Kumaram Bheem Asifabad: ఎన్నాళ్లీ వెట్టిచాకిరి?
ABN , Publish Date - Jul 20 , 2026 | 11:46 PM
బెజ్జూరు, జూలై 20 ఆంధ్రజ్యోతి): పేరుకే పార్ట్‌టైం..చేసేది మాత్రం ఫుల్‌టైం ఉద్యోగం.. నెలంతా కష్టపడ్డా చేతికి వచ్చేది మాత్రం అతి తక్కువే.
- రెగ్యులర్ కోసం ఎదురుచూపు
- చాలీచాలని వేతనాలతో సతమతం
- ఉద్యోగ భద్రత కరువు
- అవస్థల్లో పార్ట్‌టైం ఉద్యోగులు
బెజ్జూరు, జూలై 20 ఆంధ్రజ్యోతి): పేరుకే పార్ట్‌టైం..చేసేది మాత్రం ఫుల్‌టైం ఉద్యోగం.. నెలంతా కష్టపడ్డా చేతికి వచ్చేది మాత్రం అతి తక్కువే. చాలీచాలని వేతనం అదికూడా నెలానెలా సక్రమంగా అందవు. దీంతో వారి కుటుంబ పోషణ కడుభారంగా మారుతోంది. ఎప్పటికైనా ప్రభుత్వం తమకష్టాన్ని గుర్తించి తమను రెగ్యులర్ ఉద్యోగులుగా గుర్తిస్తుందేమోనన్న గంపెడాశతో వెట్టిచాకిరి చేస్తున్నారు. దశాబ్దాలుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నా తమను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని పార్‌టైం వర్కరు (కాంటిజెంట్ వర్కర్లు) ఆవేదన వ్యక్తం చేస్తు న్నారు. ఉద్యోగభద్రత లేక, వేతనం పెరగక, చాలీచాలని వేతనాలతో కుటుంబాన్ని ఎలాగోలా పోషించుకుంటున్నా తమ గోడును మాత్రం ఎవ్వరూ పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
ఫ జిల్లా వ్యాప్తంగా..
జిల్లాలో 42మందిని ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1988లో పార్ట్‌టైం వర్కర్లుగా రూ.150 వేతనంతో నియమించారు. కానీ ప్రస్తుతం జిల్లాలో 23మంది మాత్రమే పని చేస్తున్నారు. రాష్ట్రంలో 1,500వందల మందికిపైగా పనిచేస్తున్నారు. వీరంతా దాదాపు 33ఏళ్లుగా రెగ్యూలర్ ఉద్యోగుల మాదిరిగా పనిచేస్తున్నారు. సుమారు మూడు దశాబ్దాలుగా అతితక్కువ వేతనంతో పనిచేస్తున్నా వారి శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదు. ఎన్నో ఏళ్లుగా తమను రెగ్యూలర్ చేయడంతోపాటు వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు 2017 నుంచి నెలకు 4,000 వేతనాన్ని ఇస్తూ ప్రభుత్వం జీవో జారీచేసింది. అయినా అవి ఏమాత్రం సరిపోక కుటుంబ పోషణ భారంగా మారుతోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉపాధిహామీ కూలీలకు ఇచ్చే వేతనం కూడా తమకు రావడం లేదని దీంతో తమ కుటుంబాల పోషణ గడపడం ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కూలీపనికి వెళ్లినా కూడా రోజు రూ.500వస్తాయని తమ పైన ప్రభుత్వాలు ఎందుకు కనికరం చూపడం లేదని వాపోతున్నారు. ప్రస్తుతం తమకు కేవలం రూ.5వేలు మాత్రమే వేతనంగా ఇస్తోందని ఇది ఏమాత్రం సరిపోక తీవ్రఇబ్బందులు పడు తున్నామని వాపోతున్నారు.
ఫ కనీస వేతనాలు చెల్లించాలి..
ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పార్ట్‌టైం ఉద్యోగులకు కనీసవేతనాలు చెల్లించాలని గతంలో ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినా ఎలాంటి ఫలితం లేదని వారు వాపోతు న్నారు. 30ఏళ్లుగా పనిచేస్తున్న పార్ట్‌టైం ఉద్యోగులకు కనీసవేతనం 13వేలు ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అయినా నేటికీ ప్రభుత్వం ఆ ఉత్తర్వులను పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోఏళ్లుగా అతితక్కువ వేతనంతో పనిచేస్తున్నా తమను పాలకులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఎప్పటికైనా తమను ప్రభుత్వం గుర్తిస్తుందేమోనని ఎదురు చూస్తున్నామని చెబుతున్నారు. ప్రస్తుతకాలంలో ఈ వేతనం ఏ మాత్రం సరిపోవడం లేదని దీంతో కుటుంబాల పోషణ, ఆసుపత్రుల ఖర్చులు విపరీతంగా పెరగడంతో జీవనం కష్టంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఉద్యోగభద్రత కూడా లేకపోవడంతో ఏ ప్రమాదం జరిగినా ప్రభుత్వం నుంచి సాయం కూడా అందని పరిస్థితిలో పనిచేస్తున్నారు.
ఫరెండేళ్లు గడిచినా..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పార్ట్‌టైం వర్కర్లను రెగ్యులర్ చేయడం కానీ, కనీస వేతనమన్న ఇస్తామని చెప్పడంతో ఆశలు పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో వారిలో ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో సుమారు 2వేలకు పైగా ఉన్న వీరికి నెలానెలా వేతనాలు రాక, వచ్చే వేతనాలు సరిపోక కొందరు ఉద్యోగాన్ని వదులుకోగా, మరికొంతమంది అనారోగ్య కారణాలతో చనిపోయారు. మిగిలిన వారు తమను ఏనాడైనా ప్రభుత్వం రెగ్యులర్ చేయదా అన్న ఆశతో ఎదురుచూస్తూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న రూ.5వేల వేతనంతో తమ కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. మరికొద్ది రోజుల్లో కొందరు రిటైర్మెంట్ కూడా అయ్యే పరిస్థితిలో ఉన్నారని, రిటైర్ అయ్యాక తమను రెగ్యూలర్ చేస్తారా? అంటూ ప్రభుత్వ తీరుపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కనీస వేతనాలు ఇవ్వాలి..
- ఏలేశ్వరం ప్రభాకర్, పార్ట్ టైం వర్కర్
ఎన్నో ఏళ్లుగా చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్నా తమను ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా తమకు వేతనాలు పెంచడం లేదు. ప్రస్తుతం ఇచ్చే ఐదువేలు ఏ మాత్రం సరిపోవడం లేదు. తమ కష్టాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తమకు వేతనాలు పెంచాలి.
30ఏళ్లుగా పని చేస్తున్నా..
- సిరాజ్, పార్ట్‌టైం వర్కర్
పార్ట్‌టైం వర్కర్‌గా 30ఏళ్లుగా పని చేస్తున్నాను. తమను ఎప్పటికైనా ప్రభుత్వం పర్మనెంట్ చేస్తుందన్న ఆశతో పనిచేస్తున్నాం. తెలంగాణ ఆవిర్భావం అనంతరం రెగ్యూలర్ చేస్తారని భావించాం. ఇప్పటికీ ప్రభుత్వం మా కోరిక నెరవేర్చడం లేదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకొని మమ్ములను ఆదుకోవాలి.