Share News

ఆర్థిక సంక్షోభంలో ఉన్నా సంక్షేమ పథకాల అమలు

ABN , Publish Date - Apr 15 , 2026 | 11:15 PM

రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున సీఎం రేవంత్‌రెడ్డి నిధులను కేటాయిస్తున్నారని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి తెలిపారు.

ఆర్థిక సంక్షోభంలో ఉన్నా సంక్షేమ పథకాల అమలు
అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌లో పరికరాలను పరిశీలిస్తున్న మంత్రి వివేక్‌వెంకటస్వామి

- మంత్రి వివేక్‌వెంకటస్వామి

మందమర్రిటౌన్‌, ఏప్రిల్‌ 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున సీఎం రేవంత్‌రెడ్డి నిధులను కేటాయిస్తున్నారని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి తెలిపారు. బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో 125 మంది లబ్ధిదారులకు కోటి 25లక్షల14వేల500 రూపాయల కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌ చెక్కులను పంపిణీ చేశారు. మంత్రి మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో రాష్ట్రం కోలుకోలేని విధంగా దెబ్బతిందన్నారు. రాష్ట్ర అభివృద్ధిని ఓర్చుకోలేని బీఆర్‌ఎస్‌ అసత్య ఆరోపణలు చేస్తుందన్నారు. చెన్నూరు నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నానని, అన్ని మండలాలు, పట్టణాల సమగ్ర అభివృద్ధికి రూ. 600 కోట్లతో పనులు జరుగుతున్నాయన్నారు. మందమర్రి, క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో తాగునీటిని అందించేందుకు అమృత్‌ పథకం పనులను రూ. 30 కోట్లతో చేపడుతున్నామన్నారు. నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వెంటనే స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సతీష్‌కుమార్‌, కాంగ్రెస్‌ నాయకులు బండి సదానందం యాదవ్‌, మంద తిరుమల్‌, గుడ్ల రమేష్‌, రాచర్ల గణేష్‌, పైడిమల్ల నర్సింగ్‌ పాల్గొన్నారు.

ఏటీసీల ద్వారా ఉపాధి అవకాశాలు

అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్ల(ఏటీసీ) ద్వారా ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయని రాష్ట్ర కార్మిక, గనుల, ఉపాధి కల్పన శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి తెలిపారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌తో కలిసి స్థానిక అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ను బుధవారం సందర్శించారు. బోధన తీరు గురించి అధ్యాపకులను అడిగి తెలుసుకున్నారు. ఏటీసీలోని పరికరాలను పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ ఏటీసీ సెంటర్లలో శిక్షణ పూర్తి చేసిన తర్వాత మంచి పరిశ్రమల్లో ఉద్యోగాలు సాధించవచ్చన్నారు. మందమర్రిలో రూ. 40 కోట్లతో ఏర్పాటు చేసిన ఏటీసీ సెంటర్‌లో విద్యార్థులు పెద్ద సంఖ్యలో చేరి కోర్సులు చదువుతున్నారని తెలిపారు. విదేశాల్లో కూడా ఈ కోర్సులకు మంచి డిమాండ్‌ ఉందన్నారు. బోధకులు విద్యార్థులకు అర్ధమయ్యేలా బోధించాలని, వారిని నిష్ణాతులను చేయాలన్నారు. చెన్నూరులో కూడా ఏటీసీ సెంటర్‌కు శంకుస్ధాపన చేశానని తెలిపారు. వృత్తి నైపుణ్యత సాధిస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్‌ ఉంటుందన్నారు. తమ ప్రభుత్వం నిరుద్యోగ నిర్మూలనకు కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్‌ దేవానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 15 , 2026 | 11:15 PM