Share News

వాగులు దాటేదెలా?

ABN , Publish Date - May 27 , 2026 | 11:28 PM

అడవుల జిల్లా కుమరంభీం ఆసిఫాబాద్‌లో వాగులు, ఒర్రెలు అనేకం ఉన్నాయి. దాదాపు గ్రామాలన్నీ వీటిని అనుకునో లేక వీటి అవతలి వైపో ఉన్నాయి.

వాగులు దాటేదెలా?

- ముంచుకొస్తున్న వానాకాలం

- ఇంకా పూర్తికాని ప్రధాన వంతెనలు

- దశాబ్దాలు గడుస్తున్నా అసంపూర్తిగానే

- ఈ ఏడాది కూడా గ్రామాల ప్రజలకు తప్పని తిప్పలు

ఆసిఫాబాద్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): అడవుల జిల్లా కుమరంభీం ఆసిఫాబాద్‌లో వాగులు, ఒర్రెలు అనేకం ఉన్నాయి. దాదాపు గ్రామాలన్నీ వీటిని అనుకునో లేక వీటి అవతలి వైపో ఉన్నాయి. చిన్నపాటి వానలకే వీటిల్లో నీరు నిలుస్తుండగా వానాకాలంలో కురిసే భారీ వర్షాలకు వచ్చే వరదలతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోతాయి. అంతంత మాత్రమే రహదారి సౌకర్యం కలిగిన గ్రామాల ప్రజలు వంతెనలు లేక తీవ్ర ఇబ్బం దులు ఎదుర్కొంటున్నారు. ఏళ్లుగా వంతెన నిర్మాణ పనులు సాగుతూ.. ముందుకు కదలటంలేదు. వానాకాలం ముంచుకొస్తున్న తరుణంలో ఈ ఏడాది కూడా గ్రామాల ప్రజలకు తిప్పలు తప్పేలా లేవు. అధికారుల, నాయకుల చిన్నచూపుతో నిధులు మంజూరుకాక వంతెనలు పూర్తికాకపోవడంతో జిల్లాలోని అయా గ్రామాల ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గతంలో జిల్లాలో పర్యటించిన మంత్రి సీతక్క ఆసిఫాబాద్‌ మండలంలోని గుండి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమానికి వాగుదాటి రావాల్సి వచ్చింది. జిల్లాలో అసంపూర్తిగా ఉన్న వంతెనల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేయాలని ప్రజలు కోరుతున్నారు.

వంతెనలు లేక అవస్థలు....

ఆసిఫాబాద్‌ జిల్లా ఏజెన్సీలో ప్రతి ఏటా వర్షాకాలం వచ్చిందంటే ప్రజలకు ప్రత్యక్ష నరకమే. గూడాల నుంచి ప్రధాన పట్టణాలకు రావాలంటే భగీరథ ప్రయత్నం చేయాల్సిందే. జిల్లాలోని 335పైగా ఆవాసాలకు నేటికీ అసలు రహదారి సౌకర్యమే లేదంటే ఉన్న గ్రామాలకు వాగులు, వంకల రూపంలో వర్షాకాలమంతా అష్టదిగ్బంధనమే. ఇటు ఆసిఫాబాద్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని అయిదు ఏజెన్సీ మండలాలతో పాటు కాగజ్‌నగర్‌ డివిజన్‌లోని బెజ్జూరు, చింతలమానేపల్లి, దహెగాం, పెంచికలపేట, కాగజ్‌నగర్‌ వరకు అన్నిమండలాల్లో ప్రజలు ఒకేరకమైన ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ ప్రాంతంలో చిన్నచిన్న వాగులు మొదలుకుని ఎర్రవాగు, పెద్దవాగు, ప్రాణహిత పరివాహక ప్రాంతంలోని వంకలపై నేటికి వంతెనలు లేకపోవడంతో ప్రజానీకం బయట ప్రపంచానికి చేరుకునేందుకు నానా తంటాలు పడాల్సి వస్తుంది. జిల్లాలో ఇలా చిన్నా చితక కల్వర్టు మొదలుకుని భారీ వంతెనల వరకు ఏవీ పూర్తి కాకపోవడంతో ఏటా ప్రజానీకానికి ఇక్కట్లు పడుతున్నారు. పనులను వేగిరం చేయాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంతో ప్రతి వర్షాకాలంలో ఈ సమస్యలు తప్పడం లేదని వివిధ మండలాలకు చెందిన ప్రజలు చెబుతున్నారు. దాంతో అత్యవసర సమయాల్లో ఆసుపత్రులకు వెళ్లడానికి కూడా ఇబ్బందులు పడాల్సిన దుస్థితి జిల్లాలో నెలకొని ఉంది. ప్రధాన వంతెనల నిర్మాణ పనులు ఇంకా పూర్తికాకపోవడంతో ఆయాగ్రామాల ప్రజలు తిప్పలు పడాల్సివస్తున్నది.

ఏళ్లుగా కొనసా...గుతున్న నిర్మాణాలు..

గ్రామాలకు రవాణా కష్టం తీర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి పూర్తిస్థాయిలో చేరడం లేదు. మారుమూల గ్రామాల ప్రజలు ఇప్పటికీ కష్టాలు పడుతున్నారు. కాలంతో కుస్తీ పడుతూ సమస్యల సుడి గుండంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాల్లో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు దశాబ్దలుగా కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసిఫాబాద్‌ మండలంలోని పెద్దవాగుపై గుండి వంతెన నిర్మాణ పనులు దశాబ్దన్నర కాలంపాటు కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుండి గ్రామానికి వర్షాకాలంలో వెళ్లడానికి ప్రజలు అవస్థలు పడుతున్నా రు. కెరమెరి మండలంలోని అనార్‌పల్లి-కరంజివాడ, లక్మాపూర్‌ వంతెనల నిర్మాణ పనులు అసంపూర్తిగానే ఉన్నాయి. కాగజ్‌నగర్‌-వాంకిడి మండలాల మధ్య కనర్‌గాం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు 15 సంవత్సరాలు గడుస్తున్నా నేటికి అసంపూర్తిగానే ఉంది. తిర్యాణి మండలంలోని నాయకపుగూడ గ్రామం నుంచి దుగ్గపూర్‌ గ్రామానికి వెళ్లేందుకు మధ్యలో ఉన్న వంతెన నిర్మాణ పనులు అసంపూర్తిగా ఉండటంతో ఆయా గ్రామాల ప్రజలకు యేటా వర్షకాలంలో అవస్థలు పడాల్సివస్తోంది. దీంతో అయా గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.

వంతెన నిర్మాణ పనులు పూర్తిచేయాలి..

- జాబిరే రవిందర్‌, సర్పంచ్‌, గుండి

గుండి పెద్దవాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు 15 ఏళ్లుగా కొనసాగుతునే ఉన్నాయి. దీంతో ప్రతి ఏటా వర్షాకాలంలో గుండి ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షకాలంలో జిల్లా కేంద్రానికి రావాలంటే వాంకిడి మండలం ఖమాన మీదుగా రావాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు దృష్టిసారించి వంతెన నిర్మాణ పనులను వెంటనే పూర్తి చేయాలి.

Updated Date - May 27 , 2026 | 11:28 PM