Share News

ప్రకటనలకే పరిమితమా?

ABN , Publish Date - May 09 , 2026 | 11:52 PM

అంగన్‌వాడీల భర్తీ ప్రక్రియ ఒక అడుగు ముందుకు...నాలుగడుగులు వెనక్కి అన్న చందంగా మారింది.

ప్రకటనలకే పరిమితమా?

- అంగన్‌వాడీ పోస్టుల భర్తీకి నోచుకోని వైనం

- భర్తీ చేస్తామని 11నెలల క్రితం ప్రకటన

- జిల్లాలో 165టీచర్‌, 447ఆయాల పోస్టులు ఖాళీ

- ఇబ్బందులు పడుతున్న బాలింతలు, గర్భిణులు, పిల్లలు

బెజ్జూరు, మే 9(ఆంధ్రజ్యోతి): అంగన్‌వాడీల భర్తీ ప్రక్రియ ఒక అడుగు ముందుకు...నాలుగడుగులు వెనక్కి అన్న చందంగా మారింది. తరచూ ప్రభుత్వం ఖాళీగా ఉన్న అంగన్‌వాడీలను భర్తీ చేస్తామంటూ ప్రకటిస్తూ నిరుద్యోగుల్లో ఆశలు చిగురింపజేస్తూ ఆ తర్వాత నియామకంపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేయని కారణంగా నిరుద్యోగ మహిళలు ఆందోళన చెందుతున్నారు. ఎనిమిదేళ్లుగా అంగన్‌వాడీలకు సంబంధించిన నియామకాలు జరగక సేవల్లో లోపాలు వెలుగుచూస్తున్నాయి. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం, పూర్వ ప్రాథమిక విద్య అందించడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నా పథకాల అమలులో జాప్యం జరుగుతోందన్న విమర్శలు ఉన్నాయి. పదవీ విరమణ, పదోన్నతులతో ఖాళీల సంఖ్య క్రమేపీ పెరుగుతోంది. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో టీచర్‌, ఆయా పోస్టులు భర్తీ చేయకపోవడంతో ఆయా కేంద్రాల పరిధిలో బాలింతలు, గర్భిణులు, పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. టీచర్‌ పోస్టులు ఖాళీగా ఉన్న కేంద్రాల నిర్వహణ బాధ్యతను పక్క కేంద్రాల టీచర్లకు అప్పగించడంతో వారిపై అదనపు భారం పడుతోంది. దీంతో అంగన్‌వాడీ కేంద్రాలు సమస్యలకు నిలయంగా మారాయి. జిల్లావ్యాప్తంగా ఆసిఫాబాద్‌, జైనూరు, వాంకిడి, సిర్పూర్‌, కాగజ్‌నగర్‌లో ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 1,006 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 165 టీచర్‌, 447ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. జూలై నెలలో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అంగన్‌వాడీ టీచర్లు, ఆయాల పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించారు. దీంతో నిరుద్యోగ మహిళల్లో ఆశలు చిగురించాయి. ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తే అటు అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే వారికి మేలు జరగడమే కాకుండా ఇటు నిరుద్యోగులకు సైతం ఉపాధి కల్పించినట్లు అవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.

వీరిదే కీలక పాత్ర...

ఐసీడీఎస్‌లో అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలదే క్షేత్రస్థాయిలో కీలకపాత్ర. ఓ వైపు వారికి కేటాయించిన అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారంతో పాటు పలు రకాల సేవలు అందిస్తూ, వైద్య ఆరోగ్య శాఖలో చేపట్టే కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నారు. బూత్‌ లెవల్‌ అధికారులుగా ఎన్నికల విధుల్లో సేవలు అందిస్తున్నారు. ఖాళీలు భర్తీ అయితే ప్రస్తుతం ఉన్న అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలకు పని భారం తగ్గడంతో పాటు కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు, చిన్నారులకు మెరుగైన సేవలు అందించే అవకాశం ఉంటుంది. జిల్లాలోని అంగన్‌వాడీ కేంద్రాల్లో 0-6ఏళ్ల పిల్లలు 46,945 మంది ఉన్నారు. గర్భిణులు, బాలింతలు 7,867 మంది ఉన్నారు.

ఖాళీలతో సతమతం...

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పరిధిలో ఐదు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 1,006 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. జిల్లావ్యాప్తంగా 165 టీచర్‌, 447ఆయాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈనేపథ్యంలో సిబ్బంది కొరత ఉన్న కేంద్రాల్లో ఇన్‌చార్జీలతో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. దీంతో గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు సరైన సేవలు అందడం లేదు. ఇప్పటికే మంత్రి సీతక్క గతజూలై నెలలో భర్తీపై ప్రకటన చేసిన నేపథ్యంలో నిరుద్యోగ మహిళల్లో ఆశలు రేకెత్తాయి. అయితే అప్పటి నుంచి మళ్లీ నియామకంపై ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లో పోస్టులను భర్తీ చేస్తామని ప్రభుత్వం పలుమార్లు ఆశలు రేకెత్తించింది. దీంతో నిరుద్యోగ మహిళల్లో ఆశలు చిగురించాయి. కానీ ఎప్పుడు భర్తీ చేస్తారనేదానిపై ఇంకా స్పష్టత లేదు.

భర్తీ చేస్తేనే బలోపేతం....

జిల్లాలోని ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌, ఆయా పోస్టులను భర్తీచేస్తేనే అంగన్‌వాడీ కేంద్రాలు బలోపేతమయ్యే అవకాశం ఉంది. రాష్ట్రంలోని ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తామని మంత్రి ప్రకటించి 11 నెలలు కావస్తున్నా ఇప్పటికీ దీని ఫైలు కదలిక లేకపోవడంతో నిరుద్యోగ మహిళల్లో ఆందోళన మొదలైంది. ఖాళీ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించి 11 నెలలు కావస్తోంది. అయితే అధికార వర్గాల నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేకపోవడంతో నిరుద్యోగుల ఆశలు నెరవేరేనా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి జిల్లాలోని ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రాల్లోని పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగ మహిళలు డిమాండ్‌ చేస్తున్నారు.

ప్రభుత్వానికి నివేదికలు ఆందజేశాం...

- ఆడెపు భాస్కర్‌, జిల్లా సంక్షేమ అధికారి

జిల్లాలోని ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ టీచర్‌, ఆయాల పోస్టుల భర్తీ కోసం గతంలోనే ప్రభుత్వానికి నివేదించాం. జిల్లాలో టీచర్‌, ఆయాల పోస్టులు 612 వరకు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికే జిల్లాలోని ఖాళీల వివరాలు సేకరించి నివేదించాం. ఖాళీగా ఉన్న అంగన్‌వాడీల భర్తీకి కసరత్తు మొదలైంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాగానే భర్తీకి చర్యలు తీసుకుంటాం.

Updated Date - May 09 , 2026 | 11:52 PM