Share News

పల్లెల్లో అభివృద్ధిపై ఆశలు

ABN , Publish Date - Mar 08 , 2026 | 11:40 PM

రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు రెండేళ్లుగా ఆలస్యం కావడం, ప్రత్యేకాధికారుల పాలనలో పల్లెలు అభివృద్ధికి నోచుకోలేదు.

పల్లెల్లో అభివృద్ధిపై ఆశలు

- జిల్లాలో 335 జీపీల్లో రూ. 16.17 కోట్లు విడుదల

- అభివృద్ధిపై శ్రద్ధ పెడితే పల్లెలు పరిశుభ్రత వైపు..

- గ్రామపంచాయతీ పాలక వర్గాలపైనే ఆశలు..

చింతలమానేపల్లి, మార్చి 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు రెండేళ్లుగా ఆలస్యం కావడం, ప్రత్యేకాధికారుల పాలనలో పల్లెలు అభివృద్ధికి నోచుకోలేదు. గత ఏడాది డిసెంబరులో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. గ్రామాల్లో కొత్త సర్పంచ్‌లు ఎన్నికవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు విడుతల వారీగా వస్తున్నాయి. దీంతో గ్రామాల అభివృద్ధిపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలోని 15 మండలాల పరిధిలో ఉన్న 335 గ్రామ పంచాయతీలకు 16.17 కోట్ల మేర ప్రభుత్వం జమ చేసింది.

- ప్రత్యేకాధికారుల పాలనలో..

రెండేళ్లుగా సర్పంచ్‌ల ఎన్నికల కంటే ముందు గ్రామ పంచాయతీలు ప్రత్యేకాధికారుల పాలనలో ఉండడంతో నిధులు విడుదల కాలేదు. దీంతో పల్లెల్లో ఆశించిన స్థాయిలో ఎలాంటి వృద్ధికి నోచుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రకృతి వనాల్లో మొక్కలు నీళ్లు పోసే వారు లేక మొక్కలు మోడువారాయి. ట్రాక్టర్ల నెలవారీ వాయిదాలు, కరెంట్‌ బిల్లుల భారం, డంపింగ్‌ యార్డుల నిర్వహణ లేకపోవడం, గ్రామాల్లో పారిశుధ్యం, పరిశుభ్రత లేకపోవడంతో గ్రామాలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. కనీస అవసరాలైన తాగునీరు, రోడ్లు, మురుగుకాలువల శుద్ధి వంటి పనులు సైతం చేయకపోవడంతో గ్రామాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో సర్పంచ్‌లు ఎన్నికై మూడు నెలలు కావస్తోంది. కానీ మురికి కాలువలు, మరుగుదొడ్ల నిర్మాణాలు, చెత్తాచెదారం తొలగించడం వంటి తదితర కార్యక్రమాలపై సర్పంచ్‌లు ఇప్పటికీ దృష్టిపెట్టలేక పోతున్నారన్న విమర్శలు ఉన్నాయి. దీంతో గ్రామాల్లో అపరిశుభ్ర వాతావరణం రాజ్యం ఏలుతోంది.

- నిధుల మంజూరుతోనైనా..

ప్రస్తుతం ఆర్థిక సంఘం నిధులు జిల్లాకు రూ. 16.17 కోట్ల మేర సమకూరాయి. ఏడాదికి రెండు విడతలుగా మంజూరయ్యే నిధులు ఎన్నికలు పూర్తవడంతో ఏకమొత్తంలో విడుదల చేశారు. దీంతో గ్రామాల్లో అభివృద్ధి పనులపై శ్రద్ధ చూపాలని గ్రామాలను అభివృద్ధి వైపు నడిపించాలని ప్రజలు కోరుతున్నారు. కానీ గత రెండేళ్లలో ప్రత్యేకాధికారుల పాలనలో పల్లెలు ఉండడంతో చాలా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులే గ్రామానికి కనీస అవసరాలైన స్ట్రీట్‌ లైట్ల ఏర్పాటు, ట్రాక్టర్ల డీజిల్‌, తాగునీటి బోర్‌ల రిపేర్‌ వంటి పనులు చేపట్టారు. గత సర్పంచ్‌లు సైతం వివిధ పనులు చేపట్టి ఇప్పటికీ బిల్లులు కొందరికి పూర్తిస్థాయిలో రాలేదు. దీంతో వచ్చిన నిధులు పాత సర్పంచ్‌లు కావాలని పట్టుబడుతు న్నారు. గత రెండేళ్లలో అభివృద్ధి కార్యక్రమాలకు ఉపయోగించిన సొమ్మును తాము తీసుకుంటామని పంచాయతీ కార్యదర్శులు కొత్త పాలక వర్గాలపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. దీంతో గ్రామాలకు వచ్చిన నిధులన్నీ పాత పనులకే సరిపోతే అభివృద్ధి ఎలా సాధ్యమన్న చర్చ జరుగుతోంది. చాలా గ్రామాల్లో పాత కొత్త సర్పంచ్‌ల మధ్య నిధుల విషయంలో వాగ్వాదం జరుగుతున్నట్లు చెబుతున్నారు.

- గ్రామాలకు ఆదాయం ఇలా..

పల్లెలకు నాలుగు విధాలుగా ఆదాయం సమకూరే అవకాశం ఉంది. వినియోగించు కుంటే గ్రామాలను అభివృద్ధి వైపు కొనసాగించవచ్చు. పంచాయతీలు సొంతంగా ఆదాయం ఏర్పాటు చేసుకునే అవకాశం ఉన్నా సర్పంచులు పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. రాష్ట్రప్రభుత్వం కేటాయింపులు, ఆర్థిక సంఘం కింద విడుదలయ్యే నిధులు, విరాళాలు, డిపాజిట్ల ద్వారా ఆదాయం సమకూరుతోంది. కానీ పంచాయతీలు రాష్ట్రం, కేంద్రం ద్వారా వచ్చే నిధులపై ఆధారపడుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులతో పాటు స్టాంపు డ్యూటీ, ఇంటి, వృత్తి పన్నులు, వినోదపు పన్నులు, సీనరేజి ఫీజు, నీటి తీరువా, తదితర నిధులు మంజూరవుతుంటాయి. కేంద్ర ప్రభుత్వ నుంచి ఆర్థిక సంఘం నిధులతో పాటు ఉపాధి హామీ నిధులు వస్తాయి. ఈ పథకం కింద గ్రామాల్లో పలు అభివృద్ధి పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. పంచాయతీల ఆదాయంపై సర్పంచ్‌లు, సంబంధిత అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని పలువురు చెబుతున్నారు.

Updated Date - Mar 08 , 2026 | 11:40 PM