Share News

Kumaram Bheem Asifabad: ఎల్‌నినో వి‘పత్తి’

ABN , Publish Date - Oct 12 , 2026 | 11:36 PM

బెజ్జూరు, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): పత్తి రైతులకు ఈ ఏడాది దిగుబడి దిగులు పట్టుకుంది. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్రవర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి.

Kumaram Bheem Asifabad:  ఎల్‌నినో వి‘పత్తి’

- దిగుబడిపై పత్తి రైతుల దిగులు

- కురవని వానలు

- వాడిన పంట.. రాలుతున్న కాయలు

- పెట్టుబడులు రాని దుస్థితి

- జిల్లాలో 3.70లక్షల ఎకరాల్లో పత్తి సాగు

బెజ్జూరు, అక్టోబరు 12 (ఆంధ్రజ్యోతి): పత్తి రైతులకు ఈ ఏడాది దిగుబడి దిగులు పట్టుకుంది. ఎల్‌నినో ప్రభావంతో జిల్లాలో తీవ్రవర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. సకాలంలో వానలు కురవకపోవడంతో పత్తి పంట చేతికొచ్చేలా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. వానాకాలం సీజన్‌ ఆరంభంలో కురిసిన వానలకు రైతులు పత్తివిత్తనాలు నాటారు. అడపాదడపా కురిసిన వర్షాలకు పత్తికాస్త పచ్చబడింది. ఆ తర్వాత ఆగస్టు, సెప్టెంబరులో వరుణుడు కరుణించ కపోవడంతో పత్తి వాడుముఖం పట్టింది. పొడి వాతావరణం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా భూమిలోని తేమశాతం తగ్గిపోయి పత్తిమొక్కలు వాడుతున్నాయి. సకాలంలో నీరందక పత్తి చేలన్నీ ఎర్రబారుతున్నాయి. కాయలు పక్వానికి రాకముందే నల్లగా మారి రాలిపోతున్నాయి. చిన్నవిగా ఉన్నప్పుడే పగిలిపోతున్నాయి. దీనికి తోడు పత్తికి తెగుళ్లు వ్యాపించడంతో పత్తి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంట పెట్టుబడి కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తోచడం లేదని రైతులు దిగులు చెందుతున్నారు.

3.70లక్షల ఎకరాల్లో పత్తి..

ఎప్పటిలాగే ఈ సారి కూడా జిల్లాలో పత్తి సాగుదే సింహభాగం. జిల్లాలో 3.70లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతున్నది. ఆ తర్వాత వరి 47,228ఎకరాలు, మొక్కజొన్న 7,668, పప్పు ధాన్యాలు 21,054, ఇతర పంటలు 5,712ఎకరాల్లో సాగు చేస్తున్నారు. ఈ ఏడాది వానలు ముఖం చాటేయడంతో పంట కల్లముందే ఎండిపోయే దశకు చేరడంతో రైతులు ఆవేదన పడుతున్నారు.

పెరిగిన ధరలు..

పత్తి సాగు రైతులకు గతంలో కంటే భారంగా మారింది. యూరియా, డీఏపీ, పొటాష్‌, ట్రాక్టర్‌ అద్దె, కూలీల ధరలు పెరగడంతో పెట్టుబడి పెరిగిపోయింది. పత్తివిత్తనాల ధరలు పెరగగా, యూరియా ధర గతేడాది మాదిరిగా ఉండగా, డీఏపీ, పొటాష్‌ మిగతా రసాయనిక ఎరువుల ధరలు అధికమయ్యాయి. డీజిల్‌ ధరలు పెరగడంతో ట్రాక్టర్‌ యజమానులు కిరాయి పెంచారు. దీనికితోడు సాగులో కీలకమైన కూలీలు కూడా ధరలు అమాంతం పెంచేశారు. డీఏపీ అప్పుడు రూ.1500ఉండగా, ఇప్పుడు రూ.2400, పొటాష్‌ అప్పుడు రూ.1200ఉండగా, ఇప్పుడు రూ. 1500, 28ః28ః28 అప్పుడు రూ.1800ఉండగా, ఇప్పుడు రూ.2400, 20ః20ః20 గతేడాది రూ.1300ఉండగా, ప్రస్తుతం రూ.2200కు పెరిగింది. ఇలా సాగు కోసం పెట్టుబడి ధరలు పెరగడం, దీనికితోడు ఎల్‌నినో ఎఫెక్ట్‌తో పంట చేతికి వస్తుందో రాదో తెలియక సతమతమవుతున్నారు. ఏటా ప్రకృతి వైపరిత్యాలతో నష్టపోతున్నా ప్రభుత్వం మాత్రం పంటనష్టానికి సాయం అందించడం లేదని రైతులు వాపోతున్నారు.

జిల్లాలో లోటు వర్షపాతం..

జిల్లాలో ఈసారి లోటు వర్షపాతం నమోదైంది. జిల్లాలో సాధారణ వర్షపాతం 1049.6కాగా, 1019.3శాతం వర్షపాతం నమోదైంది. 30.3శాతం లోటు నమోదైంది. సాగు ప్రారంభం నుంచి అన్నదాతకు అన్నీకష్టాలే ఎదురయ్యాయి. సెప్టెంబరులో సరైన వర్షాలు కురిసినట్లయితే పంటలకు ఎలాంటి డోకా లేకుండా ఉండేదని రైతులు అంటున్నారు. ఈ నెలలోనైనా ఒకవర్షం కురసినట్లయితే పంటలకు ఊపిరిపోస్తుందని రైతులు తెలుపుతున్నారు. ప్రభుత్వం కూడా ఎల్‌నినో కారణంగా కరువు మండలాల ప్రకటనపై ఎలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు. దీంతో సాగు రైతులకు ఈసారి నష్టాలు తప్పేలా లేవని ఆందోళనకు గురవుతున్నారు.

ప్రభుత్వం ఆదుకోవాలి..

- చటారి హన్మంతు, రైతు ఎల్కపల్లి

ఎల్‌నినో ప్రభావంతో ఈ ఏడాది పత్తి, వరిపంటలకు తీరని నష్టం కలిగిస్తోంది. వానలు లేక ఇప్పటికే సాగుచేసిన పంటలు ఎండుముఖం పడుతున్నాయి. సాగుకోసం లక్షల రూపాయలు అప్పులు తెచ్చామని, కనీసం పెట్టుబడులు కూడా రాని పరిస్థితి ఉందని, రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.

Updated Date - Oct 12 , 2026 | 11:36 PM