Kumaram Bheem Asifabad: పత్తి సాగుకే సై..
ABN , Publish Date - Sep 07 , 2026 | 11:45 PM
ఆసిఫాబాద్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): అనువైన నేలలు, అనుకూలమైన వాతావరణం అందుబాటులో విత్తనాలు మార్కెటింగ్ సదుపాయం ఉండటంతో దశాబ్ధాలుగా రైతులు పత్తి సాగుకే సై అంటున్నారు.
- జిల్లాలో గత ఏడాదికంటే అధికం
- ఏటా మద్దతు ధర పెరగడమే కారణం
ఆసిఫాబాద్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): అనువైన నేలలు, అనుకూలమైన వాతావరణం అందుబాటులో విత్తనాలు మార్కెటింగ్ సదుపాయం ఉండటంతో దశాబ్ధాలుగా రైతులు పత్తి సాగుకే సై అంటున్నారు. నీరు తక్కువ అవసరం కావడం, ధర కూడా ఎక్కువగా వస్తుండటంతో దానిని సాగు చేసేందుకే రైతులు ఇష్టపడుతున్నారు. ప్రధానంగా ప్రతియేటా కేంద్రప్రభుత్వం పత్తి మద్దతు ధర పెంచుతుండడమే ఇందుకు కారణంగా చేప్పుకొవచ్చు. గతేడాది పత్తి క్వింటాల్‌కు రూ. 8110 మద్దతు ధర ఉండగా ఈ ఏడాది క్వింటాల్‌కు రూ.8667కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాదితో పోలిస్తే పత్తి క్వింటాల్‌కు రూ.557మద్దతు ధర పెరిగింది. దీంతో యేటేటా పత్తికి కనీస మద్దతు ధర ఎక్కువగా లభించడంతో ఎక్కువ మంది రైతులు పత్తి బాట పడుతున్నారు.
ఏటేటా పెరుగుతున్న పత్తి విస్తీర్ణం..
జిల్లాలో ఏటేటా పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా పత్తి సాగు విస్తీర్ణం పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. వాణిజ్య పంటగా పేరొందిన పత్తి సాగుపై రైతులు ఆసక్తిని చూపుతున్నారు. గతేడాది కంటే ఈసారి సాగు విస్తీర్ణం పెరగనుంది. జిల్లాలో గత వానాకాలంలో 3.40లక్షల ఎకరాల్లో పత్తి సాగు కాగా ఈసారి 3.70లక్షల ఎకరాల్లో సాగవుతుందని అధికారులు భావిస్తున్నారు. పత్తికి ఆశించిన ధర కూడా లభిస్తుండటం జిల్లాలోని భూములు కూడా పత్తి సాగుకు అనుకూలంగా ఉండటంతో జిల్లాలో పత్తిసాగు వైపే రైతులు ఆసక్తిని చూపుతున్నారు. గతేడాది పత్తికి ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.8110మద్దతు ధర కల్పించింది. ఈసారి ప్రభుత్వం మద్దతు ధరను రూ.8667కి పెంచింది. పత్తి ఆరుతడి పంట కావడం వర్షాల అనిశ్చితి కారణంగా దిగుబడి రాకపోయిన ధర ఎక్కువగా ఉండటంతో కనీస పెట్టుబడి అయిన వస్తుందన్న నమ్మకంతో రైతులు పత్తిసాగుపై మొగ్గు చూపుతున్నారు. సాగునీటి సౌకర్యాలు ఉన్న చోట రైతులు వరికి ప్రాధాన్యత ఇస్తున్నారు.
జిల్లాలో 4,52,202 ఎకరాల్లో పంటల సాగు..
జిల్లాలోని 15మండలాలలో ఈ వానాకాలం సీజన్‌లో 4,52,202ఎకరాల్లో వివిధరకాల పంటలు సాగవుతాయని అంచనా వేశారు. సాధారణ సాగుకు మించి పంటలు సాగయ్యే అవకాశం ఉందని ప్రభుత్వానికి నివేదికలు పంపారు. జిల్లాలో ఈ మేరకు అంచనాలు వేసిన అధికారులు పంటల సాగుపై గ్రామాల వారీగా పట్టికలు రూపొందించారు. జిల్లాలో సాధారణ సాగు విస్తీర్ణం కంటే పెరిగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు లెక్కలు వేశారు. అయితే వీటిలో పత్తి 3,70,919 ఎకరాలు, వరిపంట 42,228 ఎకరాలు, కందిపంట 20,817, సోయాబీన్ పంట 1,326ఎకరాలు, మొక్కజొన్న 668ఎకరాల్లో సాగవుతుందని అధికారులు అంచనాలు వేశారు. అలాగే ఇతర పంటలైన జొన్న, పెసర, మినుములు, మిరప, వేరుశెనగ, ఆముదాలు, నువ్వులు 11,254ఎకరాలలో సాగవుతున్నట్లు అంచనాలు రూపొందించారు.
ఫ పత్తిసాగుకే అనుకూలం..
- గజ్జెల సంతోష్, రైతు, ఆసిఫాబాద్
నల్లభూములు ఎక్కువగా పత్తిసాగుకే అనుకూలం. దీంతో రైతులు పత్తిపంట వైపే మొగ్గు చూపుతున్నారు. గతేడాది పత్తికి క్వింటాల్‌కు రూ.8110 పలికింది. దీంతో ఈఏడాది కూడా రేటు ఆధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. వర్షాలు అనుకూలిస్తే ఈసారి మంచి దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం.