లెటర్ పట్టు...పోస్టింగ్ కొట్టు..
ABN , Publish Date - May 24 , 2026 | 11:23 PM
గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో భారీగా పైరవీలకు తెరలేచింది. ప్రజాప్రతినిధుల పైరవీ ఉంటేనే అనుకూలమైన చోట పోస్టింగ్ లభిస్తుందనే ఉద్దేశంతో పంచాయతీ కార్యదర్శులు అనేక మంది రెకమండేషన్ కోసం తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు.
-పంచాయతీ కార్యదర్శి బదిలీల్లో భారీగా పైరవీలు?
-రెకమండేషన్ ఉంటేనే అనుకూలమైన చోట పోస్టింగ్
-ఎమ్మెల్యేలు, మంత్రుల చుట్టూ ఆశావహుల ప్రదక్షిణలు
-70 శాతం మేర పోస్టింగుల్లో పైరవీలకు ఛాన్స్
మంచిర్యాల, మే 24 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో భారీగా పైరవీలకు తెరలేచింది. ప్రజాప్రతినిధుల పైరవీ ఉంటేనే అనుకూలమైన చోట పోస్టింగ్ లభిస్తుందనే ఉద్దేశంతో పంచాయతీ కార్యదర్శులు అనేక మంది రెకమండేషన్ కోసం తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ కార్యదర్శుల బదిలీల ప్రక్రియకు సంబంధించి ఇటీవల ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 25న బదిలీల ప్రక్రియ జరుగనుండటంతో జిల్లావ్యాప్తంగా మంచి పోస్టింగ్ కోసం పెద్దఎత్తున పైరవీలకు తెరతీయగా, జిల్లాలో హాట్‌టాపిక్‌గా మారింది. దీన్ని ఊటంకిస్తూ పంచాయతీ కార్యదర్శుల బదిలీ ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని కోరుతూ పంచాయతీ కార్యదర్శుల సంఘం ఆధ్వర్యంలో ఇటీవల జిల్లా పంచాయతీ అధికారికి వినతిపత్రం సమర్పించడమే పైరవీలకు తెరలేచిందన్న ప్రచారానికి నిదర్శనంగా నిలుస్తోంది.
- 97 మందికి బదిలీ అవకాశం...
జిల్లాలో మొత్తం 308 గ్రామపంచాయతీలు ఉండగా, 300 మంది పంచాయతీ కార్యదర్శులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రతీజిల్లాలో 40 శాతం మేర పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గత నెల 21వ తేదీన జీవో నంబర్ 38 ప్రకారం మార్గదర్శకాలు జారీ చేసింది. జిల్లాకు సంబంధించి 300 మంది పంచాయతీ కార్యదర్శులకు గాను 97 మందికి బదిలీకి అవకాశం కల్పిస్తోంది. ఇందుకు గాను ప్రభుత్వం జారీ చేసిన జీవో 38 ప్రకారం కొన్ని నియమనిబంధనలు విధించింది. ఇందులో భాగంగా నాలుగు సంవత్సరాలు తప్పనిసరిగా ఒకే చోట పనిచేస్తున్న వారు ఈ బదిలీలకు అర్హులు. ఇందులో భాగంగా గ్రేడ్ -4 విభాగం కింద పనిచేస్తున్న వారు 88 మందికి బదిలీ జరుగనుండగా, వారంతా జిల్లా పరిధిలో మరో చోటుకు వెళ్లనున్నారు. గ్రేడ్-3 కింద ఏడుగురు, గ్రేడ్-2 విభాగంలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులకు బదిలీ అవకాశం కలుగనుంది. గ్రేడ్-1,2,3 విభాగంలో పనిచేస్తున్న వారికి జోనల్ పరిధిలో అంతర్‌జిల్లా బదిలీలకు అవకాశం కల్పించింది. 1,2,3గ్రేడ్‌ల పరిధిలోకి వచ్చే వారు కోరుకుంటే ఇతర జిల్లాలకు బదిలీలకు అవకాశం ఉంది. అయితే వారు కోరుకునే చోట పోస్ట్ ఖాళీగా ఉంటేనే బదిలీ సాధ్యపడుతుంది. వారికి నేరుగా రాష్ట్ర పంచాయతీ కమిషనర్ నుంచి బదిలీ ఆర్డర్ రిలీజ్ అవుతుండగా, జిల్లా కలెక్టర్ గ్రామపంచాయతీలను కేటాయిస్తారు.
- నిబంధనలు అమలయ్యేనా...?
గ్రామపంచాయతీ కార్యదర్శుల బదిలీలకు సంబంధించి ఈ నెల 25న కలెక్టర్ కార్యాలయంలో మధ్యాహ్నం మూడు గంటల నుంచి కౌన్సెలింగ్ ఏర్పాటు చేసి బదిలీ ప్రక్రియ చేపడతారు. పంచాయతీ కార్యదర్శులకు బదిలీలకు సంబంధించిన జీవో 38 ప్రకారం కొన్ని నిబంధనలు కచ్చితంగా అమలు చేయాల్సి ఉంది. బదిలీల్లో భాగంగా కౌన్సెలింగ్‌లో ఒకే చోటును ఒకరి కంటే ఎక్కువ మంది కోరుకున్న పక్షంలో స్పౌజ్ (భార్యాభర్తలు) విభాగానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. భర్త ఎక్కడ పనిచేస్తే అదే ప్రాంతంలో భార్యకు పోస్టింగ్ ఇవ్వాలనే నిబంధన మేరకు స్పౌజ్ కోటాకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. అలాగే ఆ తరువాత 31-05-2027 లోపు పదవీ విరమణ చేసే ఉద్యోగులకు రెండో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. ఉద్యోగి 70 శాతం మేర వికలాంగుడై ఉన్న పక్షంలో మూడో ప్రాధాన్యం, ఉద్యోగి పిల్లలు మానిసిక వికలాంగులై ఉన్న పక్షంలో నాలుగో ప్రాధాన్యం, భర్త మరణించిన ఉద్యోగినికి ఐదో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంది. అలాగే క్యాన్సర్, లివర్, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారికి ఆరో ప్రాధాన్యం, పూర్తిగా మారుమూల పంచాయతీల్లో పని చేసిన (హార్డ్ చిప్ ఏరియాలు) వారికి ఏడో ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా, ఇక సీనియారిటీని ఎనిమిదో ప్రాధాన్యతగా పరిగణలోకి తీసుకోవాలనే నిబంధనలు ఉన్నాయి.
- పైరవీ లేఖలతో పరేషాన్...
జీవో నంబర్ 38 ప్రకారం పై నిబంధనల మేరకు పంచాయతీ కార్యదర్శులకు కౌన్సెలింగ్ ఏర్పాటు చేసి ప్రాధాన్యతలకు అనుగుణంగా ఎంచుకున్న గ్రామంలో పోస్టింగ్ ఇవ్వాల్సి ఉంది. జిల్లా అధికారులు పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో నిబంధనలు అమలు చేస్తారా...? లేక పైరవీలకే పెద్దపీట వేస్తారా...? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉండగా, జిల్లాలో స్థాన చలనం కలుగనున్న 97 మంది పంచాయతీ కార్యదర్శుల్లో సింహభాగం పైరవీలకు తెరతీసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇందుకుగాను జిల్లాలో ఉన్న మంత్రితోపాటు ఎమ్మెల్యేల పైరవీ కోసం తీవ్రంగా ప్రయత్నించి సఫలీకృతులైనట్లు తెలుస్తోంది. బదిలీ అయ్యే పోస్టుల్లో దాదాపు 70 మందికి ఆయా ప్రజా ప్రతినిధుల నుంచి పైరవీ ఉన్నట్లు సమాచారం. కొందరు ప్రజాప్రతినిధులు అధికారికంగా లేఖలు జారీ చేయగా, ఒకరిద్దరు మాట సాయం చేసినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో పెద్దఎత్తున పైరవీలు చేసినట్లు ప్రచారం జరుగుతుండగా, నిబద్దతతో పనిచేసిన వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. బదిలీల్లో ఒకవేళ పైరవీలకు పెద్దపీట వేస్తే ఆ ప్రయత్నం చేసిన వారంతా తాము కోరుకున్న చోటుకు వెళ్తుండగా, మిగిలిన పోస్టింగ్‌లు తమకు కేటాయిస్తారేమోనన్న ఆందోళనలో మిగతా పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు. పంచాయతీ కార్యదర్శుల బదిలీలకు నిబంధనలకు అనుగుణంగా, కౌన్సెలింగ్ నిర్వహించడం ద్వారాపారదర్శకంగా చేపట్టాలని పంచాయతీ కార్యదర్శుల సంఘాలు కోరుతున్నాయి.