Share News

Kumaram Bheem Asifabad: టోల్‌ వసూళ్లపైనే.. శ్రద్ధ

ABN , Publish Date - Jul 28 , 2026 | 12:09 AM

వాంకిడి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం జిల్లాలో జాతీయ రహదారిని నిర్వహించే సిబ్బంది దృష్టంతా టోల్‌ వసూళ్లపైనే ఉంది తప్ప మరమ్మతుల పైన లేదని

 Kumaram Bheem Asifabad:  టోల్‌ వసూళ్లపైనే.. శ్రద్ధ

- జాతీయ రహదారికి మరమ్మతులు కరువు

- పనులు సగం సగం..

- నిత్యం అవస్థలు పడుతున్న వాహనదారులు

వాంకిడి, జూలై 27 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం జిల్లాలో జాతీయ రహదారిని నిర్వహించే సిబ్బంది దృష్టంతా టోల్‌ వసూళ్లపైనే ఉంది తప్ప మరమ్మతుల పైన లేదని వాహనదారులు వాపోతున్నారు. మూడేళ్ల కిందట నిర్మించిన నాలుగు వరుసల జాతీయ రహదారి పనుల్లో నాణ్యత లోపించడమే కాకుండా సగం సగం పనులు చేసి వదిలివేశారు. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు నిర్మించిన మూడేళ్లు గడువక ముందే మరమతులకు గురవుతుండడంతో నాణ్యతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని రేపల్లెవాడ నుంచి వాంకిడి మండ లంలోని సరిహద్దు గోయేగాం వరకు నిర్మించిన రహదారి అక్కడక్కడ కుంగి ప్రమాదకరంగా తయారైంది. పలుచోట్ల సర్వీసు రహదారి, అక్కడక్కడా డ్రైనేజీ నిర్మాణ పనులు ఇప్పటికీ అసం పూర్తిగానే ఉన్నాయి. ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే ప్రమాదకరంగా ఉన్నచోట తూతూ మంత్రంగా పనులు చేపట్టి గుత్తేదారు చేతులు దులుపుకుంటున్నాడు. పూర్తిస్థాయిలో డ్రైనేజీ పనులు చేపట్టకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. టోల్‌ వసూళ్లపై ఉన్న శ్రద్ధ రోడ్డు నిర్మాణంపై కనపరచ్చ లేదన్న విమర్శలు వస్తున్నాయి. రెపల్లేవాడ నుంచి కుమరంభీం జిల్లా మహారాష్ట్ర సరిహద్దులోని గోయేగాం వరకు 54కిలోమీటర్లు నాలుగు వరుసల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పనులకు రూ.11.50కోట్ల వ్యయం చేశారు. గ్రామాలు ఉన్నచోట సర్వీసు రహదారులకు ఆనుకుని డ్రైనేజీ నిర్మాణాలు చేపట్టాల్సి ఉండగా పలుచోట్ల ఊసేలేదు. కొన్నిచోట్ల అసంపూర్తిగా నిర్మించి వదిలేశారు. వర్షాకాంలో వరద నీరు ఇళ్లల్లోకి చేరుతుండడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు.

- టోలు వసూలుపైనే చూపు..

మండంలోని ఖమాన స్టేజీ వద్ద జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన టోల్‌ప్లాజా ద్వారా నిత్యం దాదాపు రూ.6లక్షల ఆదాయం సమకూరుతున్నా సౌకర్యాల కల్పనను పట్టంచుకోవడం లేదన్న విమర్శలున్నాయి. టోల్‌ వసూలుపై ఉన్న శ్రద్ధ రోడ్డు మరమత్తులు, సర్వీస్‌ రహదారులు, డ్రైనేజీల నిర్మాణాలపై సంబంధిత అధికారులు కనబర్చడంలేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారిపై సమీప గ్రామాల బస్‌స్టేజీల వద్ద బస్‌ షెల్టర్‌లను ఏర్పాటు చేయాల్సి ఉండగా అనేక గ్రామాల వద్ద షెల్టర్‌లు లేక ప్రజలు చెట్ల నీడల్లో, హోటళ్ల వద్ద బస్సుల కోసం వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.

- పట్టించుకోని అధికారులు..

జాతీయ రహదారిపై ప్రతిరోజు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతోపాటు నేషనల్‌హైవే పెట్రోలింగ్‌ టీం కూడా తిరుగుతుంటుంది. కుంగుతున్న రహదారి, అసంపూర్తిగా ఉన్న డ్రైనేజీలు, సర్వీస్‌ రోడ్ల నిర్మాణాలు వారి దృష్టికి వస్తున్నా ఏమాత్రం పట్టించుకోవడంలేదు. మండలంలోని గోయేగాం, గణేష్‌పూర్‌, మండలకేంద్రంలోని పాతబస్టాండ్‌, అంబేడ్కర్‌నగర్‌ వెళ్లే రహదారి సమీపంలో డ్రైనేజీ నిర్మాణాలు నేటికీ చేపట్టలేదు. వర్షాకాలంలో వరదనీరు ఇళ్లల్లో చేరుతుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలకేంద్రంలోని బస్‌షెల్టర్‌ వద్ద అసంపూర్తిగా డ్రైనేజీ వద్ద మురుగునీరు నిలిచి దుర్వాసనతో ప్రజలు అవస్థలకు గురవుతున్నారు. సర్వీసు రహదారి, డ్రైనేజీలు నిర్మించాలని ఇటీవల గణేష్‌పూర్‌, వాంకిడి మండలకేంద్రంలో ప్రజలు రోడ్డోపై బైటాయించి ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా ఫలితం లేకుండా పోతోందని ప్రజలు పేర్కొంటున్నారు.

- పట్టించుకోని కేంద్రమంత్రి ఆదేశాలు..

రోడ్లు సరిగ్గా నిర్వహంచలేనప్పుడు టోల్‌ మసూలు చేయోద్దని, గుంతలతో కూడిన రోడ్లు, టోల్‌ ప్లాజాల వద్ద వాహనాల రద్దీ, ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని కేంద్ర రహదారులు, రవాణా శాఖమంత్రి నితిన్‌ గడ్కరీ ఎన్‌హెచ్‌ఏఐ అధికారులను, టోల్‌ప్లాజా ఏజెన్సీలను హెచ్చరించారు. మంత్రి ఆదేశాలను సైతం అధికారులు ఖాతచేయడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. వాంకిడి మండలం నుంచి రెబ్బెన మండలం వరకు అక్కడక్కడ రోడ్డు కుంగినచోట మరమ్మతులు చేయడానికి అధికారులు బీటీనీ తొలగించి రోజుల దాకా మరమ్మతులు చేయకపోవడంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు మాత్రం దర్జాగా టోల్‌ వసూలు చేస్తున్నారని వాహనదారులు ఆరోపిస్తున్నారు. దీంతోపాటు టోల్‌ప్లాజా సమీపంలోని కార్లు ఉన్న యజమానులు తమ ఆధార్‌కార్డును టోల్‌ప్లాజా వద్ద తీసుకువెళ్లి ఎలాంటి రుసుము లేకుండా నెలసరి పాసులను తీసుకోవాలని గత ఏడాది జరిగిన పార్లమెంటు సమావేశంలో మంత్రి గడ్కరీ స్పష్టంగా చెప్పారు. కానీ టోల్‌ప్లాజా ఏజెన్సీలు మాత్రం మంత్రి ఆదేశాలను కూడా పాటించడం లేదని వాహన యజమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. టోల్‌ప్లాజా సమీపంలోని కారు గల యజమానులకు ఉచితపాస్‌ అందించాలని వాహనదారులు కోరుతున్నారు.

ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి..

- బోయిరే ప్రకాష్‌ - సీపీఐ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు

జాతీయ రహదారి నిర్మాణంలో ఎన్‌హెచ్‌ఏఐ అధికారుల నిర్లక్ష్యం మూలంగా ప్రజలు తీవ్ర ఇబ్బండులు పడుతున్నారు. వాంకిడి మండల కేంద్రంతోపాటు బంబార, గణేష్‌పూర్‌ గ్రామాల్లో సర్వీస్‌ రహదారి, డ్రైనేజీల నిర్మాణాలు చేపట్టలేదు. దీంతో వర్షాకాలంలో ప్రజలు తీవ్రఇబ్బందులు పడుతున్నారు. బంబార గ్రామంలో ప్రజల సౌకర్యార్థం అండర్‌పాస్‌ ఏర్పాటు చేయాల్సి ఉండగా అధికారులు నిర్లక్ష్యంగా వదిలివేశారు. దీంతో విద్యార్థులు రోడ్డు దాటి పాఠశాలకు వెళ్లడానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉన్నతాధికారులు వెంటనే బంబార గ్రామంలో అండర్‌పాస్‌ ఏర్పాటు చేయాలని, సర్వీస్‌ రహదారులు, అవసరం ఉన్న చోట డ్రైనేజీలు, బస్‌షెల్టర్లు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jul 28 , 2026 | 12:12 AM