Kumaram Bheem Asifabad: ఉపాధ్యాయుల సర్దుబాటు..
ABN , Publish Date - Aug 13 , 2026 | 11:59 PM
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి రావడంతో విద్యార్థుల ఇబ్బందులు తొలగనున్నాయి.
- విద్యార్థులకు తొలగనున్న ఇబ్బందులు
- జిల్లాలో 96మంది ఉపాధ్యాయులకు డిప్యూటేషన్లు
- విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా కేటాయింపు
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి రావడంతో విద్యార్థుల ఇబ్బందులు తొలగనున్నాయి. 2026-27విద్యా సంవత్సరంలో ఆడ్మిషన్ల ప్రక్రియ పూర్తికావడంతో ప్రభుత్వపాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులకు డిప్యూటేషన్లు కల్పించారు. కేటాయించిన పాఠశాలల్లో ఉపాధ్యాయులు బోధన చేయాలని అదేశాలు జారీచేశారు. జిల్లాలో స్థానికసంస్థల పరిధిలో 728ప్రభుత్వ పాఠశాలలుఉండగా 42,358మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభంలోనే విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం పాఠశాలల్లో అదనంగా ఉన్న వారిని సమీపంలోని పాఠశాలలకు డిప్యూటేషన్ ద్వారా సర్దుబాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఆడ్మిషన్లు పూర్తి కాకపోవడంతో ఖాళీల సంఖ్యపై స్పష్టత లేకపోవడంతో సర్దుబాటు ప్రక్రియ ఆగస్టు వరకు వచ్చింది.
జిల్లాలో 728 పాఠశాలలు, 357ఖాళీలు..
జిల్లాలోని 15మండలాల పరిధిలో ప్రభుత్వ స్థానికసంస్థల యాజమాన్యాల పరిధిలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నతపాఠశాలలు మొత్తం 728ఉన్నాయి. ఆయా పాఠశాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్‌అసిస్టెంట్లు, ప్రధానోపాధ్యాయులు 2417మంది పనిచేయాల్సి ఉంది. అయితే ప్రస్తుతం 2060మంది మాత్రమే పనిచేస్తున్నారు. మరో 357పోస్టులు ఖాళీగా ఉన్నట్లు గుర్తించారు.
2024లో జీవో 317ద్వారా కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి 65మంది స్పౌస్ కేసుల్లో ఇతర జిల్లాకు బదిలీపై వెళ్లారు. దీంతో చాలా పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏర్పడింది. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు ఉండాలని విద్యాహక్కు చట్టం చెబుతోంది. 1నుంచి 10 మంది పిల్లలు ఉంటే ఒక ఉపాధ్యాయుడు పాఠాలు బోధించాలి. 11నుంచి 60మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు, 61నుంచి 90మంది ఉంటే ముగ్గురు, 91నుంచి 120మంది ఉంటే నలుగురు, 121 నుంచి 150మంది ఉంటే ఐదుగురు, 151నుంచి 200మంది ఉంటే ఆరుగురు ఉండాలి. అలాగే ఉన్నత పాఠశాలల్లో 200మంది ఉంటే సబ్జెక్టు ఒక్క ఉపాధ్యాయులు, 201నుంచి 250వరకు ఉంటే అదనంగా గణితం బోధించేందుకు ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించాల్సి ఉంటుంది.
96పాఠశాలలకు ఉపాధ్యాయులు..
జిల్లాలోని విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా 96పాఠశాలల్లో 96మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. 90మంది ఎస్జీటీలు, 16మంది స్కూల్‌అసిస్టెంట్లను సర్దుబాటు చేశారు. 2024లో 111పాఠశాలలకు 108మంది ఎస్జీటీలు, 28మంది స్కూల్‌అసిస్టెంట్లు, 2025లో 80 పాఠశాలలో 92మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు. ఇందులో 58మంది ఎస్జీటీలు, 34 మంది స్కూల్‌అసిస్టెంట్లు ఉన్నారు. ప్రస్తుతం 96మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశారు.
విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు..
- సచ్చిదానందచారి, డీఈవో, ఆసిఫాబాద్
విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాం. జిల్లాలో 96మంది ఉపాధ్యాయులను సర్దుబాటు చేశాం. సర్దుబాటు అయిన ఉపాధ్యాయులు మంగళవారం నుంచి తమకు కేటాయించిన పాఠశాలల్లో చేరాలని ఆదేశాలు ఇచ్చాం.