Share News

Kumaram Bheem Asifabad: ఉన్నత విద్య.. అందని ద్రాక్షేనా?

ABN , Publish Date - Aug 03 , 2026 | 11:53 PM

బెజ్జూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియెట్‌ వరకు చదువులు వెళ్లదీసిన విద్యార్థులు అంతటితోనే ఆపేస్తున్నారు. ఇంటర్‌ తర్వాత చదవాలనే కోరిక ఉన్నా

Kumaram Bheem Asifabad: ఉన్నత విద్య.. అందని ద్రాక్షేనా?

- ప్రభుత్వ డిగ్రీకళాశాల కోసం విద్యార్థుల నిరీక్షణ

- చదువు‘కొనే’ స్తోమత లేక మాధ్యమిక విద్యతోనే సరి

- భారంగా మారుతున్న పట్టణాల్లో చదువులు

బెజ్జూరు, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియెట్‌ వరకు చదువులు వెళ్లదీసిన విద్యార్థులు అంతటితోనే ఆపేస్తున్నారు. ఇంటర్‌ తర్వాత చదవాలనే కోరిక ఉన్నా అందుబాటులో డిగ్రీ కళాశాల లేక పట్టణాల్లో చదివే ఆర్థికస్థోమత లేక ఎందుకొచ్చిన చదువులంటూ ఇంటర్‌తోనే సరిపెట్టు కుంటున్నారు. మారుమూల మండలమైన బెజ్జూరులో డిగ్రీకళాశాల లేకపోవడంతో అనేకమంది పేదవిద్యార్థులు ఇంటర్‌తోనే చదువును ఆపేస్తూ ఉన్నతవిద్యకు దూరం అవుతున్నారు. పట్టణ ప్రాంతాలకు దూరంగా ఉన్న మండలాల్లో డిగ్రీకళాశాలలను నెలకొల్పుతామని ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిదులు ఇచ్చిన హామీలు అమలు కాకపోవడంతో అనేకమంది విద్యారులు డిగ్రీ చదువుకు వెళ్లలేక ఇంటర్‌తోనే ముగించేస్తున్నారు. కాస్త ఆర్థికంగా ఉన్న విద్యార్థులు పట్టణ ప్రాంతాలైన కాగజ్‌నగర్‌, మంచిర్యాల, కరీంనగర్‌, హన్మకొండ, హైదరాబాద్‌ ప్రాంతాలకు వెళ్లి చదువుతున్నారు.

ఇంటివద్దనే బాలికలు..

ఇంటర్‌ పరీక్షలు పూర్తయిన తర్వాత ఉన్నతచదువులకు వెళ్లలేక ఇంటర్మీడియెట్‌ చదువులకు స్వస్తి పలుకుతున్న వారిలో అధికశాతం బాలికలే. వీరిలో ఎంత ప్రతిభ ఉన్నా ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం, ప్రస్తుతం ఆడపిల్లలపై జరుగుతున్న దురాఘాతాలకు భయపడి దూర ప్రాంతాలకు బాలికలను పంపడానికి తల్లిదండ్రులు ఇష్టపడకపోవడమే మరో కారణం. అందరికీ అందుబాటులో ఉన్నతవిద్య అంటూ ప్రకటనలు చేస్తున్న పాలకులు ఆ దిశగా అడుగులు వేయడం లేదు. మారుమూల మండలాల్లో ఉన్నతవిద్యను ప్రోత్సహిస్తే గ్రామీణప్రాంతాల్లో విద్యా కుసుమాలు వికసించే అవకాశం ఎంతైనా ఉంది.

ఉమ్మడి మండలంలోని గ్రామపంచాయతీల్లోని గ్రామాలవారు మండలకేంద్రానికి చేరుకోవాలంటే సరైన సదుపాయాలు లేవు. ఇక పట్టణాలకు వెళ్లి చదువుకోవాలంటే ఇబ్బంది అవుతుందంటూ విద్యార్థులు వాపోతున్నారు. ఇటువంటి చోట డిగ్రీకళాశాల ఏర్పాటు చేస్తే పేద, గిరిజన విద్యార్థులకు ఎంతగానో మేలు చేకూరే అవకాశం ఉంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ కొందరు విద్యార్థులు వివిధ ప్రాంతాల్లో చదువును కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా బాలికలు మాత్రం చదువును ఇంటర్‌తోనే ఆపేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోక పోవడంతోనే గ్రామాల్లో బాలికలు చదువుకుదూరం అవుతున్నారు. ముఖ్యంగా మారుమూల ప్రాంత విద్యార్థు లకు ఉన్నతచదువులు అందని కారణంగా విద్యార్థులు చదువును మధ్యలోనే ఆపేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.

నెరవేరని హామీలు..

అందరికీ అందుబాటులో ఉన్నత చదువులంటూ పాలకులు చేసిన వాగ్ధానాలు ప్రచారాలకే పరిమితమవుతున్నాయి. ఆ దిశగా ప్రయత్నాలు మాత్రం జరగడంలేదు. మారుమూల ప్రాంతాల్లో ఉన్నతవిద్యను ప్రోత్సహిస్తే గ్రామీణప్రాంతాల్లో విద్యాకుసుమాలు వికసించే అవకాశాలు ఉన్నాయి. అయితే పాలకులు మాత్రం ఉన్నతవిద్య పట్ల ప్రచారం చేయడం తప్ప ఆచరణలో అమలు చేయడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం కేజీటు పీజీ వరకు ఉచిత చదువులంటూ అనేక మార్లు ప్రచారాలు చేసిందే తప్ప ఆచరణలో అమలు చేయలేదు. దీంతో దశాబ్దాలుగా గ్రామీణ ప్రాంత విద్యార్థులు ఉన్నతచదువులకు దూరం అవుతూనే ఉన్నారు. మారుమూల మండలమైన బెజ్జూరులో డిగ్రీకళాశాల ఏర్పాటు చేసినట్లయితే పెంచికలపేట, చింలమానేపల్లి, మండలాలతో పాటు పలు గ్రామాల వారికి సౌకర్యంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. దూరప్రాంతాలకు వెళ్లి చదువుకోవడం కష్టంగా ఉందని, అంతేకాకుండా ఇతర ప్రాంతాలకు వెళ్లి చదవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతున్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, పాలకులు స్పందించి డిగ్రీకళాశాల ఏర్పాటుకు కృషిచేసి పేద విద్యార్థులకు ఉన్నతచదువులు అందించాలంటూ తల్లిదండ్రులు కోరు తున్నారు.

ఫ కళాశాల లేకపోవడం దురదృష్టకరం..

- గడ్డం సౌమ్య, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం

మండలంలో డిగ్రీకళాశాల లేకపోవడం దురదృష్టకరం. ఇంటర్‌ అయ్యాక డిగ్రీ చదివేందుకు పట్టణప్రాంతాలకు వెళ్లలేనిస్థితి. కళాశాల అందుబాటులో ఉంటే ఉన్నతచదువులు కొనసాగుతాయి. డిగ్రీ చదవాలంటే కాగజ్‌నగర్‌, మంచిర్యాల తదితర ప్రాంతాలకు వెళ్లవలసి ఉంటుంది. అధికారులు స్పందించి ఇక్కడ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలి.

ఫ పట్టణాల్లో ఉండి చదివే స్థోమత లేదు..

- వెంకటేష్‌, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం

ఉన్నత చదువుల కోసం పట్టణాలకు వెళ్లి చదివే స్థోమతలేదు. బెజ్జూరు నుంచి పట్టణాలకు వెళ్లాలంటే అధిక ఖర్చులు అవుతాయి. దీంతో తాము ఇంటర్‌వరకే చదువు ఆపాల్సి వస్తోంది. ఉన్నతచదువుల కోసం కళాశాల అందుబాటులో లేని కారణంగా చాలా కష్టాలు పడాల్సి వస్తోంది. అధికారులు స్పందించి డిగ్రీకళాశాల ఏర్పాటు చేస్తే తమకు అనుకూలంగా ఉంటుంది.

Updated Date - Aug 03 , 2026 | 11:53 PM