Kumaram Bheem Asifabad: బాబోయ్.. పులి
ABN , Publish Date - Sep 05 , 2026 | 11:23 PM
సిర్పూరు(టి), సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): సిర్పూరు(టి) అటవీప్రాంతంలో పులి సంచరిస్తున్నదని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు.
- వ్యవసాయ పనులకు వెళ్లాంటేనే జంకుతున్న ప్రజలు
- సిర్పూరు(టి) అటవీప్రాంతంలో సంచరిస్తున్న పులి
- అవగాహన కల్పిస్తున్న అటవీశాఖ అధికారులు
- అప్రమత్తతే శ్రీరామరక్ష
సిర్పూరు(టి), సెప్టెంబరు 5 (ఆంధ్రజ్యోతి): సిర్పూరు(టి) అటవీప్రాంతంలో పులి సంచరిస్తున్నదని అటవీశాఖ అధికారులు నిర్ధారించారు. సిర్పూరు(టి) మేడిపల్లిలో నాలుగు రోజుల క్రితం మేతకు వెళ్లిన ఎద్దుపై పులి దాడిచేసి చంపేసింది. దీంతో పులిభయంతో అంతా జంకుతున్నారు. రావన్‌పల్లి అటవీప్రాంతంలో జరిగిన ఈ ఘటనను అధికారులు అధికారికంగా నిర్ధారించారు. సిర్పూరు(టి), బెజ్జూరు, చింతలమానేపల్లి, పెంచికల్‌పేట తదితర ప్రాంతాల్లో పులి సంచారానికి సంబంధించిన కారిడార్ ఉండటం ఈ మార్గంలోనే పులి పాదముద్రలు కన్పిస్తుండటంతో అంతా ఆందోళన చెందుతున్నారు. పులి భయంతో ఇప్పుడు కూలీలు పనులకు కూడా పోవటం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందోని అంతా భపడుతున్నారు. పులి కదలికలను గుర్తించేందుకు అటవీశాఖ అధికారులు అటవీమార్గంలో కెమెరాలను ఏర్పాటు చేసి నిఘాను పెంచేస్తున్నారు. కాగా.. పక్షంరోజుల క్రితం కౌటాల మండలంలో కూడా పులి సంచరించింది. ఇందుకు సంబంధించిన పులి పాద ముద్రలను చూసి గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అదేరోజు రాత్రి కూడా సిర్పూరు(టి) మండలంలో పులి సంచరించినట్టు పాద ముద్రలు లభించాయి. దీంతో వరుసగా పులి అడుగులు లభ్యం కావటంతో కారిడార్‌లో పులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ సంఘటన తర్వాత నాలుగు రోజుల క్రితం కూడా రావన్‌పల్లి అటవీప్రాంతంలో తెలంగరావుకు చెందిన ఎద్దును చంపేయటం ఇప్పుడు కలకలం రేపుతోంది. దీంతో అటవీప్రాంత సమీపంలోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆయాగ్రామాల్లో అటవీశాఖ అధికారులు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
ఫ అటవీశాఖ అధికారులు సూచిస్తున్న జాగ్రతలు..
సిర్పూరు(టి)-మహారాష్ట్రకు అటవీమార్గంలో పులికి కారిడార్ ఉండటంతో పులిపట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. ప్రధానంగా పొలం పనులు చేసే వారు ఉదయం పదిగంటల తర్వాత వెళ్లాలని, పనులు ముగించే సమయం కూడా సాయంత్రం నాలుగు గంటల కల్లా పూర్తిచేసుకోవాల్సి ఉంటుందని వివరిస్తున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే కూలీలు ప్రధానంగా గుంపులు గుంపులుగా వెళ్లాలని వివరిస్తున్నారు. పులి ఎదురుపడినా కూడా గట్టిగా కేకలు వేసేందుకు అవకాశం ఉంటుదని సూచిస్తున్నారు. ప్రధానంగా పులి సంచరిస్తున్న సమయంలో రాళ్లురువ్వుటం, ఫొటోలు తీయడం లాంటివి చేస్తే పులి దాడిచేసే అవకాశం ఉంటుందని, ఇలాంటి చర్యలకు ఎట్టిపరిస్థితుల్లో పాల్పడవద్దని పేర్కొంటున్నారు.
ఫ అప్రమత్తం చేస్తున్నాం..
- శ్రీనివాస్, ఎఫ్‌ఆర్వో, సిర్పూరు(టి)
సిర్పూరు(టి)-మహారాష్ట్ర ప్రాంతానికి అనుసంధానంగా పులికి సంబంధించిన కారిడార్ ఉంది. ఈ మార్గంలోనే పులులు సంచరిస్తుంటాయి. పులి తిరుగుతున్న పాదముద్రలు సేకరించాం. పులిని రక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంది. అటవీప్రాంతంలో ఎవరూ ఒంటిరిగా పోవడం మంచిది కాదు. పొలం పనులకు వెళ్లేవారు మాత్రం అప్రమత్తంగా ఉండాలి. సిబ్బందితో ఎప్పటికప్పుడు పులిని ట్రాకింగ్ చేస్తున్నాం.