Share News

Kumaram Bheem Asifabad: పెండింగ్‌లోనే సాగునీటి ప్రాజెక్టులు

ABN , Publish Date - Jul 13 , 2026 | 11:53 PM

ఆసిఫాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏళ్లుగా రైతాంగానికి వర్షాధార సాగే దిక్కవుతోంది. ప్రధాన ప్రాజెక్టులు అన్నీ పెండింగ్‌లో ఉండడంతో సాగులో పెద్దగా మార్పు లేదు.

Kumaram Bheem Asifabad:  పెండింగ్‌లోనే సాగునీటి ప్రాజెక్టులు

- ముందుకు కదలని పనులు

- ఏళ్లుగా సాగునీటికి అవస్థలు

- నీటి వనరులున్నా ఉపయోగపడని వైనం

ఆసిఫాబాద్‌, జూలై 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏళ్లుగా రైతాంగానికి వర్షాధార సాగే దిక్కవుతోంది. ప్రధాన ప్రాజెక్టులు అన్నీ పెండింగ్‌లో ఉండడంతో సాగులో పెద్దగా మార్పు లేదు. సరైన సాగునీటి వసతిలేక వేలాది ఎకరాల భూమి నిరుపయోగంగా మారుతోంది. గత్యంతరం లేక ఆరుతడి పంటలతో సరిపెట్టాల్సి వస్తున్నది. వాన వస్తే పంట.. లేకుంటే లేదు అన్న చందంగా మారుతోంది. అన్నదాతలు పూర్తిగా వర్షాధార పంటలపై ఆధార పడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాజెక్టు పూర్తయి సక్రమంగా నీరందిస్తే తప్ప సాగునీరందే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ అవి పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రధానంగా కుమరంభీం ప్రాజెక్టు, జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు నిర్మాణపనులు పూర్తిస్థాయిలో కాలేదు. వట్టివాగు, చెలిమెల వాగు ప్రాజెక్టు కాలువలు మరమ్మతులకు నోచుకోవడం లేదు. ప్రభుత్వం జిల్లాలో సాగునీటి ప్రాజెకులకు నిధులు మంజూరు చేయకపోవడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతోంది.

పూర్తికాని కుమరం భీం..

జిల్లాలో సాగునీటికి గుండెకాయ వంటి కుమరం భీం ప్రాజెక్టు ఏళ్లుగా రైతులకు పూర్తిస్థాయిలో సాగునీరందించడం లేదు. పది టీఎంసీల సామర్థ్యంతో సుమారు రూ.600కోట్లకు పైగా అంచనా లతో నిర్మితమైన ఈ ప్రాజెక్టు ఆయకట్టులో 50శాతం కూడా నీరందించడం లేదు. కుడి ప్రధానకాలువ ద్వారా ఆసిఫాబాద్‌ మండల పరిధిలో ఆరువేల ఎకరాలు, ప్రధాన ఎడమ కాలువ ద్వారా ఆసిఫాబాద్‌తో పాటు కాగజ్‌నగర్‌, సిర్పూర్‌(టి)మండలాల్లోని 45,500ఎకరాలకు సాగునీటిని అందించాలని ప్రాజెక్టును రూపొందించారు. ప్రాజెక్టు ప్రధాన నిర్మాణం పూర్తై ఏళ్లు గడుస్తున్నా కాలువల పనులు పూర్తి కాలేదు. ప్రాజెక్టు ప్రధాన ఆనకట్ట దెబ్బతిని ఏళ్లు గడుస్తున్నా ఆనకట్ట మరమ్మతులకు నోచుకోవడం లేదు

దయనీయ స్థితిలో వట్టివాగు..

ఆసిఫాబాద్‌ మండలం వట్టివాగు నీటిని స్థానిక పొలాలకు అందించాలనే ఉద్దేశ్యంతో 1998లో 24,500 ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. కుడి కాలువ ద్వారా 21,800 ఎకరాలు, ఎడమ కాలువ ద్వారా 2700ఎకరాల ఆయకట్టు లక్ష్యంగా నిర్దేశించారు. కాలువలు ప్రాజెక్టు నిర్మాణం నుంచి ఆధునికీకరణకు నోచుకోవడం లేదు. దీనికి తోడు ఇప్పటికే కాలువలు మొత్తం దెబ్బతిన్నాయి. లైనింగ్‌ కోల్పోయి చెట్లు ఏపుగా పెరిగి అధ్వానంగా మారాయి. చాలాచోట్ల కాలువలు నామరూపాలు లేకుండా పోయాయి. దీంతో ఆసిఫాబాద్‌, రెబ్బెన మండలాల పరిధిలోని ఆయకట్టు రైతులకు సాగునీరు అందించే స్థితిలోలేదు. అధికారులు ఆధునికీకరణ పనుల కోసం ప్రతిపాదనలను పంపినప్పటికీ వాటికి నిధులు విడుదల కాలేదు.

జగన్నాథ్‌‘పూర్‌’..

కాగజ్‌నగర్‌ మండలంలోని పెద్దవాగుపై నిర్మించిన జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. కాగజ్‌నగర్‌, దహెగాం మండలాల పరిధిలో 15వేల ఎకరాలకు సాగు నీరందించే లక్ష్యంతో ప్రాజెక్టు నిర్మాణపనులను చేపట్టినప్పటికీ నత్తనడకన కొనసాగుతున్నాయి. భూసేకరణ, తదితర సమస్యలతో పనుల్లో తీవ్రజాప్యం జరుగుతోంది. దీంతో ప్రాజెక్టు నిర్మాణం పనుల్లో జాప్యంతో ఆయకట్టుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాజెక్టు నిర్మాణం చేపడితే తమ భూములు పంట పొలాలుగా మారుతాయని ఆశించిన రైతులకు.. నిరాశే ఎదురవుతోంది.

Updated Date - Jul 13 , 2026 | 11:53 PM