ఆయిల్‌పామ్‌పై ఆసక్తి
ABN , Publish Date - May 23 , 2026 | 11:32 PM
జిల్లాలో ఆయిల్‌పామ్ సాగువైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఏడేళ్లుగా జిల్లా ఉద్యానశాఖ అధికారులు రైతుల్లో ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన పెంచుతూ వస్తున్నారు.
- పెరుగుతున్న ఆయిల్‌పామ్ సాగు
- జిల్లాలో 2,057ఎకరాల్లో పంట
- ఈ ఏడాది మరో వెయ్యి ఎకరాలు లక్ష్యం
బెజ్జూరు, మే 23(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఆయిల్‌పామ్ సాగువైపు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఏడేళ్లుగా జిల్లా ఉద్యానశాఖ అధికారులు రైతుల్లో ఆయిల్‌పామ్ సాగుపై అవగాహన పెంచుతూ వస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో 2,057 ఎకరాల్లో సాగు చేస్తుండగా, ఈ ఏడాది మరో వెయ్యి ఎకరాల్లో సాగు చేసేలా లక్ష్యం పెట్టుకున్నారు. 2021-22లో 510ఎకరాల్లో సాగు మొదలైంది. జిల్లాలో ఆయిల్‌పామ్ సాగుకు కొన్ని ప్రాంతాల్లో అనువైన భూములు ఉండటం, అధికారులు సైతం రైతుల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టడం మూలంగా సాగు ఏటేటా పెరుగుతూ వస్తోంది. జిల్లాలో మొదటిసారి సాగుచేసిన పంట కూడా చేతికొస్తుం డటం వల్ల రైతులు ఆయిల్‌పామ్ సాగు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా సాగుకు వివిధ రకాల రాయితీలు ఇస్తుండటం వల్ల రైతుల్లో ఆసక్తి పెరుగుతోంది.
వరికి ప్రత్యామ్నాయంగా...:
జిల్లాలో వరి, పత్తి ఇతర పంటల సాగుకు ఖర్చు పెరగడం, తీరా దిగుబడి వచ్చాక కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం పోస్తే నేటికీ కాంటాలు కాకపోవడం, అకాల వర్షాలతో పంట నీటి పాలవుతుందనే ఆవేదనలో రైతులు ఉన్నారు. ఈ క్రమంలో పెట్టుబడి తక్కువగా ఉండటంతో పాటు చీడ పీడల బాధలు లేని, సులభతరహ సాగు ఉన్న ఆయిల్‌పామ్ సాగుకు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కొన్నేళ్లుగా ఆయిల్‌పామ్ సాగు చేయాలని ఉద్యానవన శాఖ అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వాలు రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాయి. దీంతో ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు ఆసక్తి చూపే రైతులు ఏటా పెరుగుతున్నారు. 2022లో సాగు ప్రారంభించిన పంటలు గతేడాది నుంచి కోత దశలో ఉన్నాయి. అది కాకుండా అధికారులు కూడా వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగు చేయాలని అవగాహన కల్పిస్తున్న తరుణంలో రైతులు మొగ్గుచూపుతున్నారు. జిల్లాలో దహెగాం, కాగజ్‌నగర్, పెంచికలపేట, రెబ్బెన మండలాల్లో అత్యధికంగా ఆయిల్‌పామ్ సాగు చేస్తున్నట్లు ఉద్యానవన శాఖ అధికారులు చెబుతున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రాయితీలు....:
ఆయిల్‌పామ్ సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు రాయితీలు అందిస్తున్నాయి. మొక్కల పెంపకం, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలను సన్న చిన్నకారు రైతుల్లో ఎస్సీ, ఎస్టీలకు 90శాతం, బీసీలకు 80శాతం, ఇతరులకు 70శాతం సబ్సిడీతో ఉద్యానవనశాఖ అందజేస్తోంది. ఎకరానికి రూ.15వేల చొప్పున ప్రోత్సాహకంగా అందిస్తున్నారు. 365రోజులు నీటి లభ్యత గల రైతులను రాయితీలతో ప్రోత్సహిస్తోంది. ఆయిల్‌పామ్ సాగు పంట చేతికొస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం టన్ను ధర 23,150గా నిర్ణయించింది. దీంతో పంట సాగు చేసిన రైతులకు మంచి ఆదాయంతో పాటు ఇతర రాయితీలు ఇస్తుండటంతో రైతులు ఎక్కువగా సాగుకు మొగ్గు చూపుతున్నట్లు అధికారులు భావిస్తున్నారు. అంతే కాకుండా రైతులు పంట సాగు చేసేందుకు ఎకరాకు రూ.4,200రాయితీని నాలుగేళ్ల పాటు ఇస్తోంది. ఆయిల్‌పామ్ ఒక మొక్క ధర రూ.193ఉండగా, రైతు కేవలం రూ.20చెల్లిస్తే సరిపోతుంది. మిగితా వాటా కూడా ప్రభుత్వమే నేరుగా రైతులకు అందజేస్తోంది.
అంతర పంటలుగా కూరగాయల సాగు...
ఆయిల్‌పామ్ మొక్కలు నాటిన మూడేళ్ల వరకు ఎలాంటి దిగుబడి రాదు. దీంతో రైతులు చెట్ల మధ్యలో ఉన్న ఖాళీ స్థలాల్లో అంతర పంటలను సాగు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. దీంట్లో భాగంగా కూరగాయల సాగులో బెండ, కాకర, టమాట, బీర, వంకాయతో పాటు ఇతర కూరగాయలు సాగు చేసుకోవడానికి వీలుంటుదని ఉద్యానవనశాఖ అధికారులు చెబుతున్నారు. పంట నాటిన నాలుగేళ్ల వరకు ఇతర అంతర పంటలతో ఆదాయం పొందే అవకాశం కూడా ఉంటుండటంతో ఆయిల్‌పామ్ సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు.
గత ఐదేళ్లలో సాగు వివరాలు..
2021-22లో 510ఎకరాలు
2022-23లో 429ఎకరాలు
2023-24లో 379ఎకరాలు
2024-25లో 329ఎకరాలు
2025-26లో 410ఎకరాలు
==================
మొత్తం 2,057 ఎకరాలు
====================
ఆయిల్‌పామ్ వైపు మొగ్గు చూపాలి...:
- అబ్దుల్ నదీం, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి
రైతులు సుస్థిరమైన ఆదాయం కోసం ఆయిల్‌పామ్ సాగు వైపు మొగ్గు చూపాలి. వరి, పత్తి పంటల సాగుకు అధికంగా పెట్టుబడి అవుతుంది. పంట చేతికొచ్చే సమయంలో అనేక కష్టాలు పడే అవకాశం ఉంటుంది. ఆయిల్‌పామ్ సాగుతో మూడేళ్లు కష్టపడితే 30ఏళ్ల వరకు నికరంగా ఏడాదికి రూ.3లక్షలకుపైగా ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. సాగుకు ప్రభుత్వం కూడా పలు రాయితీలు ఇస్తోంది. వంట నూనెల ధరలు పెరగడంతో వీటికి డిమాండ్ ఏర్పడింది. రైతులు ఇందుకోసం అధికంగా ఆయిల్‌పామ్ వైపు మొగ్గుచూపి అధిక లాభాలు గడించాలి.