ఆగని అక్రమ నిర్మాణాలు
ABN , Publish Date - Feb 20 , 2026 | 11:50 PM
మంచిర్యాల జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాలకు అడ్డూ, అదుపులేకుండా పోతోంది. ఓ వైపు మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలపై కొరఢా ఝళిపిస్తుండగా, మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తుండటం గమనార్హం.
-నాలాలపై యథేచ్ఛగా వెలుస్తున్న కట్టడాలు
- జిల్లా కేంద్రంలో నిబంధనలు బేఖాతర్
- బహుళ అంతస్థుల భవన యాజమాన్యాల ఇష్టారాజ్యం
- నిబంధనలు విస్మరిస్తున్నా పట్టించుకోని మున్సిపల్ అధికారులు
మంచిర్యాల, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాలకు అడ్డూ, అదుపులేకుండా పోతోంది. ఓ వైపు మున్సిపల్ అధికారులు అక్రమ కట్టడాలపై కొరఢా ఝళిపిస్తుండగా, మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తుండటం గమనార్హం. ముఖ్యంగా నాలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టడం రోజురోజుకూ తీవ్రతరం అవుతోంది. అయినప్పటికీ మునిసిపల్ అధికారులు నోరు మెదకపోవడం అనుమానాలకు తావిస్తోంది. మొన్నటి వరకు మునిసిపల్ ఎన్నికలు ఉండగా, అధికారులంతా ఆ పనుల్లో నిమగ్నమయ్యారు. దీన్ని అదునుగా తీసుకున్న పలువురు గుట్టుచప్పుడు కాకుండా నాళాలపై శాశ్వతంగా స్లాబులు నిర్మించి, ఆక్రమించారు. అక్రమ నిర్మాణాలు అని తెలిసి కూడా బహుళ అంతస్తుల భవనాల యజమానులు నిర్మాణ సమయంలో నిబంధనలకు పూర్తి విరుద్ధంగా వ్యవహిరిస్తుండటం గమనార్హం.
నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు...
జిల్లా కేంద్రంలో నిబంధనలను తుంగలో తొక్కుతూ పలువురు ఇష్టారీతిన నిర్మాణాలు చేపడుతున్నారు. మునిసిపల్ అనుమతులకు మించి నిర్మాణాలు చేపడుతూ నిబంధనలను గాలికి వదిలివేస్తున్నారు. రహదారులను ఆనుకొని నిర్మిస్తున్న బహుళ అంతస్థుల భవనాలకు సెట్ బ్యాక్ ఏర్పాట్లు ఉండటం లేదు. పూర్తిగా రోడ్లను ఆనుకొని నిర్మిస్తున్నా అడిగేవారు లేరు. రోడ్లను ఆనుకొని నిర్మిస్తుండటంతో భవిష్యత్తులో రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన పక్షంలో ఇబ్బందులు ఎదుర య్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే సెల్లార్ పార్కింగ్ కోసం వదిలి పెట్టాలనే నిబంధన ఉన్నప్పటికీ 90 శాతం భవనాలు ఆ ఏర్పాట్లు లేకుండానే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. కనీసం నూతనంగా చేపట్టే భవనాల్లోనూ పార్కింగ్ కోసం సెల్లార్ వదిలి పెట్టకపోవడం గమనార్హం. పైగా కొన్ని భవనాల యజమానులు సెల్లార్ల కోసం వదిలివేసిన స్థలాలను కమర్షియల్‌కు వినియోగిస్తున్నారు. పార్కింగ్ స్థలాలను కిరాయిలకు ఇస్తూ నెలవారీ అద్దె వేల రూపాయల్లో వసూలు చేస్తున్నారు. అయినా మునిసిపల్ అధికారులు చూసీ చూడనట్లు వ్యవహిస్తుండటం అనుమానాలకు దారి తీస్తోంది. అధికారుల ప్రోత్సాహంతోనే అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి.
నాలాలపై అడ్డగోలుగా నిర్మాణాలు....
అక్రమ నిర్మాణాలు నాలాలపై సైతం వెలుస్తున్నాయి. పట్టణంలోని ప్రధాన రహదారుల పక్కన పెద్దపెద్ద నాలాలను నిర్మించారు. వర్షాకాలంలో వరద పోటు సమస్య తలెత్తకుండా ఈ చర్యలు తీసుకున్నారు. ముఖ్యంగా ఏసీసీ చౌరస్తా నుంచి ఐబీ చౌరస్తా వరకు, మార్కెట్ రోడ్డులో, బైపాస్ రోడ్డులో, ప్రభుత్వ ఐటీఐ కళాశాల సమీపంలో, హమాలివాడ, గౌతమీనగర్, పాత మంచిర్యాలలో ప్రధాన రహదారుల వెంట విశాలమైన నాలాలు దర్శనమిస్తున్నాయి. అయితే వాటిపై అక్రమ నిర్మాణాలు చేపడుతూ కొందరు కబ్జాలకు పాల్పడుతున్నారు. దీంతో నాలాలు ఇరుకుగా మారి వరదల సమయంలో వర్షం నీరంతా రోడ్లపైకి చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 2022 జూలైలో కురిసిన అతిభారీ వర్షాల కారణంగా నాలాల్లో నీరు పట్టక రోడ్లపై ప్రవహించింది. దీంతో సమీపంలోని ఇళ్లలోకి వరదనీరు చేరింది. రెండేళ్ల క్రితం మంచిర్యాల-బెల్లంపల్లి జాతీయ రహదారి పక్కన ఉన్న విశాలమైన నాలాలో బజాజ్ షోరూం సమీపంలో కొందరు బడా వ్యాపారులు పెద్ద గుంతలు తీసి, ఏకంగా పిల్లర్ల నిర్మాణం చేపట్టారు. నాలాపై స్లాబు నిర్మించడం ద్వారా రహదారి నుంచి భవనం వరకు అక్రమంగా రోడ్డు నిర్మించేందుకు యత్నించారు. అప్పట్లో ‘ఆంధ్రజ్యోతి’లో కథనం ప్రచురితం కావడంతో మున్సిపల్ అధికారులు పిల్లర్లను తొలగించారు. వాస్తవానికి నాలాలపై శాశ్వత కట్టడాలు నిర్మించవద్దనే నిబంధనలు ఉన్నాయి. నాలాను దాటేందుకు తాత్కాలికంగా ఇతరత్రా ఏర్పాట్లు చేసుకోవాలి. ఇదిలా ఉండగా, ఇటీవల బైపాస్ రోడ్డులోని తెలంగాణ తల్లి విగ్రహం సమీపంలో నిర్మాణంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవన యజమాని నిబంధనలకు విరుద్ధంగా నాలాపై శాశ్వతంగా కాంక్రీటు స్లాబు నిర్మించాడు. బైపాస్ రోడ్డు మొదలుకొని భవనం వరకు సుమారు ఆరు ఫీట్ల పొడవు, 12 ఫీట్ల వెడల్పుతో శాశ్వతంగా స్లాబు నిర్మించాడు. ఈ తతంగమంతా బహిరంగానే జరుగుతున్నా అధికారుల ధృష్టికి రాకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది.