Share News

దాహం తీరేదెలా?

ABN , Publish Date - May 19 , 2026 | 12:27 AM

ఎండలు మండిపోతున్నాయి. చెరువులు, వాగుల్లో నీరు ఇంకిపోతున్నాయి. గ్రామాల్లో పశుగ్రాసం, నీరు దొరకక మూగజీవాలు దాహంతో అలమటిస్తున్నాయి.

దాహం తీరేదెలా?

- రూ. లక్షల వ్యయంతో నీటి తొట్టెల నిర్మాణం

- నీరులేక నిరుపయోగం

- దాహంతో అల్లాడుతున్న మూగజీవాలు

వాంకిడి, మే 18 (ఆంధ్రజ్యోతి): ఎండలు మండిపోతున్నాయి. చెరువులు, వాగుల్లో నీరు ఇంకిపోతున్నాయి. గ్రామాల్లో పశుగ్రాసం, నీరు దొరకక మూగజీవాలు దాహంతో అలమటిస్తున్నాయి. ప్రభుత్వం పశువుల దాహార్తి తీర్చడానికి ఏర్పాటు చేసిన నీటి తొట్టెలు అధికారుల అవగాహన లేమితో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. అవసరంలేని ప్రదేశాలు, నీటివసతి లేని స్థలాల్లో నిర్మాణాలు చేపట్టడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన నీటితొట్టెలు నాసిరకంగా ఉండడంతో ఏళ్లు గడవకముందే పగుళ్లు తేలి ప్రజాధనం మట్టిపాలవుతోంది. గ్రామాల్లో ఉన్న బోర్ల ద్వారా నీటిసరఫరా చేయాల్సిన పంచాయతీ అధికారు లు తమకేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఆశయం నీరుగారిపోతోంది.

- ఉపాధిహామీ పథకంలో నిర్మాణాలు

జిల్లాలోని 15 మండలాల్లో దాదాపు ఎనిమిది లక్షలకు పైగా మూగజీవాలు ఉన్నాయి. వేసవి కాలంలో గ్రామాల సమీపంలోని వాగులు, ఒర్రెలు, చెరువులు ఎడారులుగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో వాటి దాహార్తి తీర్చేందుకు 2013లో జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో ఒక్కోదానికి 14,000 రూపాయలు వెచ్చించింది. జిల్లావ్యాప్తంగా 428 నీటి తొట్టెలు నిర్మించారు. వీటి నిర్వహణ బాధ్యతలను గ్రామపంచాయతీలకు అప్పగించారు. కొన్నిచోట్ల వినియోగంలో లేక శిథిలావస్థకు చేరుకోగా మరికొన్ని చోట్ల ఒక్కరోజు కూడా వీటిలో నీరు నిల్వచేసిన దాఖలాలు లేవు. దీంతో మూగజీవాల దాహం తీరక లక్షలాది రూపాయల ప్రజాధనం వృథా అయ్యాయి. జిల్లావ్యాప్తంగా నీటితొట్టెలు నిరుపయోగంగా ఉండడంతో ఇంటి పరిసర ప్రాంతాల్లో, అక్కడక్కడ నిల్వ ఉన్న మురుగునీటితో మూగజీవాలు దాహార్తి తీర్చుకుంటున్నాయి.

- ఉపయోగంలోకి తీసుకురావాలి

అజయ్‌కుమార్‌, మాజీ జడ్పీటీసీ, వాంకిడి

మూగజీవాల దాహార్తిని తీర్చేందుకు జాతీయ ఉపాధిహామీ పథకంలో నిర్మించిన నీటి తొట్టెలను అధికారులు ఉపయోగంలోకి తీసుకురావాలి. వేసవిలో చెరువులు, కాలువలు, వాగుల్లో నీరు ఇంకిపోయి పశువులకు దాహార్తి తీరేందుకు ఇబ్బందికరంగా ఉంది. ప్రభుత్వం నిర్మించిన నీటి తొట్టెలు నిరుపయోగంగా ఉండడంతో ఇంటి సమీపంలో నిల్వ ఉన్న మురుగునీటిని మూగజీవాలు తాగుతున్నాయి. అధికారులు నీటి తొట్టెలను ఉపయోగంలోకి తీసుకువచ్చి కొత్త నీటి తొట్టెలను నిర్మించి పశువుల దాహార్తిని తీరే ్చందుకు చర్యలు తీసుకోవాలి.

- మండలాల వారీగా నిర్మించిన నీటి తొట్టెలు

ఆసిఫాబాద్‌---------------11

వాంకిడి ---------------08

బె జ్జూరు ----------------06

జైనూరు ----------------55

చింతలమానెపల్లి------------01

దహెగాం----------------74

తిర్యాణి-----------------28

సిర్పూర్‌(టి)---------------06

సిర్పూర్‌(యు)--------------41

రెబ్బెన ------------------14

లింగాపూర్‌ ---------------15

కౌటాల -----------------10

కెరమెరి -----------------78

కాగజ్‌నగర్‌ ---------------81

Updated Date - May 19 , 2026 | 12:27 AM