన్‌చార్జి డీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. జిల్లా ఇన్‌చార్జి బీసీ అభివృద్ధి అధికారిగా అబ్దుల్‌ నదీమ్‌కు అదనపుబాధ్యతలు కట్టబెట్టారు. ఆయన డివిజన్‌ ఉద్యానవనశాఖ అధికారి కాగా జిల్లా ఉద్యానవన అధికారిగా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పశు సంవర్ధకశాఖలో వాంకిడి ఏరియా ఆసుపత్రి సహాయ సంచాలకుడిగా పని చేస్తున్న సురేష్‌కు జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఇన్‌చార్జి ఈడీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈయనే జిల్లా పశువైద్యాధికారిగా వ్యవహరిస్తున్నారు. మైనార్టీ సంక్షేమశాఖలో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న తిరుపతికి ఇటీవల జిల్లా మైనార్టీ అధికారిగా ఇన్‌చార్జి బాధ్యతలు కేటాయించారు. పరిశ్రమలశాఖ మేనేజర్‌గా పనిచేస్తున్న అశోక్‌కు జిల్లా ఇన్‌చార్జి ఎస్సీ అభివృధ్ది అధికారిగా బాధ్యతలు ఇచ్చారు. గిరిజన సంక్షేమశాఖ డీడీ రమాదేవి పదవీవిరమణ పొందగా ఆమె స్థానంలో ఉట్నూర్‌ డీడీ ప్రేమకళకు ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. జిల్లా సంక్షేమ అధికారిగా బెల్లంపల్లి సీడీపీవో స్వరూపరాణి అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వ్యవసాయ శాఖ ఏడీఏగా పనిచేస్తున్న వెంకటికి జిల్లా వ్యవసాయ అధికారిగా పూర్తి అదనపుబాధ్యతలు కేటాయించారు. జిల్లా యువజన క్రీడలశాఖకు అసలు కార్యాలయమే లేదు. జిల్లా పర్యాటకశాఖదీ ఇదే పరిస్థితి. ఈ రెండింటికి జిల్లా మార్కెటింగ్‌ అధికారి అశ్వఖ్‌ అహ్మద్‌ ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు.

లోపించిన జవాబుదారీతనం..

జిల్లాలో ప్రధానశాఖలకు ఇన్‌చార్జి అధికారులు కొనసాగుతుండడంతో జవాబుదారీతనం లోపిస్తోంది. క్షేత్రస్థాయిలో పనుల పర్యవేక్షణ, సమస్యల పరిష్కారం సక్రమంగా సాగడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆయా పనుల నిమిత్తం కార్యాలయాలకు వచ్చే వారు వారాలపాటు తిరగాల్సి వస్తున్నది. పలుశాఖలు ఇన్‌చార్జిల పాలనలో నడవడం వలన ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచి జిల్లాస్థాయి అధికారులను నియమించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jul 06 , 2026 | 11:48 PM