Share News

ఉన్నట్టా....లేనట్టా....?

ABN , Publish Date - May 04 , 2026 | 11:33 PM

గ్రామపంచాయతీ కోఆప్షన్‌ సభ్యుల నియామకం ఉంటుందా లేదా అని ప్రశ్నార్థకంగా మారింది. పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరి ఐదు నెలలు కావస్తున్నా వీరి నియామకం ఊసే లేదు.

ఉన్నట్టా....లేనట్టా....?

- పంచాయతీ కోఆప్షన్‌ సభ్యుల నియామకం ఎప్పుడో?

- సర్పంచులు కొలువుదీరి ఐదు నెలలు కావస్తున్నా ఊసే లేదు

- స్పందించని ప్రభుత్వం

- నిరాశలో కాగ్రెస్‌ నాయకులు

వాంకిడి, మే 4 (ఆంధ్రజ్యోతి): గ్రామపంచాయతీ కోఆప్షన్‌ సభ్యుల నియామకం ఉంటుందా లేదా అని ప్రశ్నార్థకంగా మారింది. పంచాయతీ పాలకవర్గాలు కొలువుదీరి ఐదు నెలలు కావస్తున్నా వీరి నియామకం ఊసే లేదు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన విధానాన్ని మనమెందుకు అమలు చేయాలనే ఉద్దేశంతో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. గత బీఆర్‌ఎస్‌ పాలనలో కొత్త పంచాయతీరాజ్‌ చట్టం-2018 ప్రకారం గ్రామపాలన మరింత మెరుగుపచ్చడానికి కోఆప్షన్‌ సభ్యులను నియమించింది. పంచాయతీ పాలకవర్గాలకు తగు సూచనలు, సలహాలు ఇవ్వడం, గ్రామాభివృద్ధిలో పాలు పంచుకోవడానికి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతీ గ్రామ పంచాయతీకి ముగ్గురు చొప్పున కోఆప్షన్‌ సభ్యులకు పంచాయతీ వార్డు మెంబర్‌ హోదా కల్పించింది. మండల పరిషత్‌లకు కోఆప్షన్‌ సభ్యులను రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వంవారి పార్టీ కార్యకర్తలను నియమిస్తుంది. అలాగే గ్రామ పంచాయతీలకు సైతం రాష్ట్ర ప్రభుత్వమే కోఆప్షన్‌ సభ్యులను నియమించాల్సి ఉన్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. గ్రామ పంచాయతీ కోఆప్షన్‌ పదవులపై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన నాయకులు ఆశలు పెట్టుకున్నారు. పార్టీ కోసం పనిచేసే తమకు పదవి వస్తుందని ఎదురుచూస్తున్నా రు. జిల్లాలో 335 గ్రామ పంచాయతీలున్నాయి. ఒక్కో పంచాయతీకి ముగ్గురు చొప్పున కో ఆప్షన్‌ సభ్యులను నియమించినా 1,005 మందికి అవకాశం లభిస్తుంది. పంచాయతీ పాలకవర్గం కోలువుదీరిన నెల రోజుల వ్యవధిలోనే కో ఆప్షన్‌ సభ్యులను నియమించాల్సి ఉంది. అయితే ఎన్నికలు జరిగి ఐదు నెలలు కావస్తున్నా ఇంతవరకు వారి నియామకంపై ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీంతో కాంగ్రెస్‌ నాయకులు నిరాశ చెందుతున్నారు.

- ఎంపిక ఇలా....

పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులను, గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు, పంచాయతీలకు స్థలం ఇచ్చిన దాతలు లేదా ఎన్‌ఆర్‌ఐలను కోఆప్షన్‌ సభ్యులుగా ఎంపిక చేయాల్సి ఉంటుంది. వీరు గ్రామాల అభివృద్ధి కోసం మార్గదర్శకంగా పనిచేయాలి. ప్రభుత్వ కార్యకలాపాలు, ప్రభుత్వ పథకాలను ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడానికి పంచాయతీ పాలకవర్గానికి సూచనలు చేయాలి. దాతల నుంచి విరివిగా విరాళాలు సేకరించాలి. కోఆప్షన్‌ సభ్యుల ఎంపికలో సర్పంచ్‌ది కీలకపాత్ర ఉంటుంది. అయితే అనుభవజ్ఞులను నియమించకుండా ఎమ్మెల్యేలు, తమ అనుచరులను ఎంపిక చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

- పంచాయతీలో సముచిత స్థానం...

గ్రామ కోఆప్షన్‌ సభ్యులకు పంచాయతీలో సముచిత స్థానం ఉంటుంది. పంచాయతీ వార్డు సభ్యులతో సమానంగా ప్రొటోకాల్‌ ఉంటుంది. పంచాయతీ సమావేశాల్లో పాల్గొంటారు. గ్రామాభివృద్దికి సూచనలు, సలహాలు ఇస్తారు. పంచాయతీ నిధుల వినియోగం, గ్రామ ప్రగతికి సంబంధించి ప్రణాళిక తయారు చేసి అమలుకు చొరవ తీసుకుంటారు. వీరు ఎన్‌ఆర్‌ఐలు, మంత్రులు, ఎమ్మెల్యేలను సర్పంచ్‌తో కలిసి నిధులు రాబట్టాలి. వార్డుల్లో సమస్యల పరిష్కారానికి నిధులు తెచ్చేందుకు చొరవ తీసుకుంటారు. ఎంపీపీ, జడ్పీటీసీ, ఎమ్మెల్యేలతో మాట్లాడి పాఠశాలల్లో ఇబ్బందులను తీర్చేందుకు కృషిచేయడం వంటి నిధులు పంచాయతీ కోఆప్షన్‌ సభ్యులకు ఉంటాయి.

- గ్రామాభివృద్దికి పాటుపడే వ్యక్తులను నియమించాలి

దుర్గం శ్యాంరావు- ఆర్‌పీఐ జిల్లా అధ్యక్షుడు

గ్రామాభివృద్దికి అంకితభావంతో కృషిచేసే వారిని కోఆప్షన్‌ సభ్యులుగా నియమించాలి. ప్రజల అవసరాలను తీర్చడానికి స్వచ్ఛందంగా ముందుకు వచ్చే వారిని ఎంపిక చేయాలి. అవసరమైతే సొంతంగా డబ్బు వెచ్చించి ప్రజల బాగోగులను పట్టించుకునే వారికి అవకాశం కల్పించాలి. ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు, ఇతర అధికారులతో మాట్లాడి గ్రామానికి నిధులు రప్పించే సామర్థ్యం గలవారైతే బాగుంటుంది. ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు కోఆప్షన్‌ సభ్యులను నియమిస్తుందో లేదో వేచి చూడాలి.

Updated Date - May 04 , 2026 | 11:33 PM