సేంద్రియ సాగుపై ఆసక్తి
ABN , Publish Date - Apr 01 , 2026 | 11:33 PM
రసాయనిక ఎరువుల వినియోగం అధిక మోతాదులో వినియోగిస్తుండటంతో మట్టిలోని భూసారం దెబ్బతింటోంది.
- పశువుల ఎరువుపై మొగ్గు చూపుతున్న రైతులు
- పంట పొలాల్లో మేకల, గొర్రెల మందలు
- జిల్లాలో పశువుల ఎరువుకు డిమాండ్
ఆసిఫాబాద్, ఏప్రిల్ 1(ఆంధ్రజ్యోతి): రసాయనిక ఎరువుల వినియోగం అధిక మోతాదులో వినియోగిస్తుండటంతో మట్టిలోని భూసారం దెబ్బతింటోంది. తెగుళ్ల ఉధృతి పెరిగి సరైన దిగుబడులు రాక అన్నదాతలు అప్పుల్లో కూరుకుపోతున్నారు. అంతేకాకుండా రసాయన ఎరువులు, పురుగు మందులతో భూసారం తగ్గి ప్రకృతిని దెబ్బతీయటం, మనిషి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యాహ్నయ ఆలోచనలు చేస్తున్నారు. ఈ ఏడాది యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎకరాకు రెండు, మూడు బస్తాలు మాత్రమే కేటాయించారు. దీంతో రైతులు తమ పంట పొలాల్లో భూసారాన్ని పెంచుకునేందుకు సేంద్రియ ఎరువుల వాడకంలో ఆసక్తి కనబరుస్తున్నారు. జిల్లాలో చాలామంది రైతులు తమ పంట పొలాల్లో భూసారాన్ని పెంచుకునేందుకు నల్ల మట్టి, ఆవు, మేకల, గొర్రెల పేడ, సేంద్రియ ఎరువుల వైపు మొగ్గు చూపుతున్నారు .పత్తి పంట పూర్తయిన చేనుల్లో గొర్రెల, మేకల మందలను కూర్చోపడుతున్నారు.
- పంట పొలాల్లో పశువుల ఎరువులు..
జిల్లాలోని 15 మండలాల్లో సుమారు 1.20 లక్షల మంది రైతులు ఉండగా జిల్లా వ్యాప్తంగా 4.5లక్షల ఎకరాలలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ఇందులో ఎక్కువగా 3.5 లక్షల ఎకరాల్లో రైతులు పత్తి పంటను సాగు చేస్తుండగా, మిగతా భూముల్లో వరి, కంది, జొన్న మొక్కజొన్న, పెసర తదితర పంటలను వేస్తున్నారు. రసాయన ఎరువులపై పరిమితులు రావడంతో రైతులు తమ పంట చేలల్లో, పొలాల్లో మేకలు, గొర్రెల మందలను కూర్చోపెడుతున్నారు. 500 నుంచి 100 గొర్రెలు, మేకలు ఉన్న మందకు రోజుకు 1000 రూపాయల నుంచి 1500 రూపాయలు ఇచ్చి పంట పొలాల్లో పెడుతున్నారు. నేరుగా పంట పొలాల్లో , చేనుల్లో మందలను ఏర్పాటు చేయడంతో ఎకరాకు 6,000 రూపాయల వరకు ఖర్చవుతోంది. దీంతో పశువుల ఎరువుకు డిమాండ్ పెరుగుతోంది. ఒక్కసారి పశవుల ఎరువులు పంట చేనుల్లో వేస్తే మూడు సంవత్సరాలు పనిచేయడంతో రైతులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో అధికంగా గిరిజన గ్రామాలు ఉండటం, చాలా గ్రామాల పక్కనే అటవీ ప్రాంతం ఉండటంతో ఆవులు, గేదెలు, మేకలు, గొర్రెల పశుపోషణ ఎక్కువగా ఉంది. దీంతో చాలా మంది రైతులు సేంద్రియ ఎరువులు పంట పొలాల్లో వాడుతున్నారు. సేంద్రియ ఎరువుల వాడకంతో పంట దిగుబడి ఎక్కువగా వస్తుండటంతో రైతులు ఆసక్తి చూపుతున్నారు. గ్రామాల్లో ఎరువును కొనుగోలు చేస్తూ పంట పొలాల్లో వేసుకుంటున్నారు. గ్రామాల్లో నిల్వ చేసిన సేంద్రియ ఎరువులు ఒక్కో లారీకి 15,000 రూపాయల నుంచి 20,000 రూపాయల ధర పలుకుతోంది.
భూసారం పెరుగుతుంది...
-మిలింద్, వ్యవసాయాధికారి, ఆసిఫాబాద్
సేంద్రియ ఎరువుల వాడకంతో భూసారం పెరుతుంది. పోషకాలు పెరుగుతాయి. సూక్ష్మజీవులకు సేంద్రియ పదార్థం ఆహారంగా ఉపయోగపడుతుంది. భూమి సారవంతంతో పంట దిగుబడి అధికమవుతుంది. అన్ని పంటలకు సేంద్రియ ఎరువులను విరివిగా వాడుకోవచ్చు.